కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట!

కాళేశ్వరం కమిషన్ చట్టబద్దతను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు సహా అధికారులు దాఖలు చేసిన కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు చట్టబద్దమేనని తేల్చింది. అయితే ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో కేసీఆర్, హరీష్ రావు తో పాటు ఐఏఎస్ స్మితా సబర్వాల్, ఎస్ కే. జోషికి ఊరట లభించినట్లయ్యింది.

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో ఊరట!

విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ చట్టబద్దతను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, హరీశ్ రావు సహా అధికారులు దాఖలు చేసిన కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

కాళేశ్వరం అక్రమాలపై విచారణకు జస్టిస్ పీ.సీ.ఘోష్ కమిషన్ నియామకాన్ని హైకోర్టు చట్టబద్దమేనని తేల్చింది. అయితే ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. సెక్షన్ 8 కింద నోటీసు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదు అని హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుతో కేసీఆర్, హరీష్ రావు తో పాటు ఐఏఎస్ స్మితా సబర్వాల్, ఎస్ కే. జోషికి ఊరట లభించినట్లయ్యింది.

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరిగాయంటూ.. జస్టిస్‌ పి.సి.ఘోష్‌ కమిషన్‌ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 14న జీవో 6ను జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, ఐఏఎస్‌ అధికారిణి స్మితా సభర్వాల్, ఐఏఎస్‌ మాజీ అధికారి ఎస్‌.కె.జోషిలు విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. కమిషన్‌ చేపట్టిన విచారణ ప్రక్రియలో ఉల్లంఘనలు జరిగాయని, అభియోగాలు మోపే ముందు తమ వాదనను పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. విస్తృత ప్రజాప్రయోజనాల దృష్ట్యా కమిషన్‌ వేశామంటూ మరొకరి పరువు ప్రతిష్ఠలు దెబ్బతీయడం సరికాదన్నారు.

మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ… ప్రజాప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కమిషన్‌ వేసినట్లు తెలిపారు. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నివేదిక రికార్డుల ఆధారంగానే ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా పిటిషనర్లతోపాటు పలువురికి నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టిందని.. కాబట్టి పిటిషన్‌లను కొట్టివేయాలని కోరారు.

అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోనుందన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కాళేశ్వరం కేసును సీబీఐ విచారించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండుసార్లు లేఖ రాసింది. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన సీబీఐ కాళేశ్వరం అక్రమాలకు సంబంధించి రాష్ట్ర పోలీసులు ఏమైనాకేసు నమోదు చేశారా అని అడగడం..ఇక్కడ ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, మీరే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టాలని ప్రభుత్వం రెండో లేఖలో కోరడం గమనార్హం. సెక్షన్ 5 కింద డీవోపీటీ నోటిఫికేషన్ జారీ చేసి దర్యాప్తు ఆరంభించాలని కోరడం విశేషం.

హైకోర్టు తీర్పుతో చంకలు గుద్దుకోవద్దు : అద్దంకి దయాకర్

కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పుతో మాకేదో మేలు జరిగిందని బీఆర్ఎస్ నాయకులు చంకలు గుద్దుకోవద్దు అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని హైకోర్టు తెలిపిందని గుర్తు చేశారు. నివేదిక ఆధారంగా తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మాత్రమే తీర్పు ఇచ్చిందని, సీబీఐ విచారణ, ఘోష్ కమిషన్ నివేదికను పరిశీలించాక..తుది తీర్పు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకుల అవినీతి బయటపడుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఢిల్లీలో హైకోర్టు కేసు, సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ పెద్దలతో హరీశ్ రావు మంతనాలు చేస్తున్న సంగతి తెలుస్తుందని, బీజేపీతో కలిస్తే తప్పులన్ని క్లీన్ అవుతాయన్న బీఆర్ఎస్ ఆలోచనలు ఫలించవని, కాళేశ్వరంలో చేసిన అక్రమాలకు వారికి ఎప్పటికైన శిక్ష తప్పదని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి :

నటుడు పార్దీబన్ కు ‘నో కాస్ట్ – నో రిలీజియన్’ సర్టిఫికేట్..హైకోర్టు గ్రీన్ సిగ్నల్!
తెరుచుకున్న కేదార్‌నాథ్‌ ఆలయ ద్వారాలు..రేపు బద్రీనాధ్