మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు((90) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రావు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
అమరావతి : మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు((90) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రావు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యం పాలైన భాస్కర్ రావుకు హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తూ వచ్చారు. మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతినడం, డయాలసిస్ కారణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం. గురువారం (ఏప్రిల్ 23, 2026) మధ్యాహ్నం 4 గంటలకు పంజాగుట్ట, హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. భాస్కరరావు మృతి పట్ల ఏపీ సీఎం, తెలంగాణ సీఎంలతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
1935జూన్ 23న గుంటూరులో జన్మించిననాదెండ్ల భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీలో అర్థ దశాబ్ధానికి పైగా సేవలందించారు. ఎన్టీఆర్ తో కలిసి టీడీపీ పార్టీని ఏర్పాటు చేశారు. 1982ఎన్నికల్లో ఎన్టీఆర్ కలిసి టీడీపీ విజయంతో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకుని తర్వాతి ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూశారు. 1984ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా వ్యవహరించారు. 1978నుంచి 89వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కుమారుడు నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా, ప్రస్తుత ఏపీ కేబినెట్ లో జనసేన నుంచి మంత్రిగా వ్యవహరిస్తున్నారు.
నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ జీవిత ప్రస్థానం
నాదెండ్ల భాస్కరరావు తండ్రి పిచ్చయ్య. భాస్కర్ రావు 1935, జూన్ 23న గుంటూరులో జన్మించారు. 1958లో లలితను వివాహం చేసుకున్న భాస్కరరావుకు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు నాదెండ్ల మనోహర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భాస్కరరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బి.ఏ ఎల్.ఎల్.బీ పట్టా పొందాడు.1984 లో ఆగస్టు 16 నుండి సెప్టెంబరు 16 వ తేది వరకు ఒక నెలపాటు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
1978 ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుండి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎంపికయ్యారు. 1978 నుండి 1989 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా, అదే సమయంలో మంత్రిగా, కేబినెట్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.సీఎంలు మర్రి చెన్నారెడ్డి, టి.అంజయ్య మంత్రివర్గంలో భాస్కర్ రావు మంత్రిగా పనిచేశాడు. 1998లో ఖమ్మం నియోజక వర్గం నుండి 12వ లోక్‌సభకు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యాడు.
టీడీపీ ఏర్పాటులో కీలకంగా భాస్కర్ రావు
నటుడు ఎన్డీఆర్ అంధ్రుల ఆత్మాభిమానం నినాదంతో 1982, మార్చి29న తెలుగుదేశం పార్టీని స్థాపించాడు. పార్టీ ప్రారంభించిన 9 నెలలకే 1983 శాసనసభ సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఆధిపత్యానికి చెక్ పెట్టాడు. టీడీపీ పార్టీ ఏర్పాటులో, ఎన్నికల్లో టీడీపీ విజయంలో ఎన్టీఆర్ తో పాటు భాస్కర్ రావు కీలక భూమిక పోషించారు. సీఎంగా రామారావు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వంలో నాదెండ్ల భాస్కరరావు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
ఎన్టీఆర్ మంత్రివర్గం నుంచి ఉద్వాసన
ఆ సమయంలో 1984 ఆగస్టులో ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు బైపాస్ శస్త్రచికిత్స చేయించుకునేందుకు అమెరికా వెళ్లాడు.తిరిగి 1984 ఆగస్టు 14న రాష్ట్రానికి వచ్చారు. హైదరాబాదు విమానాశ్రయంలో ఎన్టీఆర్ ను ఆహ్వానించడానికి ఆర్థిక మంత్రిగా ఉన్న భాస్కరరావు కూడా వెళ్లారు. ఆరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రామారావు సూచన మేరకు గవర్నర్ రాంలాల్ భాస్కరరావును మంత్రి పదవి నుండి తొలగించాడు.
ఎన్టీఆర్ పై తిరుగుబాటు..
తనను మంత్రివర్గం నుంచి తప్పించడంతో భాస్కర్ రావు ఆగ్రహంతో ఎన్టీఆర్ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. టీడీపీలో అంతర్గత కలహాలు ముదిరిపోవడంతో ఆగస్టు 15న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ గవర్నర్ ను కలిసి ఎన్టీఆర్ ప్రభుత్వానికి మెజార్టీ లేదని బర్తరఫ్ కు డిమాండ్ చేశారు. శాసన సభలో తన మద్దతును నిరూపించుకోవడానికి శాసనసభను ఆగస్టు 18న సమావేశపరుచాల్సిందిగా ఎన్టీఆర్ గవర్నర్ రాంలాల్ ను కోరారు. అటు నాదెండ్ల భాస్కరరావు గవర్నరును కలిసి తనకు ముఖ్యమంత్రి అయ్యేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉందని,తెలుగుదేశం అసమ్మతి సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సభ్యుల మద్దతు తనకుందని, మంత్రివర్గం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని కోరాడు. అదే సమయంలో ఎన్టీఆర్ కూడా తనకు మద్దతునిస్తున్న 163మంది సభ్యుల జాబితాను గవర్నరుకు పంపాడు.
సీఎంగా భాస్కర్ రావు ప్రమాణ స్వీకారం
1984 ఆగస్టు 16న నాదెండ్ల భాస్కరరావు టీడీపీలోని తన మద్దతుదారులతో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష పార్టీ మద్దతునిస్తున్న తీర్మానంతో గవర్నరు కార్యాలయం చేరుకున్నాడు. అదే సమయానికి ఎన్‌టీఆర్ సైతం తనకు మద్దతునిస్తున్న 163 సభ్యుల జాబితా పత్రికలకు విడుదల చేశాడు. ఆ తరువాత వారందరిని గవర్నరు ముందు హాజరుపరిచాడు. గవర్నర్ కేంద్రంలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ ఒత్తిడి నేపథ్యంలో ఇరు పక్షాల బలాబలాలను పట్టించుకోకుండా..ఏక పక్షంగా రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి..నాదెండ్ల భాస్కరరావుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు.
నెల రోజుల ముఖ్యమంత్రిగా రికార్డు
అసెంబ్లీలో మద్దతు నిరూపించుకోవడానికి భాస్కర్ రావు కు గవర్నర్ నెల రోజులు గడువిచ్చాడు. నెలరోజుల గడువులో భాస్కరరావు అనేక ప్రయత్నాలు చేసినప్పటికి శాసనసభలో మద్దతు కూడగట్టుకోలేకపోయాడు. ఫలితంగా సెప్టెంబరు 16న భాస్కరరావు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగాడు. కేవలం 31 రోజులపాటే ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్‌రావు పనిచేయడం గమనార్హం. అటు తనను భాస్కర్ రావు వెన్నుపోటు పడిచాడని, కేంద్ర రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సహకరించి అన్యాయంగా తన ప్రభుత్వాన్ని రద్దు చేశారంటూ ధర్మ యుద్ధం పేరిట రామారావు ప్రజల్లోకి వెళ్లి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాడు. ఈ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో టీడీపీ మిత్రపక్షాలు సైతం ఆయనకు మద్దతుగా నిలిచాయి. నాదెండ్ల పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ 1985 మార్చిలో ప్రజలతీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్ళాడు. ఆ ఎన్నికలలో 202 స్థానాల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చాడు. సొంతంగా ఉదయించే సూర్యూడి గుర్తుతో నాదెండ్ల భాస్కర్ రావు పెట్టిన తెలుగునాడు పార్టీ ఘోర ఓటమి పాలైంది.
తిరిగి కాంగ్రెస్ నుంచి ఎంపీగా..
ఆ తర్వాత నాదెండ్ల భాస్కరరావు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. 1989 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. అయితే ఆయన 1994 ఎన్నికల్లో మళ్లీ తెనాలి నుంచి పోటీచేసినా ఓటమి పాలయ్యారు. నాదెండ్ల భాస్కరరావు వెంటనే నియోజకవర్గం మార్చేసి.. 1998 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత నుంచి భాస్కరరావు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే 2019లో నాదెండ్ల భాస్కరరావు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే చాలా కాలంగా నాదెండ్ల భాస్కరరావు యాక్టివ్ పొలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. నాదెండ్ల భాస్కరరావు రాజకీయ వారసుడిగా కుమారుడు నాదెండ్ల మనోహర్ కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి :
శంషాబాద్ లో రూ.90కోట్ల విలువైన 9ఎకరాలను కాపాడిన హైడ్రా
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram