Swiggy : భారతీయుల క్రేజీ ఫుడ్ బిర్యానీ..పదేళ్లుగా నెంబర్ వన్

భారతీయుల బిర్యానీ ప్రేమ మరోసారి రికార్డు సృష్టించింది. 2025లో స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకంగా బిర్యానీ నిలిచింది. వరుసగా 10వ ఏడాది కూడా నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుని 'దశాబ్దపు రారాజు'గా నిలిచింది.

Swiggy : భారతీయుల క్రేజీ ఫుడ్ బిర్యానీ..పదేళ్లుగా నెంబర్ వన్

విధాత, హైదరాబాద్ : బిర్యానీ పట్ల భారతీయుల మక్కువ మరోసారి వెల్లడైంది. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ ‘స్విగ్గీ’ (Swiggy) విడుదల చేసిన 2025 వార్షిక నివేదిక మరోసారి బిర్యానీ వంటకం పట్ల భారతీయులు ప్రేమాభిమానాలను చాటింది. 2025సంవత్సంరలో స్విగ్గీలో అత్యధికంగా ఆర్డర్ చేసిన వంటకాల్లో బిర్యానీ వరుసగా 10వ ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచి నెంబర్ వన్ ఫుడ్ గా రికార్డు నిలబెట్టుకుంది. ఈ ఏడాది స్విగ్గీలో ఏకంగా 9.3కోట్ల బిర్యానీ ఆర్డర్లు నమోదవ్వడం దేశంలో బిర్యానీకి ఉన్న క్రేజ్ కు నిదర్శనం. భారతీయుల పాలిట బిర్యానీ కేవలం ఒక వంటకం కాదు, అదొక ఎమోషన్ అని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

ఒక్క స్విగ్గీలోనే ఇన్ని కోట్ల బిర్యానీ ఆర్డర్లు ఉంటే, ఇక జొమాటో లేదా నేరుగా రెస్టారెంట్లకు వెళ్లి తినే వారి సంఖ్యను కూడా కలిపితే బిర్యానీ విక్రయాలు ఎన్ని కోట్లలో ఉంటాయో చెప్పనక్కరలేదంటున్నారు నిపుణులు.

ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ

స్విగ్గీ నివేదిక ప్రకారం 2025లో దేశవ్యాప్తంగా నిమిషానికి సగటున 194 బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అంటే ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ అమ్ముడైందన్నమాట. ఈ ఏడాది మొత్తం మీద స్విగ్గీ ద్వారా 9.3 కోట్ల బిర్యానీలను భారతీయులు ఆరగించారు. ఇందులో ‘చికెన్ బిర్యానీ’ 5.77 కోట్ల ఆర్డర్లతో మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా 10ఏళ్ల పాటు స్విగ్గీలో నంబర్ 1 డిష్‌గా బిర్యానీ నిలవడం ఒక అరుదైన రికార్డు. “బిర్యానీ తిరుగులేని రారాజు. సుగంధ ద్రవ్యాల మేళవింపుతో తయారయ్యే ఈ అద్భుతమైన వంటకం పట్ల భారతీయులకు ఉన్న ఇష్టం ఎప్పటికీ చెక్కుచెదరదు” అని స్విగ్గీ తన నివేదికలో పేర్కొంది.

రెండో స్థానంలో బర్గర్

బిర్యానీ తర్వాతి స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. ఈ ఏడాది మోస్ట్ ఆర్డర్డ్ లిస్ట్‌లో టాప్ 4 డిషెష్ లో బిర్యానీ 9.3 కోట్ల ఆర్డర్లతో మొదటి స్థానంలో ఉంటే..రెండో స్థానంలో బర్గర్ 4.42 కోట్ల ఆర్డర్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక పిజ్జా 4.01 కోట్ల ఆర్డర్లతో మూడో స్థానంలో నిలిచింది. వెజ్ దోశ 2.62 కోట్ల ఆర్డర్లతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఈ సందర్భంగా స్విగ్గీ మార్కెట్‌ప్లేస్ సీఈఓ రోహిత్ కపూర్ మాట్లాడుతూ.. “భారతదేశంలో ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడమే కాదు, అది జ్ఞాపకాలతో ముడిపడి ఉంటుంది. అర్థరాత్రి ఆకలి వేసినా, ఏదైనా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలన్నా భారతీయులు ఫుడ్‌కే ప్రాధాన్యత ఇస్తారు. ప్రజల దైనందిన జీవితంలో మేం ఒక భాగమైనందుకు మాకు సంతోషంగా ఉంది” అని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Blue Snake Video : అద్భుతం.. నీలి రంగు పాము వీడియో వైరల్
Thai Army Destroy Hindu Deity : థాయిలాండ్ లో హనుమాన్ విగ్రహం కూల్చివేత..భారత్ లో వ్యతిరేకత