• Telugu News
  • /National

Dress Code Controversy : చుడిదార్‌తో వచ్చిందని.. ప్రధానోపాధ్యాయురాలిని గేటు వద్దే అడ్డుకున్న స్కూల్‌ మేనేజర్‌

చుడిదార్ వేసుకుందని హెడ్ మిస్ట్రెస్‌ను గేటు వద్దే ఆపేసిన స్కూల్ మేనేజర్! కేరళలో ఉపాధ్యాయురాలి నిరసన. మేనేజర్ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు..

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 05, 2026, 6:32 pm IST
Read Time: 6 mins
Dress Code Controversy : చుడిదార్‌తో వచ్చిందని.. ప్రధానోపాధ్యాయురాలిని గేటు వద్దే అడ్డుకున్న స్కూల్‌ మేనేజర్‌

సాధారణంగా మనం జాబ్‌కు వెళ్లేటప్పుడు కంఫర్ట్‌ దుస్తులనే ధరిస్తుంటాం. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులు. వాళ్లు ఎక్కువగా చీర కంటే చుడిదార్‌ వేసుకునేందుకే ఇష్టపడతారు. పిల్లలకు పాఠాలు చెప్పే సమయంలో అవి కంఫర్ట్‌గా ఉంటాయి కాబట్టి. కానీ చుడిదార్‌ ధరించిన (wearing a churidar) కారణంగా ఓ ఎయిడెడ్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని (aided school headmistress) కార్యాలయంలోకి రాకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు కూడా నిరసన చేపట్టారు.

గేటు వద్దే ఆపేశారు..

ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కొట్టారక్కరలోని నెదువత్తూర్‌ ఈవీహెచ్‌ఎస్‌ఎస్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సింధు ఎస్‌ నాయర్‌.. బుధవారం ఉదయం పాఠశాలకు చుడిదార్‌ వేసుకుని వెళ్లింది. మధ్యాహ్న భోజన పథకం కోసం గుడ్లు, ఇతర సరకులతో ఆటోరిక్షాలో బయల్దేరిన సింధు.. ఉదయం 8:45 గంటలకు పాఠశాలకు చేరుకుంది. అయితే, అక్కడ ఆమెను వాచ్‌మెన్‌ అడ్డుకున్నారు. లోపలికి అనుమతించలేదు. ఇదేంటని ప్రశ్నించగా.. చుడిదార్‌తో వస్తే క్యాంపస్‌లోకి అనుమతించొద్దని స్కూల్‌ మేనేజర్‌ కె.సురేశ్‌ కుమార్‌ ఆదేశించినట్లు వాచ్‌మెన్‌ సమాధానమిచ్చాడు.

గేటు ముందే బైఠాయించి..

ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ ప్రభుత్వం కల్పించినప్పటికీ.. అడ్డుకోవడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తన వెంట తెచ్చిన సరకులతోనే గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసింది. సమాచారం అందుకున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్కూల్‌ మేనేజర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజర్‌ చర్యలు చట్టవిరుద్ధమని, వివక్షతో కూడుకున్నదని నిరసన చేపట్టారు.

పోలీసులకు ఫిర్యాదు..

తనకు జరిగిన ఈ అవమానంపై ప్రధానోపాధ్యాయురాలు సింధు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్కూల్‌ మేనేజర్‌, సెక్యూరిటీ గార్డ్‌పై కొట్టారక్కర్‌ పోలీసులకు కంప్లైంట్‌ ఇచ్చింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖ అధికారులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు సింధు తెలిపింది.

మాకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదు.

మరోవైపు తాజా ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయురాలి నుంచి తమకు ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ఫిర్యాదూ అందలేదని తెలిపారు. లిఖితపూర్వక ఫిర్యాదు అందిన వెంటనే నిబంధనల ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

మేనేజర్‌ నుంచి గతంలోనూ వేధింపులు

ఇదిలా ఉండగా.. మేనేజర్‌ తనను పదేపదే వేధింపులకు గురిచేస్తున్నట్లు సింధు ఆరోపించింది. రెండు నెలల క్రితం ఎన్నికలకు సంబంధించిన శిక్షణకు వెళ్తున్న సమయంలో అన్ని రికార్డులూ సక్రమంగా ఉన్నప్పటికీ తనని గేటు వద్ద అడ్డుకున్నట్లు వాపోయింది. అంతేకాకుండా, ఎలాంటి కారణం లేకుండానే పలుమార్లు తనకు మెమోలు జారి చేసినట్లు ఆమె ఆరోపించింది.

మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా..

కాగా, స్కూల్‌ మేనేజర్‌ సురేశ్‌ గతంలోనూ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ మహిళా ఉద్యోగి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆయనపై కేసు కూడా నమోదైంది. ఈ కేసులో అతనికి కోర్టు జరిమానా కూడా విధించింది.

ఇవి కూడా చదవండి :

ERC | రాష్ట్రంలో క‌రెంట్ క‌నెక్ష‌న్ చాలా సులువు.. ప‌దేళ్ల త‌ర్వాత మ‌రో కీల‌క స‌వ‌ర‌ణ‌
Telangana Gram Panchayat Funds | గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్..నిధులొచ్చాయ్ !