ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కొత్త డిస్కషన్ మొదలైంది. ప్రధాన్‌ను వేరే శాఖకు మారుస్తామని ప్రభుత్వం మొదట చేసిన ప్రతిపాదనను కాక్రోచ్ జనతా పార్టీ తిరస్కరించిందని, అందుకే ఆయన రాజీనామా చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే.. వాటిని బీజేపీ ఖండించింది. అవి నిరాధార, ఊహాత్మక కథనాలని పేర్కొన్నది. మంగళవారం (28.7.2026) పార్లమెంట్ హౌస్ కాంప్లెక్ వద్ద మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా.. ఈ కథనాలు విషయాన్ని సంచలనాత్మకంగా మార్చేందుకు, గందరగోళాన్ని సృష్టించేందుకు వండివార్చినవేనని మండిపడ్డారు.
శాఖ మార్పు ప్రతిపాదన?
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనలు సాగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీజేపీ ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేబదులు.. ఆయన శాఖను మార్చుతామని ప్రభుత్వం ప్రతిపాదించిందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే.. ఈ ప్రతిపాదనను సీజేపీ ప్రతినిధులు తిరస్కరించడంతోపాటు.. ప్రధాన్ తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారని ఆ కథనాల సారాంశం. దానికి సంబంధించిన ఒక పత్రిక కథనాన్ని పాత్రా ప్రస్తావించారు. ఈ కథనం పూర్తిగా నిరాధారమని, ఊహాత్మకమని పాత్రా చెప్పారు. విషయాన్ని సెన్సేషనల్ చేసేందుకు రాసినవార్తగా వర్ణించారు. గందరగోళాన్ని సృష్టించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీపై 36 రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో సాగిన సుదీర్ఘ నిరసనల అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి జూలై 25న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
