విధాత : మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్(Hidma Encounter)పై అనుమానాలు వ్యక్తం చేస్తూ న్యాయవాది కె. విజయ్ కిరణ్(Lawyer Vijay Kiran) జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఆశ్రయించారు. హిడ్మా ఎన్ కౌంటర్ బూటకం అని…దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎఫ్ఐఆర్ నంబర్లు 52/2025, 53/2025లో అనుమానాస్పద అంశాలున్నాయని, జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం పోలీసులపై ఎప్ఐఆర్ నమోదు కాలేదని, దర్యాప్తు తటస్థంగా జరగలేదని ఆయన ఆరోపించారు. ఫేక్ ఎన్‌కౌంటర్ అయితే ప్రభుత్వ తప్పిదమని వ్యాఖ్యానించారు. మావోయిస్టులైన, పోలీసులైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం నేరమేనని గుర్తు చేశారు.
ఏపీలోని మారెడుమిల్లి అడవుల్లో ఈ నెల 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిడ్మా మృతిచెందిన విషయం తెల్సిందే. ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మా, ఆయన భార్య రాజె సహా ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు. అయితే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ హిడ్మా ఎన్ కౌంటర్ బూటకం అని ఆరోపించింది. అదంతా పోలీసుల కట్టుకథ అని.. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లిన హిడ్మా బృందాన్ని పోలీసులు పట్టుకొని.. ప్రభుత్వానికి సరెండర్ చేస్తామని చెప్పి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కాల్చి చంపారని కేంద్ర కమిటీ ఆరోపించింది.
