కనుల విందు..ఖరల్‌ధాస్ జలపాతం పరవళ్లు!

భారీ వర్షాలతో ఒడిశాలోని ఖరల్‌ధాస్ జలపాతం 500 అడుగుల ఎత్తు నుంచి పరవళ్లు తొక్కుతూ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. వర్షాకాలంలో ఈ జలపాతం అద్భుతమైన అందాలతో పర్యాటకులను విశేషంగా అలరిస్తోంది.

దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో నదులు, జలపాతాలు వరదలతో పరవళ్లు తొక్కుతున్నాయి.పలు రాష్ట్రాలలో ఎత్తైన ప్రాంతాల నుంచి కొండలు, కోనల మధ్య నుంచి దిగువకు జాలువారే జలపాతాల దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదకరమైన వరదల ఉదృతితో కొండల నుంచి దూకుతున్న జలపాతాలు సందర్శకులకు, స్థానికులకు మాత్రం కనువిందు చేస్తున్నాయి.

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని నుపడా జిల్లాలో ఉన్న ఖరల్ధాస్ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో 500 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న ఈ జలపాతం చూపరులకు కనువిందు చేస్తోంది. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని పర్యాటక ప్రాంతంగా మారుతోంది. ఇది ప్రమాదకరంగా అనిపించినప్పటికీ, వర్షాకాలంలో తన పూర్తి ఉధృతితో అద్భుతమైన అందంతో అలరారుతుండటం విశేషం.

తాజా వర్షాలతో కేరళ, ఒడిశా, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఏపీలలోని ప్రముఖ జలపాతాలు ఎత్తైన ప్రాంతాల నుంచి జాలువారుతూ సందర్శకులకు అహ్లాదాన్ని పంచుతున్నాయి. తెలంగాణలో బొగతా, కుంతల, మల్లేల తీర్థం, పొచ్చెర, బీమునీ పాదం వంటి జలపాతాలు తాజా వర్షాలకు జలకళను సంతరించకుంటు ఆకట్టుకుంటున్నాయి.

Latest News