Gymkhana Club | ఢిల్లీ జింఖానా క్లబ్ మూత.. వందేళ్ల ఘన చరిత్ర కనుమరుగు

Gymkhana Club | దేశ రాజధాని ఢిల్లీ నగరం మధ్యలో ప్రముఖ క్లబ్ గా పేరుప్రఖ్యాతులు పొందిన ఒక క్లబ్ మూతపడుతోంది. ఎంతో మంది ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుని 37 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా ఇవ్వడం లేదంటే ఆ క్లబ్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది.

  • By: raj |    national |    Published on : May 24, 2026 9:40 AM IST
Gymkhana Club | ఢిల్లీ జింఖానా క్లబ్ మూత.. వందేళ్ల ఘన చరిత్ర కనుమరుగు

జూన్ 5 లోపు ఖాళీ చేయాలి
ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
1913లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ప్రారంభం

Gymkhana Club | విధాత, హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీ నగరం మధ్యలో ప్రముఖ క్లబ్ గా పేరుప్రఖ్యాతులు పొందిన ఒక క్లబ్ మూతపడుతోంది. ఎంతో మంది ప్రముఖులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుని 37 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా ఇవ్వడం లేదంటే ఆ క్లబ్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. జూన్ 5వ తేదీ లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ‌ నిర్మాణ శాఖ క్లబ్ యజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 5వ తేదీ తరువాత ఈ క్లబ్ చరిత్ర నుంచి కనుమరుగు కానున్నది.

ఢిల్లీ సఫ్దర్ జంగ్ రోడ్డులో ఢిల్లీ జింఖానా క్లబ్ 27.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. 1913 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం ఈ క్లబ్ ను స్థాపించింది. ఈ క్లబ్ లో సభ్యత్వం తీసుకోవడం ఢిల్లీవాసుల కల. ఈ క్లబ్ లో సభ్యత్వం కలిగిన వారు తమ హోదాకు చిహ్నంగా భావిస్తున్నారు. ఇందులో కేంద్ర మంత్రులు, బ్యూరోక్రాట్లు, సీనియర్ మిలిటరీ అధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తలు సభ్యులుగా ఉన్నారు. వంద సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఢిల్లీ జింఖానా క్లబ్ లో పర్మినెంట్ సభ్యత్వం పొందడం అంతు సులువేమి కాదు. శాశ్వత సభ్యత్వం కోసం ఐదారు సంవత్సరాల క్రితం కాకుండా మూడు దశాబ్ధాలుగా ఎదురు చూస్తున్నారు. 37 సంవత్సరాల క్రితం దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పటికీ మెంబర్షిప్ లభించలేదు. కొందరు అయితే 1970లోనే దరఖాస్తు చేసుకున్నా శాశ్వత సభ్యత్వం దక్కలేదంటే ఈ క్లబ్ కు ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలిసిపోతుంది. ఇక్కడ సభ్యత్వం లభిస్తే అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో సంబంధాలు, సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సివిల్ సర్వెంట్లకు 40 శాతం, మరో నలభై శాతం మిలిటరీ అధికారులకు, మిగతా 20 శాతం ఇతరులకు సభ్యత్వంలో కోటా కల్పించారు. ఆ ప్రకారంగానే ఇప్పటి వరకు సీనియార్టీ ప్రకారం కేటాయిస్తూ వెళ్తున్నారు.

ఈ క్లబ్ కార్యకలాపాలు, ఆర్థిక నిర్వహణలో ఉల్లంఘనలపై కేంద్ర ప్రభుత్వం న్యాయపరంగా ముందుకు వెళ్లింది. ఆర్థిక కార్యకలాపాల్లో అక్రమాలు చోటు చేసుకోవడం, కొందరికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడం, వివాదాస్పద నిర్ణయాలు, గ్రీన్ కార్డు జారీలో అవకతవకలకు పాల్పడినట్లు కేంద్రం కోర్టు కు తెలియచేసింది. తన లక్ష్యాలకు భిన్నంగా క్లబ్ యాజమాన్యం వ్యవహరించినట్లు స్పష్టం చేసింది. గ్రీన్ కార్డు పేరుతో సభ్యులు తమ కుటుంబ సభ్యులకు విచ్చలవిడిగా ఇప్పంచుకున్నారనే విమర్శలు కోకొల్లలు. ఇలాంటి కారణాలతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా పాశ్చాత్య శైలిలో అమలుపరుస్తున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ‌ నిర్మాణ శాఖ రంగంలోకి దిగింది. ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ల్యాండ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసు క్లబ్ కు కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేసింది. జూన్ 2, 2026 లోపు ఖాళీ చేసి అప్పగించాలని ఆదేశించింది. దేశ భద్రత కోసం రక్షణ సంబంధ మౌలిక సదుపాయాల కల్పన కోసం సువిశాలంగా ఉన్న 27.3 ఎకరాలను వినియోగించనున్నట్లు ప్రకటించారు.