• Telugu News
  • /National

ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని కుర్చీని కాపాడారు: ఖర్గే

నీట్ పేపర్ లీక్ వివాదంపై రాజ్యసభలో ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మోదీ కుర్చీని కాపాడారని ఆరోపిస్తూ యాంటీ పేపర్ లీక్ బిల్లును కూడా తప్పుబట్టారు.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 30, 2026, 3:42 pm IST
Read Time: 3 mins
ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని కుర్చీని కాపాడారు: ఖర్గే

నీట్ పేపర్ లీక్..విద్యార్ధుల నిరసనల ఉద్రిక్తతల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ప్రధాని మోదీ కుర్చీని కాపాడారని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టిన యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

నీట్‌ పేపర్‌ లీక్‌ తో చాలా మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, పేపర్‌ లీక్‌ కాకుండా ప్రభుత్వం ఏమాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేదు అని ఖర్గే విమర్శించారు. యాంటీ పేపర్ లీక్ బిల్లు, టాస్క్ ఫోర్సుతో విద్యార్ధులకు లాభం లేదని..బిల్లు కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే రక్షిస్తుందని వ్యాఖ్యానించారు. 2024లోనే ఈ బిల్లును ఎందుకు తీసుకురాలేదు? అని ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థుల నిరసనల పట్ల కేంద్రం దారుణంగా వ్యవహరించిందని, విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారని, దీనిపై ఇప్పటివరకు మోదీ, అమిత్ షా మాట్లాడలేదు అని నిలదీశారు. పోలీసుల చర్యలపైన, లాఠీచార్జ్, టీయర్ గ్యాస్ ప్రయోగాలపైన ఆదేశాలు ఎవరు ఇచ్చారో మోదీ, అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై అమిత్‌షా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ ఘటనకు ఆయన బాధ్యత వహించాల్సిందే అని అన్నారు.

అయితే అమిత్ షా, మోదీలపై ఖర్గే చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి జేపీ నడ్డా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్గే కేంద్రంపై విమర్శలు చేసే క్రమంలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, వాటిని రికార్డులనుంచి తొలగించాలని నడ్డా కోరారు.