Software Engineer Work Story | రష్యాలో వీధులు శుభ్రం చేస్తున్న భారత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. నెల సంపాదన తెలిస్తే షాకే!

బతుకుదెరువు కోసం రష్యా వెళ్లిన ఒక భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. అక్కడ వీధులు ఊడ్చడం నెట్టింట వైరల్‌గా మారింది.

  • By: TAAZ |    national |    Published on : Dec 21, 2025 10:04 PM IST
Software Engineer Work Story | రష్యాలో వీధులు శుభ్రం చేస్తున్న భారత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. నెల సంపాదన తెలిస్తే షాకే!

Software Engineer Work Story | రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌ ఆ దేశం సంస్కృతికి గుండెకాయ. వారసత్వ, కళా సాంస్కృతిక కట్టడాలకు పేరెన్నికగన్నది. ఆ దేశంలోనే రెండో అతి పెద్ద మహా నగరం కాగా ప్రపంచంలోని పెద్ద నగరాల్లో కొటిగా ప్రఖ్యాతి పొందింది. సెయింట్ పీటర్స్‌బర్గ్‌ వంటి చారిత్రక నగరంలో భారతీయ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ వీధులను శుభ్రం చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సుమారు 17 మంది భారతీయులు ఉపాధి కోసం రష్యా దేశానికి చేరుకున్నారు. అందులో ఒక సాఫ్ట్‌వేర్‌ డెవలపర్ కూడా ఉన్నాడు. ఆ దేశంలో వీధులను శుభ్రం చేసే పనివారి కొరత ఉండటంతో ఇతర దేశాల నుంచి రప్పించుకుని వీధులు శుభ్రం చేయిస్తున్నారు.

సెయింట్ పీటర్స్‌బర్గ్‌ స్ట్రీట్‌లో కొన్ని వారాలుగా ముఖేష్ మండల్ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రోడ్లు, వీధులను చీపురు పట్టుకుని శుభ్రం చేస్తున్నారు. కొలోమైజస్కోయే కంపెనీ ద్వారా ముఖేష్ ఈ ఉద్యోగం పొందాడు. వసతి, భోజన సౌకర్యంతో పాటు ప్రతి నెలా రూ.1.1 లక్షలు (100,000 రూబెల్స్) వేతనం చెల్లిస్తున్నారు. ఇక్కడి కి రాక ముందు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా భారత్‌లో పనిచేశానని, ఇక్కడ మాత్రం రోడ్లు, వీధులు శుభ్రం చేస్తూ ఉపాధి పొందుతున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఏఐ, చాట్ బాట్, జీపీటీ వంటి విభాగాలలో ఉద్యోగం చేశానని చెప్పుకొచ్చాడు. ఉద్యోగం ద్వారా వచ్చే జీతాన్ని పొదుపు చేసుకునేందుకు రష్యా వచ్చినట్లు, పనిచేయడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. రోడ్లు క్లీనింగ్ చేసే పనిని ఎందుకు ఎంపిక చేసుకున్నావని ఒక మీడియా ప్రతినిధి అడగ్గా, నేను భారతీయుడిని, ఏ ఉద్యోగం అనేది తనకు సమస్య కాదని, పని దేవుడు ఇచ్చిన వరమని అన్నాడు. ఎక్కడైనా, ఏ పని అయినా చేస్తావా అని అడగ్గా, టాయ్ లెట్లు శుభ్రం చేసే పని కూడా చేస్తానని మండల్ సమర్థించుకున్నాడు. తన ఉద్యోగం, తన బాధ్యత అని, సాధ్యమైనంత వరకు పనిచేయడమే తన ముందున్న లక్ష్యం అన్నాడు.

కొలోమైజస్కోయే కంపెనీ హెడ్ మరియా త్యాబినా మాట్లాడుతూ, భారత్ నుంచి వచ్చిన 17 మంది పనివారు యంత్రాల సాయం లేకుండా వీధులు, రోడ్లు శుభ్రం చేస్తున్నారని తెలిపారు. ఈ పని కోసం ఎంపికైన వారికి వసతి, భోజనం తో పాటు ప్రత్యేక దుస్తులను కూడా అందచేస్తున్నామన్నారు. పని ప్రాంతం నుంచి వసతి వరకు రవాణా సౌకర్యం కూడా కల్పించామన్నారు. 19 సంవత్సరాల నుంచి 43 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నవారికి ఎంపిక చేస్తున్నామని, రైతులు కూడా ఉన్నారని ఆమె తెలిపారు.