మైనర్‌పై అత్యాచారం కేసులో చార్జ్ షీట్ కు రూ.10వేలు లంచం

మైనర్‌పై అత్యాచారం కేసులో చార్జ్‌షీట్ వేయాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన పోలీసు సిబ్బంది లోకాయుక్త దాడిలో చిక్కి కలకలం రేపారు.

దేశంలో అవినీతి అధికారులు, ఉద్యోగుల దుర్మార్గానికి ఈ కేసు ఓ పరాకాష్టగా నిలిచింది. చెత్త ఏరుకునే ఓ మహిళ కుమార్తె (మైనర్)పై అత్యాచారానికి సంబంధించిన కేసులో బాధితుల నుంచి రూ.10వేలు లంచం అడిగిన పోలీసుల నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగిలోని స్టేషన్ బజార్ పోలీస్ స్టేషన్ లో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో చార్జ్‌షీట్ వేయాలని, మీకు అనుకూలంగా రాయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని స్టేష‌న్ అధికారిణి జ్యోతి, ఏఎస్సై శివశరణప్ప బాలిక తల్లిని డిమాండ్ చేశారు.

కూతురిపై అఘాయిత్యం జరిగి బాధపడుతుంటే, పోలీసులు డబ్బుల కోసం వేధించడంతో ఆ తల్లి తీవ్ర మనో వేదనకు గురైంది. అంత బాధలోనూ తను ఎదుర్కొంటున్న అన్యాయంపై పోరాడేందుకు ఆ బాధిత తల్లి కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో లోకాయుక్తను ఆశ్రయించింది. బాధితురాలి నుంచి స్టేష‌న్ అధికారిణి జ్యోతి లంచం తీసుకుంటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. లంచం తీసుకుంటూ మహిళా కానిస్టేబుల్ జ్యోతి లోకాయుక్తకు చిక్కగా, ఏఎస్సై శివశరణప్ప పరారయ్యారు.

ఇలాంటి ఘటనలు పోలీసు వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. చెత్త ఏరుకుని బతికే వారినే..అదికూడా అత్యాచారానికి గురైన బాధిత కుటుంబం నుంచి డబ్బులు డిమాండ్ చేశారంటే, వారి అక్రమ సంపాదన ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. ఈ రకమైన అవినీతి జలగల ఏరివేతకు ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు చేపట్టాల్సి ఉందని కోరుతున్నారు.

Latest News