మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగిన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ, మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించడంపై కాంగ్రెస్ హైకమాండ్ బృందం బుధవారం కేంద్ర ఎన్నికల కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసింది. మీనాక్షిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, రిటర్నింగ్ అధికారి నామినేషన్ తిరస్కరించడం పూర్తిగా అప్రజాస్వామికం, అనైతికం, నిబంధనలకు విరుద్దం అని కాంగ్రెస్ బృందం తమ ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే మీనాక్షి నామినేషన్ ను అనుమతించి పోటీకి అవకాశం ఇవ్వాలని కోరింది.
సీఈసీ మీనాక్షి నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. సీఈసీని కలిసిన వారిలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.వేణుగోపాల్, సీనియర్ నాయకులు జై రామ్ రమేశ్, అభిషేక్ సింఘ్వీ సహా 10మంది నాయకులు ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో మూడు రాజ్యసభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి మెజారిటీ ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండటంతో ఆ పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులు సులువుగా విజయం సాధించగలరు. మూడో సీటు గెలిచేందుకు కావాల్సిన 58మంది ఎమ్మెల్యేల బలం కాంగ్రెస్ కు ఉంది. అయితే మూడో సీటు కోసం కాంగ్రెస్ నుంచి మీనాక్షీనటరాజన్ ను బరిలోకి దించింది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్ లో అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి గెలువవచ్చన్న ఆలోచనతో బీజేపీ నుంచి మహేశ్‌కేవత్‌ను పోటీకి దించారు.
సోమవారంతో నామినేషన్ల గడువు ముగియడంతో మంగళవారం నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలించారు. తెలంగాణలోని ఒక కోర్టులో మీనాక్షిపై క్రిమినల్ కేసు పెండింగ్‌లో ఉన్నదని, ఈ వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనకుండా ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారంటూ బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేసి అందుకు ఆధారాలు సమర్పించారు. దీంతో ఆమె నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించడంతో వివాదం రాజుకుంది.
