Viksit Bharat Shiksha Adhikshan : ప్రైవేటు విద్యా సంస్థల మూకుతాడుకు
ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణకు కేంద్రం కీలక బిల్లు తీసుకొచ్చింది. యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్‌సీటీఈలను రద్దు చేసి ‘వికసిత్ భారత్ శిక్షా అధిక్షన్’ ఏర్పాటు చేయనుంది.
దేశంలో ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణ, నిరంతర పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మూడు విద్యా నియంత్రణా సంస్థలను రద్ధు చేసింది. మూడింటి స్థానంలో కొత్తగా నియంత్రణ సంస్థ ను తీసుకువస్తున్నది. దీని పేరును వికసిత్ భారత్ శిక్షా అధిక్షన్ గా ఖరారు చేస్తూ కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ)లో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు.
దేశంలో ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్.సి.టీ.ఈ) పనిచేస్తున్నాయి. ఉన్నత విద్యలో సాంకేతికయేతర అంశాలను పర్యవేక్షించేందుకు 1956 సంవత్సరంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. సాంకేతిక విద్య ను నియంత్రించేందుకు 1945 లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ను స్థాపించారు. టీచర్ ఎడ్యుకేషన్ కోసం 1995 సంవత్సరంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఈ మూడు సంస్థలు పూర్తిగా వైఫల్యం చెందడంతో పాటు సమన్వయం లేకుండా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మూడింటిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, వికసిత్ భారత్ శిక్షా అధిక్షన్ సంస్థను కొత్తగా ప్రతిపాదించారు. అయితే వైద్య విద్య, న్యాయ విద్య కోసం పనిచేస్తున్న సంస్థలను మినహాయించారు. కొత్తగా ఏర్పాటు కానున్న సంస్థ ఇకనుంచి నియంత్రణ తో పాటు గుర్తింపు ఇచ్చే అధికారాలను కలిగియుండడంతో పాటు వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంపొందించనున్నాయి. అయితే నిధుల కేటాయింపు అధికారాన్ని మాత్రం మంత్రిత్వ శాఖ పరిధిలోనే పెట్టారు. 2018 లోనే యూజీసీ యాక్టును రద్ధు చేసి సెంట్రల్ కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ సంస్థలో పనిచేస్తున్న వారి నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో ప్రతిపాదనను రద్ధు చేసుకున్నది. 2021 లో కేంద్ర విద్యా శాఖ మంత్రిగా దర్మేంధ్ర ప్రధాన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత పాత ప్రతిపాదనను మళ్లీ దుమ్ము దులిపి వికసిత్ భారత్ శిక్షా అధిక్షన్ బిల్లు గా మార్పు చేసి కేంద్ర మంత్రి మండలి ముందు పెట్టారు. పార్లమెంటు లో బిల్లు ప్రవేశపెట్టిన తరువాత బిల్లు కాస్త చట్టంగా మార్పు చెందనున్నది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram