24 నుంచి 30 గంటల్లో అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్రకటన!

కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక స్థానాలైన అమేథీ, రాయ బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలకు 24 నుంచి 30 గంటల్లో అభ్యర్థులను ప్రకటించనున్నది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపికచేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ

24 నుంచి 30 గంటల్లో అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థుల ప్రకటన!
  • పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు ఎంపిక బాధ్యత
  • కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వెల్లడి
  • రాహుల్‌, ప్రియాంక పోటీపై ఊహాగానాలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మక స్థానాలైన అమేథీ, రాయ బరేలీ లోక్‌సభ నియోజకవర్గాలకు 24 నుంచి 30 గంటల్లో అభ్యర్థులను ప్రకటించనున్నది. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఎంపికచేసే అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిటీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ తెలిపారు. ‘24 నుంచి 30 గంటల్లో ఈ రెండు స్థానాలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఒక నిర్ణయం తీసుకుని ప్రకటిస్తారని భావిస్తున్నాను. ఇప్పటికి ఉన్న సమాచారం ఇదే. కాంగ్రెస్‌ కార్యాలయ ఉత్తర్వులుగా చెబుతున్నవన్నీ నకిలీవే’ అని ఆయన చెప్పారు. ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం చేస్తున్నారా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను బరిలో నిలిపేందుకు కాంగ్రెస్‌ భయపడుతున్నదా? అన్న ప్రశ్నకు.. ‘జాప్యం ఏమీ లేదు. రాయబరేలీలో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిందా? స్మృతి ఇరానీ కూడా సిటింగ్‌ ఎంపీ. ఎవరూ భయపడటం లేదు. చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడికి ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను అప్పగించారు. జాప్యం ఏమీ లేదు. మే 3వ తేదీ వరకూ సమయం ఉన్నది’ అని ఆయన బదులిచ్చారు.
అమేథీ నుంచి రాహుల్‌గాంధీ, ఇప్పటి వరకూ సోనియాగాంధీ ప్రాతినిథ్యం వహించిన రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే ఊహాగానాలు చాలారోజుల నుంచి ఉన్న సంగతి తెలిసిందే. అమేథీ నుంచి రాహుల్‌గాంధీని, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీని బరిలో నిలపాలన ఇప్పటికే యూపీ కాంగ్రెస్‌ నాయకత్వం కేంద్ర ఎన్నికల కమిటీని కోరింది.

శనివారం జరిగిన సమావేశంలో ఉత్తరప్రదేశ్‌ పార్టీ విజ్ఞప్తికి సీఈసీ మద్దతు పలికింది.
అయితే.. అమేథీ నుంచి లేదా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్‌ ఇష్టపడటం లేదని హిందూస్థాన్‌ టైమ్స్‌ ఒక కథనంలో తెలిపింది. ఈ రెండు సీట్లలో గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీలో ఉండొద్దనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తున్నదని పేర్కొంది.
‘రాహుల్‌గాంధీని ఒప్పించేందుకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే రాహుల్‌ మాత్రం తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టు కనిపిస్తున్నది’ అని ఒక పార్టీ నాయకుడిని ఉటంకిస్తూ పేర్కొంది. తొలుత రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు దాదాపు అంగీకారానికి వచ్చినా.. తర్వాత ఆ ఆలోచన విరమించుకున్నారని మరో నేత చెప్పారు.