పర్యాటక కేంద్రం లక్ష్యద్వీప్ లో 47ఏళ్ల తర్వాత కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా గత 47 ఏండ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేసింది. లక్షద్వీప్‌లో సుమారు 97 శాతం జనాభా ముస్లింలే. ఇస్లాం మతంలో మద్యపానాన్ని నిషేధించిన నేపథ్యంలో 1979 నుంచి లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలపై నిషేధం అమలు చేశారు.
అయితే ఈ నిషేధం పూర్తిస్థాయిలో లేదు. పర్యాటకులు, ప్రభుత్వ అధికారుల కోసం కొన్ని మినహాయింపులు ఇచ్చారు. కవరత్తి, బంగారం ద్వీపాల్లోని కొన్ని పర్యాటక రిసార్టులు, ప్రభుత్వ నిర్వహణ బార్లలో మినహాయింపు ఉండేది.
కానీ లక్షద్వీప్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నిర్ణయానికి ఆమోదం తెలుపుతూ ‘లక్షద్వీప్ ఎక్సైజ్ రెగ్యులేషన్ 2026’ ను ఆమోదించారు. 1979 నుంచి అమల్లో ఉన్న ‘లక్షద్వీప్ ప్రొహిబిషన్ రెగ్యులేషన్’ ను కొత్త చట్టం ద్వారా రద్దు చేశారు. కొత్త ఎక్సైజ్ నిబంధనల ప్రకారం, లైసెన్సులు ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లు లేదా ఏజెన్సీల ద్వారా మాత్రమే మద్యం విక్రయాలు, ఉత్పత్తి , వినియోగం నియంత్రిత పద్ధతిలో జరుగుతాయి. మద్యం వినియోగాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం భారీగా సుంకాలు విధించింది.
భారీగా పన్నులు..
నియంత్రిత విధానంలో మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చినప్పటికీ, పన్నులు మాత్రం భారీగా ఉన్నాయి. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (IMFL), విదేశీ మద్యంపై 400%, బీర్‌పై 200%, వైన్‌పై 80% ఎక్సైజ్ సుంకాలను నిర్ణయించారు. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి మద్యం విక్రయించడం నిషేధం కొనసాగుతుంది.
లక్షద్వీప్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మాల్దీవుల స్థాయిలో దీనిని తీర్చిదిద్దాలనుకుంటోంది. ఈ క్రమంలోనే పర్యాటకులను ఆకర్షించేందుకు మద్య నిషేధాన్ని ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ 2024 లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి పర్యాటకుల రద్దీ పెరిగింది. 2020లో కేవలం 3875 మంది పర్యాటకులు మాత్రమే వెళ్తే, 2024 నాటికి ఈ సంఖ్య 68 వేలకు చేరింది. గతంలో ప్రధాని నరేంద్రమోదీ లక్షద్వీప్‌లో పర్యటించి బీచ్‌లో ఫోటోలు వైరల్ అయ్యాయి.
లక్ష్యద్వీప్ ప్రత్యేకతలు
లక్షద్వీప్ 36 ద్వీపాల సమూహం. వాటిలో అగట్టి, అమిని, ఆండ్రోట్, బిట్రా, చెట్లట్, కడ్మత్, కల్పేని, కవరట్టి, కిల్తాన్ మరియు మినీకాయ్‌తో సహా 10 ద్వీపాలలో జనావాసం ఉంది. విదేశీయులు, భారతీయ పర్యాటకులు ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ ప్రాంతాలను సందర్శించాల్సి ఉంటుంది. విదేశీ పర్యాటకులు కేవలం అగట్టి, బంగారం, కడ్మత్ ద్వీపాల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ 36 ద్వీపాల్లో 10 ద్వీపాల్లో ప్రజలు ఉంటే, మరో 17 దీవుల్లో జనావాసాలు లేవు. కొత్తగా మరో 4 చిన్న దీవులు ఏర్పడ్డాయి.
స్థానికుల్లో ఆందోళన
దాదాపు 97 శాతం ముస్లిం జనాభా కలిగిన లక్షద్వీప్‌లో, స్థానిక సాంస్కృతిక, మతపరమైన విలువల దృష్ట్యా దశాబ్దాలుగా మద్యపాన నిషేధం అమలులో ఉంది. ప్రభుత్వ తీసుకున్న తాజా నిర్ణయంపై కొందరు స్థానికులు, సామాజిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇది తమ సంస్కృతి, సామాజిక జీవనంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. పర్యాటక అభివృద్ధి, స్థానిక సంప్రదాయాల మధ్య సమతుల్యం సాధించే దిశగా ఈ నూతన విధానం ఇప్పుడు ఒక కీలక పరిణామంగా మారిందంటున్నారు.
