మోదీ పాలనలో పీఎస్‌యూల్లో కోల్పోయిన ఉద్యోగాలు 2.7 లక్షలు

ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లకు మోదీ ప్రభుత్వం ఎసరుపెట్టిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. ఈ మేరకు కొన్ని వివరాలను ఎక్స్‌లో పంచుకున్నారు

మోదీ పాలనలో పీఎస్‌యూల్లో కోల్పోయిన ఉద్యోగాలు 2.7 లక్షలు

ప్రైవేటీకరణతో రిజర్వేషన్లకు బీజేపీ ఎసరు
కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ : ప్రైవేటీకరణ ద్వారా రిజర్వేషన్లకు మోదీ ప్రభుత్వం ఎసరుపెట్టిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ విమర్శించారు. ఈ మేరకు కొన్ని వివరాలను ఎక్స్‌లో పంచుకున్నారు. మోదీ పదేళ్ల ‘అన్యాయ్‌కాల్‌’లో 2.7 లక్షల మంది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. 2013లో 19 శాతంగా ఉన్న కాంట్రాక్ట్‌ వర్కర్లు 2022 నాటికి 43 శాతానికి పెరిగారని అన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మొదలైన 1991 నుంచి మోదీ హయాంలో చేసినవే 72శాతం ఉన్నాయని తెలిపారు. ప్రతి సంస్థ ప్రైవేటు పరం కావడంతో దళితులు, ఆదివాసీలు, ఓబీసీల కుటుంబాలు రిజర్వేషన్లు కోల్పోయాయని పేర్కొన్నారు.

ప్రతి ఒక్క కాంట్రాక్టీకరణ దళితులు, ఆదివాసీల, ఓబీసీ కుటుంబాల రిజర్వేషన్లను పక్కకు నెట్టిందని తెలిపారు. అటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, మరోవైపు బడుగు వర్గాల ఉపాధి అవకాశాల పెంపు ద్వారా దేశ సమ్మిళిత వృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థలు కీలక పాత్ర పోషించాయని జైరాం రమేశ్‌ చెప్పారు. దేశ ఆస్తులన్నింటినీ కొద్దిమంది మోదీ స్నేహితులకు కారుచౌకగా అప్పగించేశారని ఆరోపించారు. ఫలితంగా పెద్ద ఎత్తున నిరుద్యోగిత పెరిగిపోయిందన్నారు. బీజేపీకి సాధారణ ప్రజల ప్రయోజనాలకంటే కార్పొరేట్‌ ప్రయోజనాలే ఎక్కువని ఆరోపించారు. ప్రైవేటీకరణ లేదా పెద్ద నోట్ల రద్దు వంటి చర్యలతో జాతి ప్రయోజనాలను అమ్మకానికి పెట్టారని, సామాజిక న్యాయాన్ని మంటగలిపారని జైరాం రమేశ్‌ ఆరోపించారు.