Ambassador 393 | అంబాసిడర్‌ 393తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మూడు దశాబ్దాల క్రితం వాడిన 393 అంబాసిడర్ కారును పరికించి పరవశించారు. ఆ వాహనంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ తెలుగుదేశం చారిత్రక వాహనాన్ని ఇప్పుడు అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఉంచనున్నారు.

Ambassador 393 | అంబాసిడర్‌ 393తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Reminisces His Bond with Iconic 393 Ambassador Car

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు ఆత్మీయమైన ఒక ప్రత్యేకమైన వాహనాన్ని మళ్లీ చూసి జ్ఞాపకాలలో తేలిపోయారు. మూడు దశాబ్దాల క్రితం ఆయన ఉపయోగించిన 393 నంబర్ అంబాసిడర్ కారును తడిమి చూసి పరవశించారు. మళ్లీ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించినప్పుడు కాన్వాయ్‌లో ముందుండేది ఇదే 393 నంబర్ అంబాసిడర్ కారు. ఆ రోజుల్లో “393 అంబాసిడర్ అంటేనే ప్రజలు సీబీఎన్‌ బ్రాండ్​ అనేంతగా ఈ కారు ఆయనకు బ్రాండ్ అంబాసిడర్​గా మారింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాత 393 నంబర్ అంబాసిడర్ కారుతో నిలుచున్న దృశ్యం

ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు భద్రతా పరమైన కారణాల వల్ల ఆధునిక వాహనాలు వినియోగిస్తున్నప్పటికీ, తన పాత అంబాసిడర్ కారుపై ఆయనకున్న మమకారం మాత్రం ఇప్పటికీ తగ్గలేదు.

ఈ కారు ఇప్పటి వరకు హైదరాబాదులో ఉండగా, ఇప్పుడు దాన్ని అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు, తిరిగి వెళ్తూ ఆ కారును పరిశీలించి, ఆ వాహనంలో గడిపిన రాజకీయ యాత్ర స్మృతులను గుర్తు చేసుకున్నారు.

ఈ సీన్ చూసిన పలువురు పార్టీ నాయకులు కూడా ఆ క్షణాన్ని భావోద్వేగంగా చూశారు. పాత అంబాసిడర్ కారు పక్కన నిలబడి చిరునవ్వు చిందించిన చంద్రబాబు — నాటి కష్టాలు, ప్రయాణాలు, ప్రజా సేవ యాత్రలను గుర్తు చేసుకున్నట్లు అనిపించింది.