Snake Bite | రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ కోసం.. తండ్రికి రెండుసార్లు పాము కాటు

Snake Bite | ఓ ఇద్ద‌రు కుమారులు దారుణానికి పాల్ప‌డ్డారు. రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు త‌మ తండ్రి అత్యంత దారుణంగా చంపేశారు. మెడ‌పై పాముతో కాటు వేయించి.. తండ్రిని హ‌త్య చేశారు.

  • By: raj |    national |    Published on : Dec 20, 2025 8:15 AM IST
Snake Bite | రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ కోసం.. తండ్రికి రెండుసార్లు పాము కాటు

Snake Bite | చెన్నై : ఓ ఇద్ద‌రు కుమారులు దారుణానికి పాల్ప‌డ్డారు. రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేందుకు త‌మ తండ్రి అత్యంత దారుణంగా చంపేశారు. మెడ‌పై పాముతో కాటు వేయించి.. తండ్రిని హ‌త్య చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని తిరువ‌ళ్లూరు జిల్లాలో వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. తిరువళ్లూరు జిల్లాలోని పొత‌తూరుపెట్టై గ్రామానికి చెందిన ఈపీ గ‌ణేశ‌ణ్‌(56) ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ల్యాబ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. అయితే గ‌ణేశ‌ణ్ పేరు మీద రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్ ఉంది. ఇదే దారుణానికి ఒడిగ‌ట్టేలా చేసింది.

ఇక ఇద్ద‌రు కుమారులు తండ్రి పేరు మీదున్న రూ. 3 కోట్ల ఇన్సూరెన్స్‌పై క‌న్నేశారు. ఈ క్ర‌మంలో ఈ ఏడాది అక్టోబ‌ర్ నెల‌లో త‌మ తండ్రిని చంపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందుకు ఓ పాములు ప‌ట్టేవాడిని సంప్ర‌దించి నాగుపామును తీసుకొచ్చారు. తండ్రి కాలికి పాముతో కాటు వేయించారు. కానీ అత‌ను ప్రాణాలు కోల్పోలేదు. కొడుకుల ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది.

దీంతో మ‌రుస‌టి రోజే మ‌రో ఎత్తుగ‌డ వేశారు. ఈ సారి అత్యంత విష‌పూరిత‌మైన క్రైట్ పామును కుమారులు ఇంటికి తీసుకొచ్చారు. కాలికి కాకుండా మెడ‌పై కాటు వేయించారు. క్ష‌ణాల్లో తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. అనంత‌రం త‌మ తండ్రి పాము కాటుకు బ‌లైన‌ట్లు అంద‌ర్నీ న‌మ్మించారు. ఇన్సూరెన్స్ కంపెనీని కూడా సంప్ర‌దించి.. రూ. 3 కోట్ల క్లెయిమ్‌కు చ‌ర్య‌లు ప్రారంభించారు.

ఇన్సూరెన్స్ కంపెనీ వారికి గ‌ణేశణ్ కుమారుల మీద ఏదో అనుమానం క‌లిగింది. వారి ప్ర‌వ‌ర్త‌న తీరు చూస్తుంటే గ‌ణేశణ్ హ‌త్య‌కు గురైన‌ట్లు ఇన్సూరెన్స్ కంపెనీ వారు గ్ర‌హించారు. దీంతో వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ప్ర‌త్యేక పోలీసు ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి విచార‌ణ జ‌రిపించారు. గ‌ణేశ‌ణ్‌ను కుమారులే చంపార‌ని తేలింది. దీంతో ఇద్ద‌రు కుమారులతో పాటు మరో న‌లుగురిని అరెస్టు చేశారు.