Devji Surrender Rumours Intensify After Hidma Encounter: Another Shock to Maoist Leadership
విధాత, నవంబర్ 18, విశాఖపట్నం:
Devji Surrender ? | మావోయిస్టు అగ్ర కమాండర్ మద్వి హిడ్మా ఎన్‌కౌంటర్‌తో తెలుగు రాష్ట్రాల భద్రతా వ్యవస్థలు విజయ్ దివస్ జరుపుకుంటున్నాయి. హిడ్మా మరణంతో మావోయిస్టులకు ఆఖరి ఆశ కూడా అడుగంటగా, ఇప్పుడు మరో కీలక సమాచారం చుట్టూ ఊహాగానాలు వేగంగా చెలరేగుతున్నాయి, అదే.. మావోయిస్టు ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి పోలీసులకు లొంగిపోయారనే వార్త.
ఏపీ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ ఆపరేషన్లు జరుగుతున్న నేపథ్యంలో, ప్రత్యేక దళాలు పలువురిని అదుపులోకి తీసుకుంటుండగా, దేవ్‌జీ లొంగుబాటు వార్త మరింత వేడెక్కించింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. కానీ భద్రతావర్గాల సమాచారం ప్రకారం, హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత అడవుల్లోని పలువురు కీలక నేతలు స్థావరాలు మార్చుకుంటుండటం, కొందరు లొంగుబాటుకు సిద్ధమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
దేవ్‌జీ : 43 ఏళ్ల క్రితం అడవుల్లోకి – పీపుల్స్ వార్ పుట్టుక నుంచి కేంద్ర కమిటీ వరకు
తిప్పిరి తిరుపతి— కరీంనగర్ జిల్లా, కోరుట్లలో ఓ దళిత కుటుంబంలో పుట్టిన ఈ నాయకుడు ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే రైతు–కూలీ పోరాటాల్లో పాల్గొన్నాడు. 1970ల చివర్లో విద్యార్థి ఉద్యమాలు, రెవల్యూషనరీ క్యాంపెయిన్‌లు, రాడికల్ స్టూడెంట్ యూనియన్ క్రియాశీల కార్యకలాపాల ద్వారా ప్రజా సమస్యల్లో నిమగ్నమయ్యాడు. వేట్టి చాకిరీ రద్దు, కూలీ రేట్ల పెంపు వంటి ఉద్యమాల్లో ముందు వరుసలో నిలిచాడు.
ALSO READ : హిడ్మా, మిగతా నాయకుల ఎన్ కౌంటర్ బూటకం: పౌర హక్కుల సంఘం
RSU పట్ల ఆయనకు ఉన్న ఆరాధన, పీపుల్స్‌వార్ సిద్ధాంతాల పట్ల ఉన్న ఆకర్షణ—ఇవి అతన్ని 1980ల ప్రారంభంలోనే పూర్తిగా అండర్‌గ్రౌండ్ జీవితం వైపు నెట్టాయి. ఆరెస్సెస్, ఏబీవీపీ దాడులను ఎదుర్కొంటూనే పీపుల్స్‌వార్ పార్టీకి ప్రజాదరణ పెంచడంలో కీలక పాత్ర పోషించాడు.
తర్వాతి దశలో దేవ్‌జీ పీపుల్స్‌వార్ నిర్మాణంలో బలమైన పునాదిగా మారాడు. తన క్రమశిక్షణ, ఆర్గనైజింగ్ స్కిల్స్ కారణంగా—
- గడ్చిరోలి జిల్లా కార్యదర్శి
- ఛత్తీస్‌గఢ్ స్టేట్ కమిటీ మెంబర్
- దళ కమాండర్
- జోనల్ కమిటీ మెంబర్
- స్టేట్ కమిటీ మెంబర్
- ప్లాటూన్ కమాండర్
పదవులను చేపట్టిన దేవ్‌జీ, తాజాగా, మావోయిస్టు సెంట్రల్ కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు (బస్వరాజు) ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడంతో, మావోయిస్టు సెంట్రల్ మిలటరీ కమిషన్ కార్యదర్శిగా నియమితుడైనట్లు సమాచారం. 2010లో దంతేవాడలో 74 మంది జవాన్లు మృతి చెందిన దాడిలో దేవ్‌జీ ప్రముఖ పాత్ర పోషించినట్లు అధికారిక రికార్డుల్లో ఉంది.
హిడ్మా మరణం – దేవ్‌జీ అనుచరుల అరెస్టులు – ఊహాగానాలకు బలం
హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. అడవుల్లో నుండి ఏపీ వైపు కదులుతున్న మావోయిస్టులపై విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్లు సాగుతున్నాయి.
- విజయవాడ పరిసరాల్లో 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు
- ఏలూరులో 15 మంది పట్టుబడ్డారు
- కాకినాడ జిల్లా కొప్పవరంలో ఇద్దరు అరెస్టయ్యారు
వీరిలో చాలామంది దేవ్‌జీ అనుచరులు లేదా ఆయన భద్రతా సిబ్బందిగా ఇంటెలిజెన్స్ అంచనా. ఈ పరిణామాలే దేవ్‌జీ లొంగుబాటు ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. భద్రతా దళాలు అధికారికంగా నిర్ధారించకపోయినా, హిడ్మా మరణంతో మావోయిస్టు అండర్‌గ్రౌండ్ నిర్మాణం కూకటివేళ్లతో కదిలిపోయిందని, ఇంకా మిగిలిన కొందరు నేతలు త్వరలో లొంగుబాటు వైపు మళ్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
