Sitaram Yechury । సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం..

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమంగా ఉన్నది. శ్వాసకోశ సమస్యలపై ఆయనకు ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స జరుగుతున్నది.

Sitaram Yechury । సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం..

Sitaram Yechury । సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఆరోగ్యం విషమంగా ఉన్నది. తీవ్ర జ్వరంతో ఆయన ఆగస్ట్‌ 19వ తేదీన ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS)లో చేరారు. అక్కడ తీవ్ర శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌కు (acute respiratory tract infection) ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ICU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు వివిధ రంగాల స్పెషలిస్టుల వైద్య బృందం చికిత్స చేస్తున్నదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని సీపీఐ (ఎం) (CPI(M)) తన ఎక్స్‌ ఖాతాలో వెల్లడింది. ఆయనను రెస్పిరేటరీ సపోర్టు(respiratory support)పై ఉంచారని పేర్కొన్నది. అయితే.. న్యుమోనియాతో ఆయన హాస్పిటల్‌లో చేరారని తెలుస్తున్నది. అయితే.. ఆగస్ట్‌ 31న సీపీఎం విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు శ్వాసకోశ సంబంధిత సమస్యలపై చికిత్స జరుగుతున్నదని వెల్లడించింది.

ఆగస్ట్‌ 22న పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం దిగ్గజ నేత బుద్ధదేవ్‌ భట్టాచార్య (Buddhadev Bhattacharya) మరణానంతరం ఆరు నిమిషాల వీడియోను తన ఎక్స్‌ ఖాతాలో ఏచూరి పోస్టు చేశారు. మరుసటి రోజు జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల (assembly election) నేపథ్యంలో సీపీఎం, కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ మధ్య సంఘీభావంపై మరో మెసేజ్‌ పోస్టు చేశారు. ఆగస్ట్‌ 29న కూడా తన సన్నిహిత మిత్రుడు అబ్దుల్‌ గఫార్‌ నూరానీ మరణానికి సంతాపం తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టారు.

సీతారాం ఏచూరి ఇటీవలే కాటరాక్ట్‌ ఆపరేషన్‌ (cataract surgery) చేయించుకున్నారు. గతంలో సీపీఎం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ (Harkishan Singh Surjeet) తరహాలోనే సంకీర్ణాల నిర్మాణంలో ఏచూరి కృషి చేస్తూ వచ్చారు. 1996లో నాటి యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వ (United Front government) కనీస ఉమ్మడి ప్రణాళిక రచనలో కాంగ్రెస్‌ నేత పీ చిదంబరంతో కలిసి ఏచూరి పనిచేశారు. 2004లో యూపీఏ సంకీర్ణ కూటమి ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించారు. ఎమర్జెన్సీలో 1975లో జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(JNU)లో విద్యార్థిగా ఉన్న సమయంలో ఆయన అరెస్టయ్యారు. 1977 నుంచి 1978 జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎస్‌ఎఫ్‌ఐ తరఫున ఎన్నికయ్యారు.