Odisha | హృదయ విదారకం.. భార్య ప్రాణం కోసం 600 కి.మీటర్లు రిక్షా తొక్కిన వృద్ధుడు

Odisha | దేశంలోని పలువురి జీవితాలు కటిక పేదరికంలో మగ్గుతున్నాయి. తినేందుకు తిండి కూడా లేక చాలా మంది అల్లాడిపోతున్నారు. అనారోగ్యం బారిన పడినా వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు చేతిలో చిల్లి గవ్వ లేక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు.

  • By: raj |    national |    Published on : Jan 27, 2026 11:30 AM IST
Odisha | హృదయ విదారకం.. భార్య ప్రాణం కోసం 600 కి.మీటర్లు రిక్షా తొక్కిన వృద్ధుడు

Odisha | దేశంలోని పలువురి జీవితాలు కటిక పేదరికంలో మగ్గుతున్నాయి. తినేందుకు తిండి కూడా లేక చాలా మంది అల్లాడిపోతున్నారు. అనారోగ్యం బారిన పడినా వైద్యం కోసం ఆసుపత్రికి వెళ్లేందుకు చేతిలో చిల్లి గవ్వ లేక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ఒడిశా (Odisha)లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న భార్యను కాపాడుకునేందుకు 70 ఏండ్ల వృద్ధుడు ఏకంగా 600 కిలోమీటర్ల మేర రిక్షా (rickshaw) తొక్కాడు. సంకల్ప బలం ఉంటే ఎంతటి కష్టతరమైన పనిలోనైనా విజయం సాధించొచ్చని నిరూపించాడు.

సంబల్‌పుర్‌ (Sambalpur)లో బాబు లోహర్‌ (Babu Lohar), జ్యోతి అనే వృద్ధ దంపతులు జీవిస్తున్నారు. వారు కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారు. లోహర్‌ రిక్షా తొక్కుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ క్రమంలో జ్యోతి అనారోగ్యానికి గురైంది. అక్కడి స్థానిక డాక్టర్లు తనకు మెరుగైన వైద్యం అందించాలని అందుకోసం కటక్‌లోని ఎస్‌సీబీ మెడికల్ కాలేజ్‌కి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, పూట గడిచేందుకు కూడా కష్టంగా ఉన్న ఆ దంపతులకు కటక్‌ వెళ్లాలంటే చాలా కష్టంగా మారింది. అయితే, భార్యను ఎలాగైనా బతికించుకోవాలని భావించాడు లోహర్‌. తన వద్ద ఉన్న రిక్షాలోనే 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్‌ ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

రోజుకు దాదాపు 30 కిలో మీటర్లు రిక్షా తొక్కుతూ తొమ్మిది రోజులకు కటక్‌ ఆసుపత్రికి చేరుకున్నాడు. అక్కడ జ్యోతికి రెండు నెలలపాటూ చికిత్స అందించాడు. ఆ తర్వాత అదే రిక్షాలో తిరిగి 300 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి చేరుకున్నారు. ఇలా భార్య ప్రాణం కోసం 600 కిలోమీటర్లు రిక్షా తొక్కి తన ప్రేమను చాటుకున్నాడు లోహర్‌. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో తిరుగు ప్రయాణంలో వీరి రిక్షాను ఓ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి తలకు గాయమైంది. దీంతో అక్కడే స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందించారు. ఆ దంపతుల పరిస్థితి చూసి చలించిపోయిన అక్కడి డాక్టర్ వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. అనంతరం వృద్ధ దంపతులు ఇద్దరూ క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఈ విషయం తెలసుకున్న స్థానికులు లోహర్‌ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఈ జంట నేటితరం యువతకు ఆదర్శం అంటూ మాట్లాడుకుంటున్నారు.