- వివిధ రాష్ట్రాల నుంచి పోటెత్తిన విద్యార్థులు
- సొంత ఖర్చులతోనే ఢిల్లీకి.. కొందరు రాత్రి నుంచి ఇక్కడే
నీట్ పేపర్ లీకేజీ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ శనివారం జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. స్కూలు, కాలేజీ విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆన్‌లైన్ ఉద్యమం సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే.. తమ డిమాండ్ల పరిష్కారాన్ని వదిలేసి, సంస్థ సోషల్ మీడియా యాక్టివిటీస్‌ను టార్గెట్ చేయడంపై మండిపడ్డారు. పోటీ పరీక్షలు, రిక్రూట్‌మెంట్ల టెస్ట్‌లలో అవకతవకల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తల మధ్య ప్రారంభమైన నిరసన కార్యక్రమం.. ఉద్యమ నేతలు చెబుతూ వచ్చినట్టు చివరకు ప్రశాంతంగానే ముగిసింది. అయితే.. రెండు గ్రూపుల మధ్య గొడవలు చెలరేగే అవకాశం ఉందన్న కారణంగా దానిని నిరోధించేందుకంటూ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యా శాఖను సోనమ్ వాంగ్ చేపట్టాలని నిరసనలో పాల్గొన్న వారు డిమాండ్ చేయగా, తనకు రాజకీయాల్లో ప్రవేశించాలనే ఆలోచన లేదని, యువకులే ఈ బాధ్యత చేపట్టాలని ప్రతిస్పందించారు. నిరసన తెలపడం తనకు ఇష్టం లేదని, న్యాయం కోసమే ఈ రోజు వచ్చానన్నారు. వ్యవస్థపై నమ్మకం కోల్పోయాని, బీజేపీ తో పాటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విషయంలో వైఫల్యం చెందాయని నిరసనకారులు నినాదాలు చేయడం గమనార్హం.
దేశం నలు మూలల నుంచి వెల్లువెత్తిన విద్యార్థులు
సీజేపీ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరుకావడం.. పరీక్ష పత్రాల లీకేజీపై వారి ఆగ్రహావేశాలను చాటింది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు 26 ఏళ్ల రవికుమార్ తన సోదరిని వెంటబెట్టుకొని బీహార్ నుంచి వచ్చాడు. ఆమె రెండేళ్లుగా తాను నీట్ పరీక్ష కోసం ప్రిపేర్ అవుతున్నది. తమ లాంటి కుటుంబాలకు ఈ పోటీ పరీక్షలు.. తమ జీవితాలను మార్చుకొనే అవకాశాలని ఆయన అన్నాడు. ‘ఆమె పడిన కష్టాన్ని చూశాను. ఇప్పుడు అది వివాదాస్పదం కావడం తీవ్ర ఆక్రోశానికి గురిచేస్తున్నది. మేం ఇక్కడికి గొడవ చేయడానికి రాలేదు.. మా ఆందోళనలను పట్టించుకోవాలన్నదే మా ఉద్దేశం’ అని ఆయన తెలిపాడు.
సొంత ఖర్చులతో వచ్చాం..
ఇక సాహిల్ అనే విద్యార్థితోపాటు సుమారు 50 మంది పశ్చిమబెంగాల్ నుంచి వచ్చారు. వాళ్లంతా సొంతగా ప్రయాణ ఖర్చులు భరించి వచ్చినవారే కావడం గమనార్హం. వాళ్లందరి డిమాండ్ ఒక్కటే.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ‘మా నిరసన కార్యక్రమం జయప్రదమైందని భావిస్తున్నాను. ఈ నిరసన.. మన విద్యావ్యవస్థను కాపాడుకొనేందుకు, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేందుకు’ అని సాహిల్ చెప్పాడు.
మా తరానికి కోపం చాలా ఎక్కువ
ఏ మాత్రం సిగ్గుపడకుండా రాజకీయాల్లోకి వచ్చేందుకు ఈ ఉద్యమం యువతకు అవకాశం ఇచ్చిందని ఢిల్లీకి చెందిన ఎంబీఏ విద్యార్థి ఫత్యాజూటె అన్నారు. హాస్పిటళ్లలో పరిస్థితులు, రోడ్లపై గుంతల అంశాలను ప్రస్తావిస్తూ.. ‘మా తరానికి కోపం చాలా ఎక్కువ’ అని అతడు వ్యాఖ్యానించాడు. ‘ఇప్పటికే కోపం ఉంది. దీన్ని ఎటు మళ్లించాలనేది ఇప్పుడు మాకు తెలిసింది. పరీక్ష పత్రాల లీకేజీతో ప్రభావితం కాని వారు కూడా ఇక్కడకు వచ్చారు. ఎందుకంటే.. తదుపరి తరానికి న్యాయం కోరుతూ’ అని ఆయన అన్నారు.
రాత్రంతా ఇక్కడే ఉన్నాం
ఇక్కడికి రావడం కోసం తాము పడిన కష్టాన్ని పీక్ టీవీతో పంచుకున్న ఒక వ్యక్తి.. ‘మేం ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ నుంచి ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చాం. నిన్న ఐదు గంటలకు ఇంటి నుంచి బయల్దేరాం. రాత్రంతా ఇక్కడే గడిపాం’ అని వెల్లడించాడు. రాజకీయాలతో సంబంధం లేకుండా వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడకు చేరుకున్నారని ఆయన అన్నాడు. ‘మేం ఏ రాజకీయ పార్టీకీ చెందినవాళ్లం కాదు. మేం వేర్వేరు ప్రాంతాలకు చెందిన విద్యార్థులం. 2024, 2025లో నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయినవాళ్లం. ఈ రెండు పేపర్లూ లీక్ అవడాన్ని చూసినవాళ్లం’ అని అతడు చెప్పాడు.
విద్యార్థుల భవితవ్యం కోసం ఏకమవుతాం : అభిజీత్
అంతకు ముందు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే.. అమెరికా నుంచి ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నాడు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి, కేంద్ర విద్యా మంత్రి రాజీనామాను డిమాండ్ చేద్దామంటూ పిలుపునిచ్చాడు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఇంకెంత కాలం ఎదురు చూస్తాం.. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ‘బొద్దింక’లన్నీ భారతదేశ విద్యార్థుల భవితవ్యం కోసం ఏకమవ్వాలి’ అని అన్నాడు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. నిరసన చేపడితే జైలులో వేస్తారని తన తల్లి ఆందోళన వ్యక్తం చేసిందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తే ఏమవుతుందోనన్న భయం ప్రతి తల్లికి ఉందన్నారు. ఇంకా ఎంతకాలం ఇలా భయంభయంతో బ్రతకాలి అని ఆయన ప్రశ్నించారు. నెల రోజులుగా మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ప్రజలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దాని బదులు సీజేపీ ఖాతాలను హ్యాక్ చేయడం, తమ పోస్టులను సామాజిక మాద్యమాల నుంచి తొలగించడం చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థలో తప్పిదాల మూలంగా చనిపోయిన విద్యార్థుల పేర్లను చదివి విన్పించారు. తమ నిరసన ఈ రోజుతో ముగిసి పోదని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కొనసాగుతుందని సీజేపీ ప్రకటించింది. ఈ నెల 23న రామ్ లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని హెచ్చరించారు.
మంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయాల్సిందే…
విద్యా విధానం లో జరుగుతున్న తప్పిదాలపై ఒకరిని బాధ్యుడిగా చేయాలని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో రాజకీయ అనుబంధంపై మీడియా ప్రతినిధులు అడగ్గా, మా గురించి ఎవరు ఏమైనా చెప్పవచ్చు, కాని వాస్తవ పరిస్థితులను చూడగలమని దేశ యువత నిరూపించిందన్నారు. సీజేపీపై అనేక ముద్రలు, నిందలు వేశారని, మాకు అపఖ్యాతి తెచ్చేందుకు ఒక పార్టీ ఐటీ సెల్ విపరీతంగా పనిచేస్తోందని మండి పడ్డారు. ఇవాళ జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనకు వేలాదిగా తరలి వచ్చిన యువత మా అసలు లక్ష్యాన్ని అర్థం చేసుకుందన్నారు.
