ఆసియాలో నెంబర్‌ వన్‌ స్థానానికి అదానీ

దేశంలో అత్యంత సంపన్న నేతగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ఎదిగారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీని దాటేశారు.

ఆసియాలో నెంబర్‌ వన్‌ స్థానానికి అదానీ

– రిలయన్స్‌ ను నెట్టేసి దూసుకుని రాక

-అత్యంత సంపన్నుడుగా ఎదుగుదల

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత సంపన్న నేతగా అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ఎదిగారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీని దాటేశారు. ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా అదానీ అవతరించారు. అదానీ గ్రూప్‌ గతేడాది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. గడ్డుకాలం చవిచూసింది. తాజాగా మళ్లీ పుంజుకున్నారు. గతేడాది ఆరంభంలో అమెరికా షార్ట్‌ సెల్లింగ్‌ కంపెనీ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో అదానీ గ్రూప్‌ షేర్లు ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి. అప్పటికే ఆసియా కుబేరుడిగా ఉన్న అదానీ.. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలతో 35వ స్థానానికి దిగజారారు. సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు, పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపేందుకు అదానీ అనేక చర్యలు చేపట్టారు. కొత్త ఇన్వెస్టర్లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. గడువు కంటే ముందుగానే చాలా రుణాలను చెల్లించారు.


బ్యాంకుల నుంచి కొత్తగా రుణాలు తీసుకున్నారు. దీంతో అదానీ గ్రూపు కంపెనీల షేర్లు మళ్లీ గాడినపడ్డాయి. తాజాగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అదానీ గ్రూపు నెత్తిన పాలు పోసింది. హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై సెబీ దర్యాఫ్తు మినహా మరే ఇతర దర్యాప్తు అవసరం లేదని ఇటీవల సుప్రీం కోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తీర్పుతో అదానీ గ్రూపు షేర్లు భారీగా లాభపడ్డాయి. ఒక్కరోజులోనే గౌతమ్‌ అదానీ సంపాదన 7.7 బిలియన్‌ డాలర్లు పెరిగి, మొత్తం సంపద 97.6 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ వెల్లడించింది. దీంతో రిలయన్స్‌ ఇండస్టీస్ర్‌ అధినేత ముఖేష్‌ అంబానీ (97 బిలియన్‌ డాలర్లు)ను దాటేసి ఆసియాలో అత్యంత ధనవంతుడిగా అదానీ నిలిచారు. కాగా, ప్రపంచ సంపన్నుల జాబితాలో అదానీ 12వ స్థానానికి చేరుకోగా, అంబానీ 13వ స్థానంలో ఉన్నారు.