Dev ji Maoist Plan | విదేశీ షెల్టర్‌కు మావోయిస్టుల ప్లాన్! శ్రీలంకకు వెళ్లేక్రమంలో పోలీసుల వలలో!

ఆపరేషన్‌ కగార్‌ తీవ్రతను తట్టుకోలేక మావోయిస్టులు విదేశీ షెల్టర్‌ ప్లాన్‌ చేశారా? ఈ క్రమంలో శ్రీలంక వెళుతూ దొరికిపోయారా? తాజా రెండు ఎన్‌కౌంటర్లు, ఏపీలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల అరెస్టు నేపథ్యంలో అనేక ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Maoist party strategic shift shelter abroad

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

Dev ji Maoist Plan | కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టు పార్టీని అల్లకల్లోలం చేస్తోంది. అగ్రనాయకత్వమే లక్ష్యంగా భద్రతాబలగాలతో దాడులు చేస్తూ ఊచకోత కోస్తోంది. మార్చి 31 డెడ్‌లైన్‌గా దండకారణ్యమంతా నెత్తురుటేర్లు పారిస్తోంది. కేంద్రం దెబ్బకు వందల మంది ఎన్‌కౌంటర్లలో మృత్యువాతపడుతుండగా, మిగిలిన వారు ప్రాణ రక్షణకు లొంగిపోతున్నారు. మెజారిటీ నాయకత్వాన్ని కోల్పోయి పూర్తిగా దెబ్బతిని కోలుకోలేని స్థితిలోకి చేరిన పార్టీ ‘ఆఖరి వ్యూహాన్ని’ అమలు చేసేందుకు సిద్ధమైందా? అంటే ఔనని అంటున్నారు. అనేక తర్జన భర్జనలు, చర్చల అనంతరం ఆమోదించిన ఈ చివరి ప్రణాళిక ‘విదేశాల్లో షెల్టర్’ అమలు సైతం.. నిఘా వర్గాల చేతికి చిక్కి ‘భారీ’ నష్టాన్ని చవిచూసినట్లు భావిస్తున్నారు. నిన్నటి వరకు మాడ్ కేంద్రంగా సాగిన మావోయిస్టుల చర్చ ఒక్కసారిగా ‘ఆంధ్రప్రదేశ్’ వేదికగా మారడానికి ఇదే ప్రధాన కారణమనే ఊహాగానాలు సాగుతున్నాయి. కొద్దికాలం వరకు శత్రు దుర్భేద్యంగా ఉంటూ మావోయిస్టులకు పెట్టని కోటలా ఉన్న అబూజ్ మాడ్.. ఆపరేషన్ కగార్ కారణంగా చిన్నభిన్నామై తలదాచుకునేందుకు నాయకత్వం తల్లడిల్లుతున్నది. ఈ పరిస్థితుల్లో వెంటాడుతున్న శత్రువు నుంచి పార్టీ ప్రధాన నాయకత్వ రక్షణకు ‘విదేశీ షెల్టర్’ వైపు మొగ్గుచూపారని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొంత నాయకత్వాన్ని శ్రీలంకకు తరలించేందుకు ప్రయత్నించేందుకు చేసిన ప్రణాళిక అమలులోనే పోలీసు ఇంటెలిజెన్స్‌ వర్గాల చేతికి చిక్కి ‘హిడ్మా’తో సహా పలువురు ఆయన ముఖ్య టీం మారేడుమిల్లి అడవిలో ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్టు తెలుస్తున్నది.

విదేశీ షెల్టర్ వ్యూహాత్మక నిర్ణయం?

మావోయిస్టు పార్టీ పై అప్రతిహతంగా సాగుతున్న నిర్భంధం, పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులు ఎన్‌కౌంటర్‌లలో ప్రాణాలు కోల్పోవడంతో పాటు పార్టీ కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ళపల్లి వాసుదేవరావులు వందల మంది నాయకులు, కేడర్ సహా ఆయుధాలతో లొంగుబాట్లు జరిగాయి. దీని తర్వాత మరికొంత మంది పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో నూతన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్టు ప్రచారంలో ఉన్న దేవ్‌జీ నాయకత్వంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అదే ‘విదేశాల్లో షెల్టర్’! పొరుగు దేశాలైన నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకల్లో ఏది అనుకూలంగా ఉంటుందని పరిశీలించి శ్రీలంకను ఎంపిక చేసినట్లు ఊహాగానాలు సాగుతున్నాయి. నేపాల్‌పై భారత్ పట్టు, బంగ్లాదేశ్‌లో అస్థిర రాజకీయ పరిస్థితులున్నందున శ్రీలంక వైపు మొగ్గు చూపినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే హిడ్మా నాయకత్వంలో ఏపీ మీదుగా శ్రీలంకకు వెళ్ళేందుకు అవసరమైన ప్రణాళిక కొనసాగుతున్న క్రమంలో జరిగిన లీక్.. మొత్తం ప్లాన్‌ను దెబ్బతీసినట్లు చెబుతున్నారు. ముందు హిడ్మా ఆయన బృందం, తదుపరి దేవ్‌జీ ఇతర ముఖ్యనాయకులు తరలివెళ్ళాలని భావించినట్లు చర్చసాగుతోంది. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన చంద్రన్న, ప్రకాశ్‌లాంటివారు లొంగిపోయేందుకు పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. కొంత పరిస్థితులు చక్కబడిన తర్వాత నాయకత్వం తిరిగి దేశానికి వచ్చేందుకు ప్రణాళిక రూపొందించి, అందుకు అవసరమైన ఏర్పాట్లు సైతం చేసుకున్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మావోయిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి అలియాస్ లక్ష్మణరావు వయోభారంతో పార్టీ బాధ్యతలనుంచి తొలిగినప్పటికీ సురక్షితమైన షెల్టర్‌లో తలదాచుకున్నారనే చర్చ కొద్ది రోజుల క్రితం వరకు జరిగింది. కానీ, కగార్ ఆపరేషన్ తర్వాత గణపతిని కూడా విదేశాలకు పంపించినట్లు చెబుతున్నారు.

హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత ఎన్ కౌంటర్, భారీ అరెస్టులు

గత నెల 26వ తేదీ నుంచి సెంట్రల్ ఇంటెలిజెన్స్‌, ఛత్తీస్‌గఢ్‌ మహారాష్ట్ర, ఒరిస్సా, ఏపీ.. నాలుగు రాష్ట్రాల నిఘా వర్గాల సమన్వయంతో అత్యంత పకడ్బందీగా, చాకచక్యంగా తెరవెనుక చేపట్టిన ఆపరేషన్ ఫలితమే మోస్ట్‌వాంటెడ్‌ మావోయిస్టు, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా ఎన్‌కౌంటర్‌గా భావిస్తున్నారు. వరుస ఎన్‌కౌంటర్లను, సాయధు బలగాల చక్రబంధనాల నుంచి అనేకసార్లు తప్పించుకున్న హిడ్మా.. ఒక విధంగా కేంద్రానికి సవాలే విసిరాడు. అలాంటి హిడ్మా మారేడుమిల్లి అడవుల్లో మంగళవారం ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. ఈ సంఘటనలో హిడ్మా దంపతులు సహా ఐదుగురు మృతిచెందారు. ఆ తర్వాత ఆంధప్రదేశ్ లోని ఐదు జిల్లాల్లో యాభై మంది నక్సలైట్లు అరెస్టయ్యారు. ఎన్టీఆర్, కాకినాడ, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాలోని పెనుమలూరు, కాకినాడ, ఏలూరు, రావుల పాలెంలో వీరిని అరెస్ట్ చేసినట్లు ఏపీ ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీ మహేష్ చంద్ర లడ్హా ప్రకటించారు. అరెస్ట్ చేసిన నక్సలైట్లలో ముగ్గురు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఐదుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, 19 మంది ఏరియా కమిటీ సభ్యులు, 23 మంది సాధారణ సభ్యులు ఉన్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 45 ఆయుధాలను, 272 తుపాకీ గుళ్లను, ఇతరత్రా సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. హిడ్మా దళానికి చెందిన 27 మందితోపాటు సౌత్ బస్తర్ ఏరియా నుంచి, స్థానిక కేడర్, దేవ్ జీ సెక్యూరిటీ టీమ్‌కు చెందిన తొమ్మిది మంది సహా అరెస్టయివాళ్లందరూ ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందినవారేనని లడ్హా తెలిపారు. హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత బుధవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో టెక్ శంకర్‌ సహా మరో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు ప్రకటించారు. దండలో దారంగా పూసగుచ్చినట్లు కనిపిస్తున్న ఈ పరిణామాలూ మావోయిస్టుల విదేశాలకు వెళ్ళాలనే నూతన వ్యూహాన్ని రూఢీచేస్తున్నట్లు భావిస్తున్నారు. ఈ పథకం అమలుకాకుండా పోలీసు బలగాలు చావుదెబ్బ కొట్టినట్లు చెబుతున్నారు.

తెరవెనుక ఏం జరిగింది?

హిడ్మా ఎన్‌కౌంటర్‌, తర్వాత మరో ఎన్‌కౌంటర్‌, 50 మంది మావోయిస్టుల అరెస్టు వెనుక ఏం జరిగిందనే చర్చ ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి ఏపీ పోలీసుల చేతిలో చిక్కి కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు అరెస్టు కావడానికి ముందేం జరిగిందనేదానిపై పలు అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వాటి ప్రకారం.. శ్రీలంకకు వెళ్ళేందుకు ముందుగా హిడ్మా తన బెటాలియన్ సభ్యులకు ఏపీలో షెల్టర్ కోసం చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో దేవ్ జీ సెక్యూరిటీ సభ్యులు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యారు. దీనికి అనుగుణంగా పోర్టు పట్టణమైన కాకినాడ, విజయవాడ, ఏలూరును ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. తాను, తన భద్రతకు అవసరమైన టెక్ శంకర్ సహా 12 మంది ముఖ్యులతో హిడ్మా ఏపీకి బయలుదేరగా, సుక్మా జిల్లాలో పట్టుబడిన హిడ్మా కొరియర్ ద్వారా ప్రణాళిక పోలీసులకు లీకైనట్లు చర్చసాగుతోంది. ఓ వాహనంలో ప్రయాణిస్తున్న హిడ్మా, ఆయన బృందాన్ని ఏపీ సరిహద్దుల్లో పకడ్బందీగా వలపన్ని పట్టుకున్నారని తెలుస్తున్నది. వారిని రెండు బృందాలుగా విడదీసి చిత్రహింసలకు గురిచేసినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొంత సమాచారం రాబట్టి మారేడుమిల్లి పరిసర అటవీ ప్రాంతంలో రెండు ఎన్‌కౌంటర్లలో కాల్చిచంపారని ప్రజాసంఘాలు అరోపణలు చేస్తున్నాయి. మృతులంతా కొత్త డ్రెస్‌లు వేసుకుని ఉన్నారని, వాస్తవానికి వీళ్ళంతా సివిల్ డ్రెస్‌లో పట్టుబడ్డారని చెబుతున్నారు. వీరిని పట్టుకున్న అనంతరం తమకు లభించిన సమాచారం మేరకు మిగిలిన చోట్ల షెల్టర్ తీసుకుంటున్న 50 మంది మావోయిస్టులను అరెస్టుచేసినట్లు తెలుస్తోంది. సుక్మా జిల్లాలో కొరియర్ పోలీసులకు చిక్కడంతో ప్లాన్ అంతా లీకైనట్లు భావిస్తున్నారు. దీనికి ముందు ఓ జర్నలిస్టుకు లేఖ రాస్తూ తాను లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు జరిగిన ప్రచారం కూడా హిడ్మా వ్యూహంలో భాగమేనంటున్నారు. పోలీసుల ఎత్తుగడలు, నెట్ వర్క్, సమాచార సేకరణ, సమన్వయం ముందు మావోయిస్టుల విదేశీ షెల్టర్ విఫలమైనట్లుగా భావిస్తున్నారు. తాజా ఎన్‌కౌంటర్‌లు, వరుస పరిణామాలపై పార్టీ ముఖ్యనాయకత్వం స్పందిస్తే తప్ప వాస్తవాలు ఏంటనేది వెల్లడికావంటున్నారు. ముందు జాగ్రత్తల రీత్యా కొన్ని విషయాలను పార్టీ వెల్లడించలేని పరిస్థితి కూడా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఏ మాత్రం తమకు సానుకూలంగా లేని ఆంధ్రప్రదేశ్ లోకి హిడ్మా ప్రవేశించడం, తన బృందంలో కీలక సభ్యుడైన టెక్ శంకర్ రెండో ఎన్‌కౌంటర్‌లో మృత్యువాత పడడం, మిగిలిన ఆయన అనుచరులు, దేవ్ జీ సెక్యూరిటీ సభ్యులు 50 మంది అరెస్టుకావడం, తాజాగా సముద్ర తీర ప్రాంతమైన రావులపాలెంలో హిడ్మా అనుచరుడు సరోజ్ అరెస్టుతోపాటు పలు ప్రశ్నలకు, అనుమానాలకు తావిస్తోంది.

Read Also |

Maoist Chief | మావోయిస్టు చీఫ్ దేవ్ జీ ఎక్కడ?
Maoist Party Latest Letter | మావోయిస్టు పార్టీ లేటెస్ట్‌ సంచలన లేఖ.. దీర్ఘకాలిక ప్రజాయుద్ధంపై కీలక వ్యాఖ్యలు
Maoist Party Letter | సోనూ, సతీష్ విప్లవ ద్రోహులు: మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

Latest News