కర్ణాటక నూతన సీఎంగా మంత్రి డీకే శివకుమార్ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వం మార్పిడిలో భాగంగా సిద్దరామయ్య సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ప్రభుత్వానికి నూతన సీఎంగా డీకే. శివకుమార్ పదవీ పగ్గాలు చేపట్టనున్నారు. శివకుమార్ కేబినెట్ కూర్పు ఎలా ఉండబోతుంది…ఎవరెవరికి కేబినెట్ లో స్థానం దక్కబోతుందన్న ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది.
డీకే శివకుమార్ బయోగ్రఫీ
కర్ణాటక సీఎం గా బాధ్యతలు చేపట్టనున్న డీకే శివకుమార్ పూర్తి పేరు దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్(డీకే శివకుమార్). 1962 మే 15న రామసగర జిల్లా, కనకపుర తాలూక దొడ్డలహళ్లి గ్రామంలో వొక్కలిగ సామాజిక వర్గంలో జన్మించారు. తల్లిదండ్రులు దివంగత డీకే కెంపేగౌడ, గౌరమ్మ. నేషనల్ కాలేజీ (బెంగళూరు) నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (BA), కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్శిటీ నుండి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (MA) పూర్తి చేశారు. ఆయన తమ్ముడు డీకే సురేష్ కూడా ప్రముఖ రాజకీయ నాయకుడు. శివకుమార్-ఉషా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, ఆభరణ.. కుమారుడు ఆకాశ్ లు ఉన్నారు. భారతదేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకడిగా శివకుమార్ గుర్తింపు పొందారు. పారిశ్రామిక్తవేత్తయైన శివకుమార్ కు 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే కు రూ.1,400CRకు పైగా ఆస్తులున్నాయి.
డీకే శివకుమార్ పొలిటికల్ ఫ్రొఫైల్
1980లలో భారతీయ యువజన కాంగ్రెస్‌తో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 27ఏళ్ల వయసులోనే డీకే శివకుమార్ 1989లో సాతనూరు నియోజకవర్గం నుండి తొలిసారిగా కర్ణాటక శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటినుండి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.ఆ తర్వాత 1994, 1999, 2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో అదే నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నికయ్యారు. 2008 నుంచి కనకపుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 2008, 2013, 2018, 2023లో కనకపుర నుంచి విజయం సాధిస్తూ వచ్చారు.
కన్నడ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు
విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో 2002లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పుడు ఎమ్మెల్యేలను రిసార్ట్ కు తరలించి ఆయన ప్రభుత్వాన్ని కాపాడటంలో శివకుమార్ కీలకంగా వ్యవహరించారు. 2017 గుజరాత్ రాజ్యసభ ఎన్నికల సమయంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరులోని రిసార్ట్‌కు తరలించి వారిని కాపాడటంలో ఆయన కీలక పాత్ర పోషించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇది అహ్మద్ పటేల్ కు ఎన్నికల్లో గెలవడానికి సహాయపడింది. 2018 ఎన్నికల తర్వాత కర్ణాటకలో భారత జాతీయ కాంగ్రెస్, నతా దళ్ (సెక్యులర్) సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులోనూ శివకుమార్ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు కూడా శివకుమార్ సన్నిహితుడు.
ఎమ్మెల్యే నుంచి సీఎం స్థాయి వరకు ప్రయాణం
2008 నుండి 2010 వరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మరియు 2014 నుండి 2019 వరకు కర్ణాటక ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా పనిచేశారు. 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంలో, పార్టీ సంస్థాగత బలోపేతానికి డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. మే 20, 2023 న కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో జలవనరులు, పట్టణాభివృద్ధి వంటి కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సిద్దరామయ్య సీఎం పదవి నుంచి తప్పుకోవడంతో కర్ణాటక నూతన సీఎంగా శివకుమార్ పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
