Tiwanese Watermelon | పుచ్చ‌కాయ‌ల సాగు.. 3 నెల‌ల్లోనే రూ. కోటికి పైగా సంపాద‌న‌..

Tiwanese Watermelon | చాలా మంది రైతులు వ‌రి, మొక్క‌జొన్న‌, వేరుశ‌న‌గ వంటి పంట‌ల‌ను సాగు చేస్తుంటారు. వీటితో పాటు కూర‌గాయ‌ల‌ను కూడా పండిస్తుంటారు. పండ్ల‌ను పండించ‌డం చాలా త‌క్కువ‌. ఎండాకాలంలో విరివిగా ల‌భించే పుచ్చ‌కాయ‌ల‌ను అస‌లే పండించ‌రు. కానీ ఓ గ్రామం మొత్తం తైవాన్ పుచ్చ‌కాయ‌ల‌ను( Tiwanese Watermelon ) పండిస్తూ లాభాల‌ను గ‌డిస్తున్నారు. మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే రూ. కోటికి పైగా సంపాదించారు ఆ గ్రామ రైతులు. మ‌రి ఆ గ్రామం గురించి తెలుసుకోవాలంటే ఒడిశా( Odisha ) వెళ్లాల్సిందే.

  • By: raj |    national |    Published on : Apr 21, 2026 10:53 AM IST
Tiwanese Watermelon | పుచ్చ‌కాయ‌ల సాగు.. 3 నెల‌ల్లోనే రూ. కోటికి పైగా సంపాద‌న‌..

Tiwanese Watermelon | ఒడిశా( Odisha ) మయూర్‌భంజ్ జిల్లాలోని కుంధేయి గ్రామం( Kundhei Village )లోని రైతులంద‌రూ వ‌రి, మొక్క‌జొన్న పంట‌తో పాటు కూర‌గాయ‌ల‌ను సాగు చేసేవారు. ఈ పంట‌ల‌కు ఆదాయం ప‌రిమితంగా ఉండేది. ఈ క్ర‌మంలో 2021 అక్టోబ‌ర్ నెల‌లో ఆ గ్రామానికి చెందిన భ‌క్తోష్ కుమార్ మ‌హంత తైవాన్‌కు చెందిన పుచ్చ‌కాయ‌ల‌ను( Tiwanese Watermelon ) ప‌రిచ‌యం చేశాడు. ఈ పుచ్చ‌కాయ‌ల సాగు వ‌ల్ల త‌క్కువ కాలంలోనే అధిక దిగుబ‌డితో పాటు రాబ‌డి సాధించొచ్చు అనే విష‌యాన్ని గ్రామంలోని రైతుల‌కు కుమార్ వివ‌రించారు.

రూ. 50 వేల పెట్టుబ‌డి చొప్పున పుచ్చ‌కాయ‌ల సాగుకు శ్రీకారం

కుమార్ మాట‌ల‌కు ఆక‌ర్షితులైన ఓ ముగ్గురు రైతులు.. పుచ్చ‌కాయ‌ల సాగుకు పూనుకున్నారు. ఈ ముగ్గురు రైతులు కూడా ఎక‌రం చొప్పున మూడు ఎక‌రాల్లో రూ. 50 వేల పెట్టుబ‌డి చొప్పున పుచ్చ‌కాయ‌ల సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ పెట్టుబ‌డిలోనే విత్త‌నాలు, ఎరువులు, వ‌ర్మీకంపోస్ట్, వేప పిండి వంటి ముడి స‌రుకుల‌ను కొనుగోలు చేశారు. మొత్తంగా మూడు ర‌కాల వెరైటీల‌ను సాగు చేశారు. ఆరోహి(ప‌సుపు రంగు గుజ్జు), విశాల‌(ఎరుపు రంగు గుజ్జు), జ‌న్న‌త్(ఎర్ర‌ని గుజ్జు) వంటి వెరైటీల‌ను సాగు చేశారు.

ఎక‌రాకు రూ. 1.5 ల‌క్ష‌ల నిక‌ర ఆదాయం

2021లో సుధీర్ మ‌హంత అనే రైతు పుచ్చ‌కాయ‌ల సాగును ప్రారంభించాడు. విత్త‌నాలు విత్తిన 30 నుంచి 35 రోజుల‌కే కాయ‌లు కాయ‌డం ప్రారంభ‌మైంది. మార్చి మ‌ధ్య‌నాటికి దిగుబ‌డి వ‌చ్చింది. ఇక కిలో పుచ్చ‌కాయ‌ల‌ను రూ. 40 నుంచి రూ. 50 మ‌ధ్య విక్ర‌యించారు. దీంతో ఎక‌రాకు రూ. 2 ల‌క్ష‌ల ఆదాయం ల‌భించింది. ఖ‌ర్చులు పోనూ కేవ‌లం మూడు నెల‌ల్లోనే ఎక‌రాకు రూ. 1.5 ల‌క్ష‌ల నిక‌ర ఆదాయాన్ని స‌ముపార్జించారు.

పుచ్చ‌కాయ‌ల సాగు అనంత‌రం అదే భూమిలో మ‌ళ్లీ వ‌రి సాగు

ఇక పుచ్చ‌కాయ‌ల సాగు అనంత‌రం అదే భూమిలో మ‌ళ్లీ వ‌రి సాగు చేయొచ్చు అని రైతు సుధీర్ తెలిపాడు. అయితే పుచ్చ‌కాయ‌ల సాగు వ‌ల్ల త‌న‌కు ఎంతో లాభం చేకూరింద‌న్నాడు. త‌మ కుటుంబానికి నిజ‌మైన ఆర్థిక స్థిర‌త్వాన్ని సాధించి పెట్టింద‌ని సుధీర్ పేర్కొన్నాడు.

3 నుంచి 60 మంది..

మొద‌టి ఏడాది కేవ‌లం ముగ్గురు రైతుల‌కే ప‌రిమితమైన ఈ పుచ్చ‌కాయ‌ల సాగు ఏడాదికి ఏడాదికి విస్త‌రించింది. మ‌రుస‌టి ఏడాది 12 మంది రైతులు ఈ సాగును చేశారు. ప్ర‌స్తుతం 60 మంది రైతులు పుచ్చ‌కాయ‌ల సాగులో బిజీ అయిపోయారు.

రైతులంద‌రి ఆదాయం రూ. కోటి దాటింది..

ఈ సీజ‌న్‌లో గ్రామంలోని పుచ్చ‌కాయ‌ల సాగు రైతులంద‌రి ఆదాయం రూ. కోటి దాటింది. ఒక్కో రైతు ఎక‌రన్న‌ర‌కు త‌గ్గ‌కుండా సాగు చేస్తున్నారు. కేవ‌లం 90 రోజుల్లోనే పంట చేతికి వ‌స్తుంది. అన్ని ఖ‌ర్చులు పోనూ ఒక్కో రైతుకు రూ. 1.5 ల‌క్ష‌ల లాభం వ‌స్తుంది. ప్ర‌తి ఏడాది 60 మంది రైతులం ఈ సాగులో నిమ‌గ్న‌మ‌వుతున్నారు.

తైవాన్ పుచ్చ‌కాయ‌లు కిలో రూ. 40 నుంచి రూ. 50 వ‌ర‌కు

సాధార‌ణంగా పుచ్చ‌కాయ కిలో రూ. 20 కాగా, తైవాన్ పుచ్చ‌కాయ‌లు కిలో రూ. 40 నుంచి రూ. 50 వ‌ర‌కు అమ్మ‌డ‌వుతున్నాయి. రుచి కారణంగానే ఈ పుచ్చ‌కాయ‌ల‌కు భారీ డిమాండ్ ఉంది.

మారిన గ్రామ‌స్తుల జీవ‌న‌శైలి..

రైతు ఖ‌గేశ్వ‌ర్ మ‌హంత మాట్లాడుతూ.. గ‌తేడాది నేను ఈ సాగు ప్రారంభించాను. ఈ సీజ‌న్‌లో రూ. 1.6 ల‌క్ష‌ల లాభం ఆర్జించిన‌ట్లు ఖ‌గేశ్వ‌ర్ పేర్కొన్నారు. గ్రామ‌స్తులంద‌రూ కూడా ఈ సాగునే ఎంచుకున్నార‌ని తెలిపారు. మా గ్రామ‌స్తుల జీవ‌న‌శైలి కూడా మారింద‌ని పేర్కొన్నారు.

జాతీయ ర‌హ‌దారి 18 వెంట‌.. స్టాల్స్ ఏర్పాటు

అయితే పండించిన పుచ్చ‌కాయ‌ల‌ను మార్కెట్‌కు త‌ర‌లించడంతో పాటు.. జాతీయ ర‌హ‌దారి 18 వెంట‌.. స్టాల్స్ ఏర్పాటు చేసి.. విక్ర‌యిస్తున్నారు. ఇక వాహ‌న‌దారులు ఆగి.. ప‌లు రంగుల్లో ఉన్న పుచ్చ‌కాయ‌ల‌ను కొనుగోలు చేసి రుచిని ఆస్వాదిస్తున్నారు. పుచ్చ‌కాయ‌ల‌ను స్థానికంగా విక్ర‌యించ‌డ‌మే కాకుండా.. భువ‌నేశ్వ‌ర్, క‌ట‌క్, బాలాసోర్‌తో పాటు కోల్‌క‌తా వంటి న‌గ‌రాల‌కు ర‌వాణా చేస్తున్నారు. స‌మీపంలోని వ్యాపారులు నేరుగా రైతుల వ‌ద్ద‌కే వ‌చ్చి పుచ్చ‌కాయ‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు.

తైవాన్ పుచ్చ‌కాయ‌కు ఎందుకంత ప్ర‌త్యేక‌త‌..?

తైవాన్ పుచ్చ‌కాయ‌లు ప్ర‌త్యేక రుచిని, రంగును క‌లిగి ఉండ‌డంతో.. ఆహార ప్రియుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తున్నాయి. త‌క్కువ కాలంలోనే అధిక దిగుబ‌డి వ‌స్తుంది. రుచిలోనే కాకుండా.. రూపంలోనే ఎంతో ఆక‌ర్షణీయంగా ఉండ‌డం మూలంగా అధిక కొనుగోళ్లు జ‌రుగుతున్నాయ‌న్నారు.

పుచ్చ‌కాయ‌ల గ్రామంగా కుంధేయి

ఇప్పుడు కుంధేయి గ్రామం తైవాన్ పుచ్చ‌కాయ‌ల గ్రామంగా రూపాంత‌రం చెందింది. పంట ఎంపిక‌, మార్కెట్ వ్యూహం రెండు క‌లిసి రావ‌డంతో.. రైతుల ఆదాయం మ‌రింత మెరుగైంది.