Site icon vidhaatha

ప్రధాని వ్యాఖ్యలపై ఫిర్యాదును పరిశీలిస్తామన్న ఈసీ!

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ చేసిన చొరబాటుదారు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. దాన్ని తాము పరిశీలిస్తున్నట్టు ఈసీ వర్గాలు వెల్లడించినట్టు ఓ జాతీయ మీడియా కథనం పేర్కొన్నది. ప్రధాని ఇటీవల రాజస్థాన్లోని బాంస్వాడాలో జరిగిన ర్యాలీలో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని ఆ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘ ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్‌ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకే దేశ సంపదంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవాళ్లకు పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉన్నదా? అర్బన్‌ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలనూ వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలవడం మీకు సమ్మతమేనా? అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు. తన వాదనకు మద్దతుగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. ఇవి చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే.

దీనిపై కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమ మేనిఫెస్టోలో హిందూ-ముస్లిం అని ఎక్కడ ఉన్నదో ప్రధాని చూపెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఏళ్ల తరబడి భారత్‌లో నివసిస్తున్న మైనార్టీలు చొరబాటుదారులా? గతంలో ఏ ప్రధాని కూడా ఇలా మాట్లాడలేదు. మోడీకి ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వాలి అని ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ అన్నారు. అభిషేక్‌ మను సింఘ్వీ, గుర్దిప్‌ సప్పల్‌లతో కూడిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సోమవారం ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌తోపాటు కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్బీర్‌కుమార్‌ సంధులను కలిసి ప్రధానితో పాటు బీజేపీ మొత్తం 16 ఫిర్యాదులు అందజేసిన సంగతితెలిసిందే. ఈ క్రమంలోనే ఈసీ వర్గాల నుంచి స్పందన వచ్చినట్టు సమాచారం.

Exit mobile version