వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ విజయవంతం

రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లను సందర్శించిన కమిషన్, రైతులు మార్కెటింగ్ వ్యవస్థలో ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను గుర్తించినట్లు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి వెల్లడించారు. రైతుల ఆదాయం, స్థిరత్వం అలాగే జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ నిర్వహించబడిందని పేర్కొన్నారు. మార్కెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మార్కెట్ ప్రాప్తి విస్తరణ, డిజిటల్ సాధనాల ప్రోత్సాహంతోపాటు మధ్యవర్తులపై ఆధారాన్ని తగ్గించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు

Reported by: Subbu | తెలంగాణ‌ | Apr 15, 2026, 7:03 pm IST
Read Time: 4 mins
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ విజయవంతం

హైదరాబాద్, ఏప్రిల్ 15, విధాత: తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ హైదరాబాద్‌లోని బూర్గుల రామకృష్ణారావు (BRKR) భవన్‌లో నిర్వహించారు. రాష్ట్రంలోని పలు వ్యవసాయ మార్కెట్లను సందర్శించిన కమిషన్, రైతులు మార్కెటింగ్ వ్యవస్థలో ఎదుర్కొంటున్న అనేక సవాళ్లను గుర్తించినట్లు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి వెల్లడించారు. రైతుల ఆదాయం, స్థిరత్వం అలాగే జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ వర్క్‌షాప్ నిర్వహించబడిందని పేర్కొన్నారు. మార్కెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి, మార్కెట్ ప్రాప్తి విస్తరణ, డిజిటల్ సాధనాల ప్రోత్సాహంతోపాటు మధ్యవర్తులపై ఆధారాన్ని తగ్గించడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ సభ్యులు, కమిషన్ సలహాదారులు, అన్ని జిల్లాల వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్ శాఖల అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, కార్యదర్శులు , రైతు సంఘాల ప్రతినిధులు, కమిషన్ ఏజెంట్లు, ప్రకృతి వ్యవసాయ రైతులు, ఐటిడిఏ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుసంవర్ధక మార్కెట్ల చట్టం, 1966 మరియు తదనంతర సవరణలు, రైతు బజార్ల ప్రస్తుత స్థితి మరియు రైతులకు వాటి ప్రయోజనం, మౌలిక సదుపాయాలతో కొత్త మార్కెట్ల స్థాపన, కమిషన్ ఏజెంట్ల విధుల అమలు, రైతుల సంక్షేమం కోసం సూచనలు వంటి అంశాలపై కూలంకుశంగా చర్చించినట్లు తెలిపారు. వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రతినిధుల నుండి విలువైన సలహాలు సూచనలు స్వీకరించామని కమిషన్ చైర్మన్ , సభ్యులు తెలిపారు. ఈ సూచనల ఆధారంగా సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి, రైతులకు లాభదాయకమైన పారదర్శక మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.