inspiring quotes by ratan tata । రతన్ టాటా నోటి నుంచి జాలువారిన రతనాల్లాంటి కొన్ని మాటలు..
రతన్ టాటా నోట రతనాల్లాంటి పలుకులెన్నో జాలువారాయి. ప్రతి మాట వెనుక గొప్ప తాత్విక చింతన కనిపిస్తుంది. దూరదృష్టి గోచరిస్తుంది. జీవితాన్ని వడకట్టిన తీరు అర్థమవుతుంది. అది దేశం గురించి కావచ్చు.. దేశ ప్రజలకు కావచ్చు.. దేశ పురోగతికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు.. వ్యక్తిత్వ వికాసం కావచ్చు.. కొన్ని ఆణిముత్యాల్లాంటి రతన్ టాటా మాటలు గమనిస్తే ప్రతి ఒక్కరికీ వారి జీవితం పట్ల, వారివారి వృత్తుల పట్ల తప్పనిసరిగా కచ్చితమైన అవగాహన పెరుగుతుందనడంలో సందేహం లేదు.

inspiring quotes by ratan tata । జీవితాన్ని కాచి వడపోసినవాళ్లు అనుభవజ్ఞులు. అనేక ఎత్తుపల్లాలు చూసి, పడి, లేచి, పడి, లేచి.. పడినా లేవటమే లక్ష్యంగా దూసుకుపోయి విజేతలవుతారు. ఆ విజేతల మాటలు, ఆ విజయాలకు దారి తీసిన నేపథ్యాలు అప్పుడుప్పుడు వారి మాటల్లో వినిపిస్తూ ఉంటాయి. రతన్ టాటా కూడా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని తిరుగులేని పారిశ్రామిక సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి విస్తరించారు. ఈ క్రమంలో ఆయన చేతలే స్ఫూర్తిదాయక మాటలయ్యాయి. ఆయన అనుభవాలే అనుసరణీయ గుణపాఠాలుగా గుబాళించాయి. గొప్ప సక్సెస్‌ను అనుభవించినప్పటికీ.. టాటా ఎన్నడూ తన వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని, సంపదను దుర్వినియోగం చేయలేదు. తన పూర్వీకుల్లానే రతన్ టాటా కూడా భారతదేశ సంభావ్యతను బలంగా విశ్వసించారు, దేశం, దేశ ప్రజల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టారు. ప్రజలను పక్కదారి పట్టించే తప్పుడు ప్రచారాలు, అబద్ధాల గురించి రతన్ టాటా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసేవారు. ఒక మనిషి పతనానికి అతడి చర్యలే కారణమవుతాయని టాటా నమ్ముతారు. తన సుదీర్ఘ కెరీర్‌లో రతన్ టాటా విమర్శలు ఎదురైనా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. తన పట్టుదలతో విమర్శకుల నోళ్లు మూయించారు. రతన్ టాటా తన కుటుంబ సభ్యులైనా, వ్యాపార ప్రత్యర్థులతోనైనా, రాజకీయ నాయకులతోనైనా.. ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు ఇష్టపడేవారు. అనైతిక మార్గాల్లో విజయాలు అందుకోవడానికి టాటా పూర్తి వ్యతిరేకి. అనైతిక పద్ధతులకు వ్యతిరేకంగా గళం విప్పేవారు.
రతన్ టాటా నోట రతనాల్లాంటి పలుకులెన్నో జాలువారాయి. ప్రతి మాట వెనుక గొప్ప తాత్విక చింతన కనిపిస్తుంది. దూరదృష్టి గోచరిస్తుంది. జీవితాన్ని వడకట్టిన తీరు అర్థమవుతుంది. అది దేశం గురించి కావచ్చు.. దేశ ప్రజలకు కావచ్చు.. దేశ పురోగతికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు.. వ్యక్తిత్వ వికాసం కావచ్చు.. కొన్ని ఆణిముత్యాల్లాంటి రతన్ టాటా మాటలు గమనిస్తే ప్రతి ఒక్కరికీ వారి జీవితం పట్ల, వారివారి వృత్తుల పట్ల తప్పనిసరిగా కచ్చితమైన అవగాహన పెరుగుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా.. ఆయన మాటలు.. కొన్ని తరాలపాటు యావత్ దేశ ప్రజలకు ప్రత్యేకించి ప్రగతి సాధించాలనే పట్టుదల ఉన్న యువతకు వెలుగు దివిటీల్లా నిలుస్తాయి. నిజానికి వీటిలో చాలా వరకూ గతంలో విన్నట్టో, చదివినట్టో అనిపిస్తుంది. అప్పుడు తెలియదు.. ఆ మాటలు రతన్ టాటావేనని. వాటిలో కొన్నింటిని గమనిస్తే..
- ‘భారతదేశ భావి సంభావ్యతపై నేనెప్పుడూ పూర్తి విశ్వాసం, ఉల్లాసంతో ఉన్నాను. గొప్ప సంభావ్యత కలిగిన గొప్ప దేశం ఇదని భావిస్తున్నాను’.
- ‘తాము చదువుతున్నది సత్యమే అని ఇప్పటికీ ప్రజలు నమ్ముతున్నారు’.
- ‘ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు.. దానికి పట్టే తుప్పు తప్ప. అదే విధంగా ఒక వ్యక్తిని ఎవరూ నాశనం చేయలేరు.. అతని సొంత మనస్తత్వం తప్ప’.
- ‘సరైన నిర్ణయాలు తీసుకోవడం అనేదాన్ని నేను నమ్మను. నేను నిర్ణయాలు తీసుకుని వాటిని సరైనవిగా చేస్తాను’.
- ‘వేగంగా నడవాలంటే.. ఒంటరిగా నడువు.. అదే చాలాదూరం నడవాలంటే.. కలిసి నడువు’.
- ‘పనిని, జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనేదాన్ని నేను నమ్మను. మీ పనిని, మీ జీవితాన్ని ఒక్కటి చేయటాన్ని విశ్వసిస్తాను. మీ పనిని, మీ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోండి. పరిపుష్టం చేయండి. అప్పుడు అవే ఒకదానికి ఒకటి సహకరించుకుంటాయి’.
- ‘పెద్ద చెప్పులు కలిగిన వ్యక్తిని నేను అనుసరించాను. ఆయన నాకు ఒక గొప్ప వారసత్వాన్ని అప్పగించి వెళ్లారు. ఆ వారసత్వాన్ని అనుసరించేందుకు నేను నా ప్రయత్నాలు చేశాను’.
- ‘ప్రజలు నీ మీద విసిరే అన్ని రాళ్లనూ తీసుకో.. వాటితో గొప్ప సౌధం నిర్మించుకో’.
- ‘అతి పెద్ద రిస్క్ ఏంటంటే.. ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడమే. చాలా త్వరగా మారిపోతున్న ఈ ప్రపంచంలో రిస్క్ తీసుకోకపోవడం అంటే కచ్చితంగా విఫలమవడమే’.
- ‘మన ప్రయాణం సాగుతూ ఉండాలంటే జీవితంలో ఎత్తుపల్లాలు చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఈసీజీలో రేఖ తిన్నగా ఉన్నదంటే.. మనం జీవించిలేమని అర్థం’ .
- ‘సవాళ్లు ఎదురైనప్పుడు పట్టుదలతో, దృఢంగా ఉండండి. ఎందుకంటే.. విజయాన్ని నిర్మించుకోవడానికి అవే ఇటుకలు.
- ‘మన జీవితం ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించలేక పోవచ్చు కానీ.. నీ ప్రాముఖ్యాన్ని తక్కువ అంచనా వేయవద్దు. ఎందుకంటే.. సాహసం అనేది అంటురోగం లాంటిదని, ఆశ అనేది ప్రాణాన్ని తీస్తుందని చరిత్ర మనకు చూపింది’.
- ‘భౌతిక విషయాలు అర్థరహితమని ఒక రోజు మీరు అర్థం చేసుకుంటారు. మీరు ఇష్టపడే వ్యక్తుల శ్రేయస్సు కోరుకోవడంలోనే అంతా ఉంది’.
- ‘అవకాశాలు నీ దగ్గరకు వచ్చేంత వరకూ ఎదురుచూడకు. నువ్వే అవకాశాలు సృష్టించుకో.
- ‘తన కంటే తెలివైన అసిస్టెంట్లు, అసోసియేట్లను తన చుట్టూ ఉంచుకోవడానికి ఆసక్తి చూపేవాళ్లు ఉత్తమ నాయకులు’.
- ‘ఇతరులతో వ్యవహరించేటప్పుడు దయ, సహానుభూతి, ప్రేమల శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు’
- ‘అధికారం, సంపద ఈ రెండూ నా ప్రధానాంశాలు కావు’