Viral Video | ఆటలంత హాయిగా చదువు నేర్పిన టీచర్.. నెటిజన్లు ఫిదా!
సైన్స్ అంటేనే పరీక్షలు, ఫార్ములాలు, బోర్డులపై రాసే ఈక్వేషన్స్ అనుకునే ఈ రోజుల్లో.. కథలంత కమ్మగా పాఠాలు చెప్పి.. ఆటలంత హాయిగా చదువులు నేర్పిస్తే? గుజరాత్‌కు చెందిన ఒక టీచర్ ఇదే చేశారు. ఆడుకున్నంత ఈజీగా పాఠం నేర్పించారు.
Viral Video | అది గుజరాత్‌లోని ఒక పాఠశాల.. అక్కడ ఆ రోజు చోటు చేసుకున్న దృశ్యం.. మొబైల్ ఫోన్‌లోకి ఎక్కి.. ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పంచుతున్నది. చదువులు చెప్పాల్సిన తీరు మారాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతున్నది. హల్వాద్ అనే పట్టణంలోని సందీపని ఇంగ్లిష్ స్కూల్‌లో మయూర్ వైష్ణవ్ అనే టీచర్.. విద్యార్థులకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అయితే.. దానిని సహజంగా చూడాలని భావించారు. ఖరీదైన ప్రయోగశాలలు లేదా పెద్ద పరికరాలతో కాకుండా.. రోజువారీ వస్తువులతోనే విద్యుత్ ఎలా పనిచేస్తుందో హాస్యభరితంగా చూపించి సెభాషనిపించుకున్నారు.
నిజానికి ఈ వీడియోలో కనిపించేది చాలా సింపుల్ సీన్. కొంతమంది పిల్లలు, తమ తోటి పిల్లల తలలపై ఒక టవల్‌తో బాగా రుద్దారు. ఆ టవల్‌ను నాలుగువైపులా పట్టుకొని పైకి ఎత్తగా.. ఆసక్తికరంగా పిల్లల జుట్టు దానికి ఆకర్షితమవుతూ పైకి లేచింది. అంతే.. అక్కడంతా నవ్వులు విరిశాయి. దీనిని బాలురపైనా ప్రయోగించారు. కొంతమంది పిల్లల తలపై టవల్‌తో రుద్ది.. వారి వేలును మరో విద్యార్థి తాకితే చిన్నపాటి విద్యుత్ ప్రసారమై.. షాక్ కొడుతుంది. ఇది కూడా పిల్లలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది.
ఈ వీడియోపై నెటిజన్‌లు తలో విధంగా స్పందిస్తూ.. టీచర్‌ను అభినందించారు. సైన్స్ పాఠాలను ఇంత సరదాగా నేర్పడం గొప్ప విషయమంటూ ప్రశంసలు కురిపించారు. కొందరైతే తమ స్కూల్ రోజులు గుర్తొచ్చాయని రాశారు. మరికొందరు ఇలాంటి టీచర్ ఉంటే సైన్స్ అంటే భయం ఎందుకు ఉంటుందని వ్యాఖ్యానించారు. కొందరైతే తాము బాల్యంలో చేసిన ప్రయోగాలే తమకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచాయని రాసుకొచ్చారు.
మొత్తంగా ఈ వీడియో ఒక పెద్ద సందేశాన్నే ఇస్తున్నది. సైన్స్ అంటే ఏదో క్లిష్టమైన అంశమన్న భావన విద్యార్థుల్లో లేకుండా చూడాలి. సరైన పద్ధతిలో బోధిస్తే.. ఎలాంటి పాఠాలైనా కథలంత కమ్మగా సాగిపోతాయని నొక్కి చెబుతున్నది.
View this post on Instagram
View this post on Instagram
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram