ఐదు రంగులలో పుచ్చకాయల సాగు..రూ.6.50లక్షల ఆదాయం!

హర్యానా రైతు రామ్ ప్రతాప్ శర్మ ఎకరంలో 5 రంగుల పుచ్చకాయల సాగుతో రూ.6.50 లక్షల ఆదాయం సాధించి దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచారు.

విధాత : నూతన ఆవిష్కరణలతో సాంప్రదాయ వ్యవసాయాన్ని అధిక లాభదాయకమైన వ్యాపారంగా ఎలా మార్చుకోవచ్చునో ఓ రైతు తన ప్రయత్నంతో చేసి చూపించారు. ఎకరంలో ఏకంగా 5 రంగులలో పుచ్చకాయలు పండిస్తూ లక్షల్లో లాభాలు ఆర్జిస్తున్నాడు. హర్యానాలోని పానిపట్‌లో కు చెందిన 63ఏళ్ల రైతు రామ్ ప్రతాప్ శర్మ తనకున్న ఎకరం వ్యవసాయ క్షేత్రంలో ఎరుపు, నారింజ, ముదురు పసుపు, లేత పసుపు, ఇంకా నీలం రంగుతో సహా ఐదు రకాల పుచ్చకాయలను సాగు చేస్తున్నారు. తద్వారా ఎకరానికి రూ.6.50లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు.

కొన్ని సంవత్సరాల పాటు పలు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసిన రామ్ ప్రతాప్ శర్మ 2011లో పూర్తిస్థాయి పండ్లు, కూరగాయల సాగును చేపట్టాడు. డ్రిప్ ఇరిగేషన్, పాలీహౌస్ ఫార్మింగ్, హైబ్రిడ్ విత్తనాల వంటి ఆధునిక పద్ధతులను వినియోగించి రంగుల పుచ్చకాయల పండ్ల సాగు చేపట్టాడు. ఇప్పుడు ఆయన పండించిన పంట ఢిల్లీ, గురుగ్రామ్, చండీగఢ్, ఇతర ప్రాంతాలలోని మాల్ లకు, ఇళ్లకు చేరుతుంది. ఆన్‌లైన్ ద్వారా కూడా 10–15 కిలోల ప్యాక్‌లను నేరుగా ఆయన పొలం నుండే కొనుగోలు చేస్తున్నారు. పలు వ్యాపార సంస్థలు తరచుగా పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి.

సక్సెస్ మంత్రం ఏమిటో ..

రైతు రామ్ ప్రతాప్ శర్మ థాయ్‌లాండ్, తైవాన్ వంటి దేశాల నుండి తెప్పించిన అత్యుత్తమ నాణ్యత గల విత్తనాలతో వేసవి పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. ఆ విత్తనాల ధర కిలోకు రూ.1లక్ష వరకు ఉంటుందట. ఒకసారి కాపులో దాదాపు 100 క్వింటాళ్ల పుచ్చకాయల దిగుబడి వస్తుంది. దీని ద్వారా సుమారు రూ.5 లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చులు పోగా, కేవలం పుచ్చకాయల నుండే వచ్చే లాభాలు రూ.4 లక్షలతో పాటు..ఇదే పొలంలో పక్కన పండించే కూరగాయల నుండి అదనంగా మరో రూ.1.5 లక్షల ఆదాయం వస్తుంది. ఇప్పుడు పుచ్చకాయల సాగుతో పెరిగిన వ్యాపారంతో తన వ్యవసాయ క్షేత్రంలో ఏడుగురు కార్మికులకు ఉపాధిని కూడా కల్పిస్తున్నాడు. రామ్ ప్రతాప్ శర్మ విజయగాథను తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కృషి రత్న పురస్కారంతో గౌరవించింది.

రామ్ ప్రతాప్ శర్మ పుచ్చకాయల సాగుతో సాధించిన లక్షల ఆదాయం విజయం అతనికి నమ్మకమైన వినియోగదారులను, స్థిరమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టడమే కాకుండా పంటల సాగులో నూతన ఆవిష్కరణలను పాటిస్తే సాధించే అద్బుతాలకు నిదర్శనంగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని నిపుణులు అభినందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

చిరంజీవి ఇంటి దగ్గరలోనే.. అల్లు అర్జున్ భారీ నివాస భవనం !
ర్యాలీతో ట్రాఫిక్ జామ్.. మంత్రిపై మహిళ ఫైర్!

Latest News