ఆ మూడూ వేర్వేరు అంశాలు…. ఒకదానితో మరోటి ముడిపెట్టవద్దు : మోదీకి రేవంత్‌ రెడ్డి లేఖ

మహిళల రిజర్వేషన్, పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అనేవి మూడు వేర్వేరు అంశాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. వాటిని ఒకదానితో ఒకటి ముడిపెట్టి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రేవంత్‌ రెడ్డి లేఖ రాశారు.

విధాత, హైదరాబాద్

మహిళల రిజర్వేషన్, పునర్విభజన, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను ఒకదానితో ఒకటి ముడిపెట్టి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి పూర్తిగా వేర్వేరు విషయాలని స్పష్టం చేశారు. మహిళల రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లలోనే 33 శాతం మహిళల రిజర్వేషన్‌ను యథాతథంగా వెంటనే అమలు చేయాలని, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా అమలు చేయాలని కోరారు. మహిళల రాజకీయ సాధికారత కేవలం చట్టపరమైన మార్పు మాత్రమే కాదు, అది ప్రజాస్వామ్యానికి ఒక నైతిక అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి రేవంత్‌ రెడ్డిలేఖ రాశారు.

దేశ ప్రజాస్వామ్య భవిష్యత్తుపై ప్రభావం కలిగించే అంశమైనందున బాధ్యతతో అత్యవసరంగా ఈ లేఖ రాసినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా జాతీయ స్థాయిలో విస్తృత చర్చలు జరపాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. అన్ని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని రాష్ట్రాలు, రాజకీయ పార్టీల అభిప్రాయాలు, ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పునర్విభజనకు సంబంధించి గతంలో కూడా సీట్ల సంఖ్య పెంచకుండా కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మార్చుతూ డీలిమిటేషన్ నిర్వహించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అలాంటి ప్రక్రియను చేపట్టవచ్చని తెలిపారు. లోక్‌సభ సీట్లను 850కు పెంచే ప్రతిపాదన అసలైన వివాదాస్పద అంశమని పేర్కొన్నారు. ప్రస్తుత సీట్లను పెంచి వాటిని ప్రోరాటా పద్ధతిలో కేటాయించే ఆలోచనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల రిజర్వేషన్‌కు పూర్తి మద్దతు ఇవ్వటంతో పాటు, సీట్ల సంఖ్య పెంపు లేకుండా డీలిమిటేషన్‌కు తాము పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.

జనాభా లేదా ప్రోరాటా పద్ధతిలో లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదనను అనేక రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు అంగీకరించబోవని తెలిపారు. ప్రోరాటా పద్ధతిలో అమలు చేస్తే దేశంలో తలెత్తబోయే పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. 1970ల నుంచి దేశం జనాభా నియంత్రణ విధానంపై దృష్టి పెట్టినప్పటికీ, రాష్ట్రాల వారీగా జనాభా నియంత్రణ అమలు జరిగిన తీరు భిన్నంగా ఉందన్నారు. జనాభాలో తేడాల వల్ల జాతీయ ఐక్యతపై ప్రభావం పడే ప్రమాదాన్ని గుర్తించి, ఇందిరా గాంధీ, అటల్ బిహారి వాజ్‌పేయి వంటి నాయకులు ఈ అంశాన్ని ఒక్కోసారి 25 సంవత్సరాల పాటు వాయిదా వేసినట్లు లేఖలో తెలిపారు. ఆర్థిక సహకారం, సామాజిక, మానవ అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రోరాటా పద్ధతిలో సీట్ల పెంపు చేస్తే దేశ సమాఖ్య సమతుల్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అన్ని ప్రాంతాల సమాన ప్రాతినిథ్యం దేశానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. సీట్ల పెంపుతో దక్షిణ రాష్ట్రాలపై పడే ప్రభావాన్ని కేంద్రం పూర్తిగా విశ్లేషించలేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు దశాబ్దాలుగా జనాభా స్థిరీకరణ, ఆరోగ్యం, మానవ అభివృద్ధి రంగాల్లో కృషి చేశాయని తెలిపారు. ఇవన్నీ జాతీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా చేపట్టిన చర్యలని ఆయన గుర్తుచేశారు.

ప్రస్తుత ప్రతిపాదనతో ఈ రాష్ట్రాలన్నీ నిర్మాణాత్మకంగా నష్టపోతాయని, రాజకీయంగా బలహీనపడే పరిస్థితి ఏర్పడుతోందని రేవంత్ రెడ్డి లేఖలో తెలిపారు. ప్రోరాటా మోడల్ కేవలం గణాంకాల మార్పుగా కాకుండా, రాజకీయ అసమతుల్యతకు దారి తీస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు నిధుల పంపిణీలో ఇప్పటికే పక్షపాతం, వివక్ష ఉన్నట్లు తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎక్కువ నిధులు పొందుతుంటే, తెలంగాణకు తక్కువ నిధులు వస్తున్నాయని ఉదాహరణగా చెప్పారు. ఇది దక్షిణాది-ఉత్తరాది అసమానతకు సంకేతమని పేర్కొన్నారు. నిధుల వివక్షకు అదనంగా ఇప్పుడు సీట్ల పెంపు కారణంగా రాజకీయంగా అన్యాయం జరుగుతుందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా సహకరించినప్పటికీ, పార్లమెంట్‌లో వారి ప్రాధాన్యం తగ్గిపోతుందని, జనాభా పెరుగుదల ఎక్కువగా ఉన్న ఉత్తరాది-మధ్య ప్రాంత రాష్ట్రాలు లాభపడతాయని తెలిపారు. అభివృద్ధిలో పాలుపంచుకున్న రాష్ట్రాలకు శిక్ష పడుతుందని, జనాభా పెరిగిన రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇది అంకెల విషయం కాదని, దేశ సమగ్రత, సమానత్వం, న్యాయానికి సంబంధించిన ప్రాథమిక అంశమని స్పష్టం చేశారు. దక్షిణ రాష్ట్రాలు జాతీయ ఆదాయానికి నిరంతరం సహకరిస్తూ, సుపరిపాలన, అభివృద్ధి ప్రమాణాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఈ కృషిని పట్టించుకోకుండా దేశ ఐక్యతపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.

ప్రోరాటా మోడల్‌ను దక్షిణ రాష్ట్రాలు అంగీకరించవని, ఈ అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉత్పన్నమవుతుందన్నారు. అందరికీ న్యాయం జరిగేలా ఒక స్థిరమైన పరిష్కారం అవసరమని రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు. హైబ్రిడ్ మోడల్‌ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని పేర్కొన్నారు. అందరి ప్రాతినిధ్యంతో పాటు అన్ని రాష్ట్రాల సహకారాన్ని ఈ మోడల్ సమతుల్యం చేస్తుందని వివరించారు. సుప్రీంకోర్టు సూచించిన 50 శాతం– 50 శాతం విధానాన్ని ఉదాహరణగా ప్రస్తావించారు. హైబ్రిడ్ మోడల్ ప్రకారం, కొత్తగా పెంచే సీట్లలో సగాన్ని ప్రోరాటా పద్ధతిలో, మిగతా సగాన్ని రాష్ట్రాల ఆర్థిక భాగస్వామ్యం (జీ.ఎస్.డీ.పీ), అభివృద్ధి ప్రమాణాల ఆధారంగా కేటాయించాలని సూచించారు. స్వామి వివేకానంద చెప్పినట్లుగా, మన ఆలోచనలకు తలుపులు తెరిచి కొత్త భావనలు స్వీకరిస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థ మరియు ప్రక్రియ అందరికీ న్యాయంగా, ఆమోదయోగ్యంగా ఉండే ఉత్తమ పరిష్కారాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. హైబ్రిడ్ మోడల్ ద్వారా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోకుండా ఉండటంతో పాటు, ప్రజాస్వామ్య ప్రాతినిధ్య సూత్రం అమలవుతుందన్నారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపి, అన్ని రాష్ట్రాలు మరియు రాజకీయ పార్టీలతో కలిసి ఒక ఏకాభిప్రాయానికి రావాలని కోరారు. భారతదేశ బలం భిన్నత్వంలో ఏకత్వమని, ఇలాంటి కీలక నిర్ణయాలు ఆ ఏకత్వాన్ని బలోపేతం చేసేలా ఉండాలని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అందరికీ న్యాయం చేసే పరిష్కారాన్ని కనుగొంటుందని తన లేఖలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

స్టాలిన్ కు లేఖ…

దేశంలో లోక్‌సభ సీట్లను ప్రోరాటా పద్ధతిలో పెంచే ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని, దీనికి వ్యతిరేకంగా నిలబడాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. మహిళల రిజర్వేషన్, డీలిమిటేషన్, లోక్‌సభ సీట్ల పెంపు అనే మూడు వేర్వేరు అంశాలను కలిపి ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని తన లేఖలో ప్రస్తావించారు. లోక్‌సభ సీట్లను 543 నుంచి 850కు పెంచి ప్రోరాటా పద్ధతిలో పంచితే దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యం తగ్గిపోతుందని అప్రమత్తం చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకునే రాష్ట్రాలు నష్టపోతూ, జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు లాభపడే పరిస్థితి వస్తుందని అన్నారు. అందుకే అన్ని రాష్ట్రాలకు న్యాయం జరిగేలా హైబ్రిడ్ మోడల్‌ను పరిశీలించాలని, ఈ అంశంపై రాష్ట్రాలు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన స్టాలిన్ ను కోరారు.

Latest News