• Telugu News
  • /National

Revanth Reddy Delhi Tour | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబీజీ !

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. విమానాశ్రయాలు, రైల్వే ప్రాజెక్టులు, గాంధీ సరోవర్‌పై చర్చలు జరిపారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 12, 2026, 3:14 pm IST
Read Time: 5 mins
Revanth Reddy Delhi Tour | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబీజీ !

న్యూఢిల్లీ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ది ప్రాజెక్టుల సాధనలో బిజీబిజీగా ఉన్నారు. తొలి రోజు బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేను కలిసి రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, పార్టీ రాజకీయాలు, ప్రభుత్వ పనితీరు, మున్సిపల్ ఎన్నికలల సాధించబోయే విజయాలను రేవంత్ రెడ్డి ఆయనకు వివరించారు. ఈ సందర్బంగా మంత్రివర్గ విస్తరణ, శాఖల మార్పు, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై కూడా ఖర్గేతో చర్చించారు. అనంతరం రెండో రోజు గురువారం కేంద్ర రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పాటు పౌరవిమానయన శాఖ మంత్రి కే. రామ్మోహన్‌నాయుడులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయినందున అవసరమైన పనులు చేపట్టాలని రామ్మోహన్‌నాయుడికి సీఎం విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌కు పాల్వంచలో స్థలం గుర్తించామని.. ఓఎల్‌ఎస్‌ సర్వే, ఫీజుబిలిటీ స్టడీ నిర్వహించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో అంతర్గాం ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యామ్నాయ స్థలం గుర్తించినందున వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రికి సీఎం వినతిపత్రం అందజేశారు. ఆదిలాబాద్ ప్రతిపాదిత విమానాశ్రయానికి సంబంధించి అదనంగా 249.82 ఎకరాలు కేంద్రానికి అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని, వెంటనే పనులు మొదలు పెట్టాలని కోరారు.

అనంతరం రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను రేవంత్‌ కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. అంతకుముందు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలతో కలిసి భేటీ అయ్యారు. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో ఈసా, మూసీ నదుల సంగమ ప్రాంతంలో తలపెట్టిన “గాంధీ సరోవర్ ప్రాజెక్టు” శంకుస్థాపన కార్యక్రమానికి రాజ్ నాథ్ సింగ్ ను ఆహ్వానించారు.

అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోనుందని తెలిపారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ సహా పలు రాజకీయ, రాష్ట్ర ప్రభుత్వ పాలనా నిర్ణయాలపైన చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకసభ పక్షనేత రాహుల్ గాంధీని కలిసేందుకు వెళ్లారు.

ఇవి కూడా చదవండి :

Allu Arjun | అల్లు అర్జున్ పాడ్‌కాస్ట్ వివాదం.. 42 షరతుల జాబితా సోషల్ మీడియాలో వైరల్
Malavika Mohanan | హ్యాండ్లూమ్ శారీలో మెరిసిపోతున్న పాయల్ మాళవిక మోహనన్