Uttar Pradesh | యూపీలో ఓటమి బాటలో ఆరుగురు కేంద్ర మంత్రులు..

ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి తగిలిన ఎదురుదెబ్బ అట్లాంటిట్లాంటిది కాదు.. ఇక్కడ ఒకప్పుడు రాహుల్‌ గాంధీని అమేథీలో ఓడించిన స్మృతి ఇరానీ సహా ఏకంగా ఆరుగురు కేంద్రమంత్రులు ఓటమిని ఎదుర్కొంటున్నారు

Uttar Pradesh | యూపీలో ఓటమి బాటలో ఆరుగురు కేంద్ర మంత్రులు..

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి తగిలిన ఎదురుదెబ్బ అట్లాంటిట్లాంటిది కాదు.. ఇక్కడ ఒకప్పుడు రాహుల్‌ గాంధీని అమేథీలో ఓడించిన స్మృతి ఇరానీ సహా ఏకంగా ఆరుగురు కేంద్రమంత్రులు ఓటమిని ఎదుర్కొంటున్నారు. అమేథీలో కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరీలాల్‌ శర్మపై దాదాపు లక్ష 45వేల ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారు. కిశోరీలాల్‌ శర్మను స్మృతి ఇరానీ, ఆమె ప్రచార బృందం చాలా తేలిగ్గా తీసుకున్నారు. కానీ.. ఆయన వారికి కోలుకోలేని షాక్‌ ఇచ్చారు. హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా థేని కూడా ఖేరీ నియోజకవర్గంలో బాగా వెనుకబడిపోయారు. ఇక్కడ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ఉత్కర్ష్‌ వర్మ 33వేలకుపైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక్కడ 2021లో కేంద్రమంత్రికి చెందిన కారు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపైకి దూసుకుపోయి, నలుగురి మరణానికి కారణమైన కేసులో అజయ్‌ మిశ్రా పేరు పతాకశీర్షికల్లో వచ్చింది. ఈ కేసులో ఆయన కుమారుడు అశీశ్‌ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయినప్పటికీ బీజేపీ మరోసారి అజయ్‌మిశ్రాకే టికెట్‌ ఇవ్వడం బీజేపీకి బూమర్యాంగ్‌ అయింది. మోహన్‌లాల్‌ గంజ్‌లో మరో కేంద్రమంత్రి కౌశల్‌ కిశోర్‌ వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి ఆర్కే చౌదరి 84వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. చందౌలిలో కేంద్రమంత్రి మహేంద్రనాథ్‌ పాండే తన సమీప ఎస్పీ ప్రత్యర్థి వీరేంద్ర సింగ్‌ చేతిలో 22వేల ఓట్ల వెనుకబడి ఉన్నారు. ఫతేపూర్‌లో మరో కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తన సమీప సమాజ్‌వాది అభ్యర్థి చేతిలో 26వేలకుపైగా ఓట్లు వెనుకబడి ఉన్నారు