పత్రికా స్వేచ్ఛలో మరింత దిగజారిన భారత ర్యాంకు.. 180 దేశాల జాబితాలో 157 స్థానంలో

పత్రికా స్వేచ్ఛలో భారతదేశం ర్యాాంకు గత ఏడాదికంటే ఆరు పాయింట్లు దిగజారింది. ప్రపంచ వ్యాప్తంగా సగానికిపైగా దేశాలు ఇదే స్థితిలో ఉన్నాయని రిపోర్టర్స్‌ సాన్స్‌ ఫ్రాంటియర్స్‌ సంస్థ పేర్కొన్నది.

పత్రికా స్వేచ్ఛ భారతదేశంలో ఎంత దారుణంగా దిగజారిపోతున్నదో మరోసారి తేటతెల్లమైంది. రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ సంస్థ ఏప్రిల్‌ 30న విడుదలచేసిన 2026 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో మొత్తం 180 దేశాల జాబితాలో భారతదేశం 157వ స్థానంలో నిలిచింది. 2025లో ఇదే సూచీలో భారతదేశం 151 స్థానంలో ఉండగా.. తాజా జాబితాలో ఆరు స్థానాలు దిగజారిపోయింది.

రిపోర్ట్స్‌ సాన్స్‌ ఫ్రాంటియర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌).. ఒక జర్నలిజం వాచ్‌డాగ్‌. తమ సూచీలోని 180 దేశాలు, ప్రాంతాల సగటు స్కోరు గత 25 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిపోయిందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ తెలిపింది. తమ సూచీ చరిత్రలోనే మొదటిసారి ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు పత్రికా స్వేచ్ఛలో ‘క్లిష్టమైన’, లేదా ‘అత్యంత తీవ్రమైన’ క్యాటగిరీలోకి చేరాయని పేర్కొన్నది.

నార్వే, నెదర్లాండ్స్‌, ఎస్టోనియా, డెన్మార్క్‌, స్వీడన్‌.. పత్రికా స్వేచ్ఛలో తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇరాన్‌, చైనా, నార్త్‌ కొరియా, ఎరిత్రియా చివరి ఐదు స్థానాల్లో నిలిచాయి.

కొన్నిచోట్ల స్వల్ప మెరుగుదలలు కనిపించినప్పటికీ.. ప్రపంచంలోని అనేక దేశాల్లో పాత్రికేయ పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొన్నది. 180 దేశాలకు గాను వంద దేశాల స్కోరు తగ్గిపోయిందని తెలిపింది. అదే సమయంలో పాత్రికేయులపై కేసులు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. అమెరికా ఖండాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. ఇక్కడ అమెరికా ర్యాంకు ఏడు పాయింట్లు దిగజారగా.. కొన్ని లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో జర్నలిస్టుల పట్ల హింస, అణచివేతలు పెరిగిపోతున్నాయని తెలిపింది.

భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఇంత దారుణంగా దిగజారిపోవడానికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆయన పార్టీయే కారణమని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొన్నది. ‘జర్నలిస్టులపై దాడులు, మీడియా యాజమాన్యం మొత్తం కేంద్రీకృతమైపోయి ఉండటం, మీడియా సంస్థలు రాజకీయ అనుబంధ సంస్థల్లా మారిపోవడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వాతంత్ర్యం సంక్షోభంలో పడింది’ అని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొన్నది.

Latest News