తమిళనాడులో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే చీఫ్, సీఎం సీజే.విజయ్ రేపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోనున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ టీవీకే కు చెందిన తిరుప్పత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని ఓటింగ్ లో పాల్గొనరాదని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వానికి మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్యా బలం 119కి పడిపోయింది. మెజార్టీ మార్క్ 118. విజయ్ టీవీకే పార్టీకి 106తో పాటు.. మద్దతు తెలిపిన కాంగ్రెస్ 5 సీట్లు, రెండు సీట్ల చొప్పున ఉన్న వీసీకే, సీపీఎం, సీపీఐ, ఐయూఎంఎల్ (IUML) పార్టీల సంఖ్యా బలంతో కలిపి ప్రభుత్వ బలం 119కి చేరింది. అయితే శ్రీనివాస సేతుపతి హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తిరుప్పత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన టీవీకే అభ్యర్థి శీనివాస సేతుపతి తన ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థి పెరియకురుప్పన్ పై కేవలం ‘ఒక్క ఓటు’ తో విజయం సాధించారు. అయితే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తప్పు జరుగడంతోనే తాను ఓడిపోయానంటూ పెరియ కురుప్పన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ అనంతరం.. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సభకు దూరంగా ఉండాలని, ఓటింగ్ లో పాల్గొనరాదని హైకోర్టు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిని ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108స్థానాల్లో గెలువగా..రెండు స్థానాల్లో గెలిచిన విజయ్ ఒక ఓటు మాత్రం వేయాల్సి ఉంటుంది. దీంతో టీవీకే బలం 107కు పరిమితం కాగా..శ్రీనివాస సేతుపతి ఎన్నిక వివాదంపై హైకోర్టు ఆదేశాలతో టీవీకే బలం 106కు పడిపోయింది.
విజయ్ కి ఏఎంఎంకే ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ మద్దతు
సీఎం విజయ్ ప్రభుత్వానికి తాను మద్దతునిస్తున్నట్లుగా ఏఎంఎంకే ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ మంగళవారం ప్రకటించారు. దీంతో విజయ్ ప్రభుత్వ బలం 120కి చేరింది. దీనికి తోడు ఏఐఏడీఎంకే చీలిక వర్గమైన.. సీనియర్ నేత షణ్ముగం తన వర్గం 30 మంది ఎమ్మెల్యేలతో టీవీకే చీఫ్ విజయ్‌కు మద్దతు ప్రకటించారు. రేపు అసెంబ్లీలో విజయ్ బలనిరూపణ పరీక్షలో వీరు ప్రభుత్వానికి అండగా నిలవనుండటంతో విజయ్ బలం 150కి చేరనుంది. అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి పక్షాన ప్రస్తుతం 17మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేకు 47 సీట్లు వచ్చాయి.
మరోవైపు విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన ఏఎంఎంకే ఎమ్మెల్యే ఎస్.కామరాజ్ ను ఆ పార్టీ అధినేత దినకరన్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా కామరాజ్ వ్యవహరించారని దినకరన్ సీరియస్ అయ్యారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని బాధ్యతల నుంచి కామరాజ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి :
అన్నాడీఎంకేలో చీలిక..సీఎం విజయ్ కి పెరిగిన మద్దతు
Trisha | విజయ్ రాజకీయ విజయానికి త్రిషే లక్కీ చార్మ్..? తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారిన స్టార్ జోడీ!
