ఒకప్పుడు పేపర్‌ లీకేజీలపై పోరాటం.. నేడు అదే విషయంలో రాజీనామాకు ససేమిరా

మనం చేస్తే ఒప్పు.. వేరొకరు చేస్తే తప్పు అన్నట్టుంది.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యవహారం. ఇప్పుడు నీట్‌ పేపర్‌ లీకేజీకి బాధ్యత తీసుకొనేందుకు ససేమిరా అంటున్న ధర్మేంద్ర ప్రధాన్‌ ఒకప్పడు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఇదే తరహా పేపర్‌ లీకేజీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన ‘ధీరుడు’! తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన పాత పోరాటాలు ఆయనను వెక్కిరించేలా బయటకు వస్తున్నాయి.

1997లో ఒడిశాలో పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా అప్పటికి ఏబీవీపీ నాయకుడిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ భువనేశ్వర్‌లోని రాష్ట్ర సచివాలయాన్ని సహచర విద్యార్థులతో కలిసి ముట్టడించారు. భారీ ర్యాలీగా వెళ్లిన సమయంలో పోలీసుల లాఠీచార్జ్‌లో తీవ్ర గాయాల పాలయ్యారు. ఆ తరువాత ఆయన బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రి స్థాయి వరకు చేరుకున్నారు. ఇప్పుడు అదే తరహా పేపర్‌ లీకేజీ జరిగితే తనకు సంబంధం లేదంటూ చోద్యం చూస్తున్నారు. నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థులు మానసిక క్షోభ, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. తీవ్ర ఆందోళనకు గురైన 21 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. దీనికి ప్రధాన్‌ నైతిక బాధ్యత వహించి, మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్న విషయం తెలిసిందే.

ఏబీవీపీ నాయకుడిగా ప్రధాన్ ప్రస్థానం…

ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం సంబల్‌పూర్‌ నియోజవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు అధికంగా నివాసం ఉంటున్నారు. ఏబీవీపీ నాయకుడిగా 1983 నుంచి ప్రధాన్‌ తన ప్రస్థానం ప్రారంభించారు. ఒడిశాలోని తాల్చర్ కాలేజీలో 1983 సంవత్సరంలో చేరి, 1985లో కాలేజీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పదేళ్ల తరువాత 1995లో ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా నియమితులయ్యారు. రెండు సంవత్సరాల తరువాత ఆయన ఒడిశాలో జరిగిన పేపర్ లీకేజీ, పరీక్షల అవకతవకలపై ఆయన పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఇక అప్పటి నుంచి ఆయన రాజకీయ దిశ తిరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ విద్యార్థులతో కలిసి ర్యాలీలు, బంద్‌లు, వీధి ప్రదర్శనలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించారు. ఆర్ఎండీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రశాంత్ రౌత్ వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 15 వందల మంది విద్యార్థులతో కలిసి భువనేశ్వర్ లోని ఒడిశా సచివాలయం ముట్టడికి బయలుదేరారు. పోలీసులు అడుగడుగునా అడ్డుపడినప్పటికీ ఏమాత్రం ఖాతర్ చేయకుండా సచివాలయం దగ్గరకు చేరుకోవడం ఓపిక నశించిన పోలీసులు కర్రలకు పనిచెప్పారు. పోలీసుల లాఠీ ఛార్జీలో తీవ్రంగా గాయాలపాలై ఆసుపత్రిలో చేరారు. ఆ గాయాలు ఇప్పటికీ ఆయనను తిరగబెడతాయని సహచరులు చెబుతున్నారు. ఆర్ఎండీ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రశాంత్ రౌత్, ధర్మేంద్ర ప్రధాన్ ఉత్కళ్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. యూనివర్సిటీలో ప్రధాన్ జూనియర్ గా ప్రశాంత్ ఉన్నారు. 1997 లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒడిశాలో కొనసాగుతుండగా, జానకీ వల్లభ్ పట్నాయక్ సీఎం గా వ్యవహరించారు.

2024 లో మూడో సారి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రధాన్‌ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు. అంతకు ముందు ఆయన 2021 నుంచి 2024 వరకు స్కిల్ డెవలప్‌మెంట్‌ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2021 వరకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిగా కొనసాగారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరినప్పటీ నుంచి ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగుతునే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి అండదండలు ఫుష్కలంగా ఉండడంతోనే ఆయన కొనసాగుతున్నారని, మరే అర్హత ఆయనకు లేదని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.

కుమార్తె నైమిషా ప్రధాన్‌పై ట్రోల్స్…

ధర్మేంద్ర ప్రధాన్‌కు ఇద్దరు సంతానం. ఒక కుమార్తె నైమిషా ప్రధాన్ ఇండియాలోనే లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాస్టర్ ఇన్ లా అమెరికాలోని మసాచుసెట్స్‌కు వెళ్లి పూర్తి చేశారు. ప్రస్తుతం యూఎస్–ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్‌ ఫోరంలో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్నట్లు సమచారం. కాక్రోచ్‌ పార్టీ ఉద్యమాల నేపథ్యంలో ఆయన కుమార్తె ఉన్నత చదువులపై దేశ వ్యాప్తంగా నిరుద్యోగులు, యువత, విద్యార్థులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో నైమిషా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తాత్కాలికంగా డీయాక్టివేట్ చేసుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. విద్యా శాఖ మంత్రి కుమార్తెగా ఉండి ఇండియాలో చదువుకోకుండా అమెరికాలో చదువుకోవడం షేమ్ షేమ్ అని కామెంట్లు పెడుతున్నారు. ప్రతి సంవత్సరం రూ.70 లక్షలు డొనేషన్, ఫీజులు చెల్లించి చదివారని, ఆ సొమ్మంతా ప్రజలదేనని తిట్టిపోస్తున్నారు. బ్రిటీష్ పాలకుల కన్నా బీజేపీ నేతల తీరు ఘోరమని, పాదర్ డిసేబుల్ కంట్రీ, డాటర్ డిసేబుల్ ఇన్ స్టా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

 

Latest News