Site icon vidhaatha

ఈవీఎంల లెక్క తప్పిందా?

140కిపైగా పోలింగ్‌ కేంద్రాల్లో ఓట్ల తేడా
పలుచోట్ల ఈవీఎంలలో అధిక ఓట్లు
కొన్నిచోట్ల ఈవీఎంలకంటే తక్కువ
న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల పనితీరుపై చాలా కాలం నుంచి అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయి. కేవలం చిప్‌ ఆధారంగా పనిచేసే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాన్ని బయటి నుంచి సదరు చిప్‌ తయారీదారులు ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని అనేక మంది విమర్శలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లకు, వాస్తవంగా జరిగిన ఓటింగ్‌కు తేడా ఉన్నదనే విషయంలో సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తున్నది. ఇప్పుడు తాజాగా జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో సైతం అనేక పోలింగ్‌ కేంద్రాల్లోని ఈవీఎంలలో కూడా ఈ తేడాలు బయటపడినట్టు వైర్‌ ఒక ఆసక్తికర కథనాన్ని పోస్ట్‌ చేసింది. ఓటింగ్‌ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కకు, కౌంటింగ్‌ రోజు లెక్కించిన ఓట్లకు మధ్య అనేక చోట్ల వ్యత్యాసాలు కనిపించిన విషయాన్ని ఆ కథనంలో ప్రస్తావించింది. 2019లో ఓట్ల తేడా అంశంపై అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రైట్స్‌ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవలి ఎన్నికలకు ముందు కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే.. ఎన్నికల సంఘం మాత్రం ఎన్నికల సంఘం తన యాప్‌లో ప్రదర్శించిన ప్రాథమిక సంఖ్యల ఆధారంగానే ఈ ఆరోపణలు చేస్తున్నదంటూ కొట్టిపారేసింది. అందుకే వాస్తవ ఓట్ల సంఖ్యతో వారి ఓట్ల సంఖ్య సరిపోలలేదని పేర్కొన్నది. అయితే.. తాజాగా ముగిసిన ఎన్నికల్లో సైతం పెద్ద సంఖ్యలో ఓటింగ్‌ యంత్రాలు ఓటు సంఖ్యలో తేడాలు చూపుతున్నాయని తెలుస్తున్నది. డామన్‌/ డియు, లక్షద్వీప్‌, కేరళలోని అత్తింగళ్‌ వంటివి మినహాయిస్తే అనేక పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంల లెక్క తప్పిందని సమాచారం. కొన్నింటిలో కనిష్ఠంగా మూడు ఓట్ల వరకూ తేడా ఉంటే.. గరిష్ఠంగా 3811 ఓట్ల వరకూ తేడాలు కనిపించాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కొన్ని చోట్ల పోల్‌ అయిన ఓట్ల కంటే ఈవీఎంలలో కనిపించిన ఓట్ల సంఖ్య తక్కువగా ఉన్నదని అంటున్నారు. గరిష్ఠంగా ఈ తేడా 16,791 ఓట్ల వరకూ ఉన్నది.

మచ్చుకు కొన్ని ఉదాహరణలు
కరీంగంజ్‌ (అస్సాం)లో మొత్తం 1,140,349 ఓట్లు పోలైతే.. 1,136,538 ఓట్లు లెక్కించారు. అంటే ఇక్కడ అదనంగా 3,811 ఓట్లు ఉన్నాయి. ఇవి ఎవరు వేసినవి? ఒంగోలు (ఏపీ)లో కూడా 1401174 ఓట్లు పోలేతే.. లెక్కింపు రోజున అవి 1399707 ఉన్నాయి. అంటే ఇక్కడ 1467 ఓట్లు అదనంగా వచ్చాయి. మాండ్లా (ఎంపీ) 1,531,950 ఓట్లు పోలవగా.. 1,530,861 ఓట్లు చూపిస్తున్నది. 1,089 ఓట్లు పెరిగాయి. రివర్స్‌లో తిరువళ్లూరు (తమిళనాడు)లో ఈవీఎంలలో 1,413,947 ఓట్లు రికార్డయితే.. లెక్కింపు నాటికి 1,430,738 ఓట్లు ఉన్నాయి. 16,791 ఓట్లు తక్కువ ఉన్నాయి. కోక్రాఝార్‌ (అస్సాం)లో 1,229,546 ఓట్లు పడితే.. లెక్కిపునాటికి 1,240,306 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ లోటు 10,760 ఓట్లు కనిపిస్తున్నాయి. ధేన్‌కానల్‌ (ఒడిశా)లో 1,184,033 ఓట్లు ఈవీఎంలో రికార్డయితే.. 1,193,460 ఓట్ల లెక్కింపునకు వచ్చాయి. అంటే.. ఇక్కడ 9,427 ఓట్లు అదృశ్యమయ్యాయి. కొద్ది రోజుల క్రితం ఓట్ల సంఖ్యలో తేడాలపై చర్చ జరిగినప్పుడు యూపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ స్పందిస్తూ.. ఎన్నికల సంఘం వివిధ హ్యాండ్‌ బుక్స్‌, మాన్యువల్స్‌లో నిర్దేశించిన ప్రొటోకాల్స్‌ను పాటించి లెక్కింపు జరపకపోయి ఉన్నట్టయితే ఈ తరహా తేడాలు ఉండొచ్చని అన్నారు. వాస్తవ పోలింగ్‌ ప్రారంభం అయ్యే సమయానికి ముందు నిర్వహించే మాక్‌పోలింగ్‌ డాటాను ప్రిసైడింగ్‌ అధికారి పొరపాటున క్లియర్‌ చేయకపోయినా, వీవీ ప్యాట్లు తొలగించకపోయినా లేదా ఫాం 17లో తప్పుగా రికార్డు చేసినా ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆయన పేర్కొన్నారు.
మరికొన్ని ఉదాహరణలు
మహారాష్ట్రలోని ముంబై వాయవ్య సీటులో ఈవీఎంలలో 9,51,580 ఓట్లు రికార్డయ్యాయి. కానీ.. ఓట్ల లెక్కింపు రోజున 2 ఓట్లు అధికంగా లెక్కకు వచ్చాయి. ఇక్కడ శివసేన అభ్యర్థి దత్తారాం వైకర్‌ కేవలం 48 ఓట్ల మెజార్టీతో శివసేన (ఉద్ధవ్‌) అభ్యర్థి అమోల్‌ గజానన్‌పై గెలుపొందారు. రాజస్థాన్‌లోని జైపూర్‌ రూరల్‌ స్థానంలో 12,38,818 ఓట్లు ఈవీఎంలో నమోదైతే.. లెక్కించే నాటికి అవి 12,37,966గా ఉన్నాయి. అంటే.. 852 ఓట్లు ఏమై పోయాయి? ఇక్కడ బీజేపీ అభ్యర్థి రావు రాజేంద్రసింగ్‌ 1,615 స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌లో 12,61,103 ఓట్లు ఈవీఎంలలో రికార్డయితే.. 12,60,153 ఓట్లు లెక్కించారు. అంటే ఇక్కడ 950 ఓట్లు గల్లంతయ్యాయి. ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి భరోజ్‌రాజ్‌ 1,884 ఓట్ల తేడాతో గెలుపొందగలిగారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో 10,32,244 ఓట్లు పోలైతే.. 10,31,784 ఓట్లు లెక్కించారు. అంటే ఇక్కడ తేడా 460 ఓట్లు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముకేశ్‌ రాజ్‌పుత్‌ 2,678 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. మెజార్టీ కంటే తగ్గిన ఓట్లు తక్కువే అనుకోవచ్చు. కానీ.. పూర్తిగా ఎలక్ట్రానిక్‌ ప్రక్రియలో జరిగిన ఓటింగ్‌లో తేడాలు ఏమీ ఉండకూడని, కానీ.. తేడాలు ఉన్నాయంటేనే ఆ వ్యవస్థలో లోపం ఉన్నట్టు భావించాలని రాజకీయ విశ్లేషకుడొకరు పేర్కొన్నారు. ఆ యంత్రంలో లోపం ఉండి ఉండొచ్చని చెప్పారు. వీటన్నంటికీ ఎన్నికల సంఘమే సమాధానాలు చెప్పాలని అన్నారు.

Exit mobile version