బాంబు బెదిరింపుల వెనుక చైనా, ఐఎస్‌ఐపై పోలీసుల అనుమానం

దేశ రాజధానిలో బుధవారం 130కిపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన కేసులో వ్యక్తి కన్నా సంస్థపై ఢిల్లీ పోలీస్‌ యాంటిటెర్రరిస్ట్ యూనిట్‌ దృష్టిసారించనున్నది

బాంబు బెదిరింపుల వెనుక చైనా, ఐఎస్‌ఐపై పోలీసుల అనుమానం
  • వ్యక్తి చేసిన పనికాదు.. సంస్థ చేసిన పనేమో!
  • ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం
  • బలమైన సర్వర్‌ వాడారు.. భారీ కుట్రే జరిగింది
  • ఢిల్లీ స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ సెల్‌ అనుమానాలు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో బుధవారం 130కిపైగా స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చిన కేసులో వ్యక్తి కన్నా సంస్థపై ఢిల్లీ పోలీస్‌ యాంటిటెర్రరిస్ట్ యూనిట్‌ దృష్టిసారించనున్నది. ఈ బాంబు బెదిరింపు భారీ కుట్రగా కనిపిస్తున్నదని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఎన్నికల సమయంలో బెదిరింపులు రావడం, స్కూళ్ల వివరాలు పెద్ద ఎత్తున సేకరించడం, రష్యన్‌ ఐపీ అడ్రస్‌ను ఉపయోగించడం ఇవన్నీ గమనిస్తే భారీ కుట్ర జరిగిందన్న అనుమానాలు రేకిస్తున్నదని’ ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో ఐఎస్‌ఐ (పాకిస్థాన్‌ గూఢచార సంస్థ) ఉన్నదా? లేదంటే ఏదైనా చైనా సంస్థ జోక్యం ఉన్నదా? అనే అంశంపై కూడా దర్యాప్తు సాగుతుందని తెలిపాయి. ‘బలమైన సర్వర్‌ను ఉపయోగించిన నేపథ్యంలో చైనాపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే.. దర్యాప్తు ప్రస్తుతం చాలా ప్రాథమిక దశలో ఉన్నది’ అని ఆ వర్గాలు చెప్పాయి. బెదిరింపులు వచ్చిన అన్ని స్కూళ్లలో తనిఖీలు నిర్వహించగా.. ఎలాంటి పేలుడు పదార్థాల జాడలు కనిపించలేదు.
ఈ మెయిల్స్‌ ద్వారా స్కూళ్లను బెదిరించిన కేసులో ఐపీసీ 120బీ, 506 సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేశారు. బెదిరింపు మెయిల్‌ పంపేందుకు ‘sawariim@mail.ru’ అనే ఈ మెయిల్ అడ్రస్‌ను వాడారని బుధవారం రాత్రి ఢిల్లీ పోలీసులు చెప్పారు. సావరిమ్‌ అనే అరబిక్‌ పదాన్ని ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ గత కొన్నేళ్లుగా వారి ప్రచార వీడియోలలో పెద్ద ఎత్తున ఉపయోగిస్తుంటుందని అధికారులు తెలిపారు.

మీకు కనిపించినవారినల్లా చంపేయండి. వీరు వెళ్లిన చోట్ల వారిని బయటకు తరిమేయండి. స్కూల్‌లో అనేక పేలుడు పదార్థాలు ఉన్నాయి… అంటూ ఒకే మెయిల్‌ సందేశం అన్ని అన్ని స్కూళ్లకు వచ్చింది. ఇటువంటి బెదిరింపు మెయిల్స్‌ను బల్క్‌గా పంపడం ఏదైనా ఉగ్రవాద సంస్థ భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు, సైబర్‌ యుద్ధానికి తెగబడే అజెండా అయి ఉంటుందని పేరు రాయడానికి నిరాకరించిన ఒక పోలీస్‌ అధికారి చెప్పారు. ఈ మెయిల్ పంపేందుకు వాడిన ఐడీ sawariim@mail.ru మూలాలు రష్యాలో దొరికాయని, డార్క్‌ వెబ్‌ సహాయంతో దానిని రూపొందించి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఇది ఎన్‌క్రిప్టెడ్‌ ఆన్‌లైన్‌ కంటెంట్‌. దీని వల్ల మెయిల్‌ పంపిన వారి వివరాలు, లొకేషన్‌ ఇతరులు గుర్తించలేరు.