చంద్రయాన్-4 సిద్ధమవుతున్న ఇస్రో..! లూనార్ శాంపిల్స్ తీసుకురావడమే లక్ష్యంగా..!
భారతదేశం అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది.

విధాత: భారతదేశం అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 విజయవంతమైంది. ఇస్రో పంపిన విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ను దింపిన తొలి దేశంగా కీర్తిని గడించింది. ప్రజ్ఞాన్ రోవర్ దాదాపు వంద మీటర్లకుపైగా ప్రయాణించిన చంద్రుడిపై సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. చంద్రయాన్-3 విజయవంతం తర్వాత ఇస్రో జోరును పెంచింది.
తాజాగా మరో రెండు మూషన్ మిషన్లపై పని చేస్తున్నది. పుణేలో జరిగిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటియోరాలజీ 62వ వ్యవస్థాపక దినంలో అహ్మదాబాద్‌లోని ఇస్రో సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సారి చంద్రుడిపై ‘ధ్రువ’ అన్వేషణ మిషన్‌పై పని చేయబోతున్నట్లు పేర్కొన్నారు. చంద్రయాన్-3లో చంద్రుడిపై 70 డిగ్రీల చీకటి ప్రాంతంలో ల్యాండర్, రోవర్‌ను దింపామన్న ఆయన.. లూపెక్స్ మిషన్‌లో చంద్రుడి చీకటి కోణం పరిశోధనలు జరిపేందుకు 90 డిగ్రీల చీకటి ప్రాంతంలో ల్యాండర్‌ను దింపాల్సి ఉంటుందన్నారు. ఈ సారి 350 కిలోల బరువున్న భారీ రోవర్‌ను అక్కడి దింపాల్సి ఉంటుందన్నారు.
చంద్రయాన్-3లో పంపిన ప్రజ్ఞాన్ రోవర్ బరువు కేవలం 30కిలోలు మాత్రమే. ఈ మిషన్‌లో ల్యాండర్ సైతం పెద్దగా ఉంటుందని చెప్పారు. చంద్రయాన్-4 మిషన్‌ను ప్లాన్ చేశామని, దీన్నే లూనార్ శాంపిల్ రిటర్న్ మిషన్ సైతం అంటారని తెలిపారు. ఈ మిషన్‌లో చంద్రుడి ఉపరితలంపై దిగడంతో పాటు శాంపిల్స్‌ను తిరిగి భూ ఉపరితలానికి తీసుకువస్తామన్నారు. ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3 విజయవంతం తర్వాత ఇస్రోతో కలిసి పని చేసేందుకు నాసా ముందుకు వచ్చింది. భవిష్యత్ అంతరిక్ష పరిశోధనల్లో సహకారం కోసం సాధ్యమైన అవకాశాలపై ఇరు సంస్థలు చర్చించాయి.
నాసా జెట్ ప్రొపల్షన్ లాబేరేటరీ డైరెక్టర్ లారీ లెషిన్ ఇస్రో ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్‌తో సమావేశమయ్యారు. అయితే, నాసాతో కలిసి పని చేయబోతుండడంపై ఇస్రో సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇస్రో-నాసా సంయుక్తంగా సింథటిక్ ఎపర్చర్ రాడార్ (NISAR) మిషన్‌పై పని చేస్తున్నాయి. ఈ మిషన్ వచ్చే ఏడాది చేపట్టనుండగా.. యూఆర్‌రావు శాటిలైట్ సెంటర్‌లో లారీ లెషిన్ బృందం కలిసి పని చేశారు.