భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభ వేదికలో స్వల్ప మార్పు..
భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభోత్సవానికి సంబంధించి కాంగ్రెస్ కీలక అప్‌డేట్ ఇచ్చింది

న్యూఢిల్లీ : భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభోత్సవానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కీలక అప్‌డేట్ ఇచ్చింది. జనవరి 14న మణిపూర్ రాజధాని ఇంఫాల్ వేదికగా యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ ఈ వేదికను మార్చుతూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ప్రకటన చేసింది. ఇంఫాల్‌లోని హప్తా కాంగ్జెబంగ్ నుంచి తౌబాల్ జిల్లాలోని కోంగ్‌జాం గ్రామానికి మార్చుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ తన ప్రకటనలో పేర్కొంది.
ఈ సందర్భంగా మణిపూర్ మాజీ సీఎం ఓ ఇబోబి మాట్లాడుతూ.. భారత్ జోడో న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వకుండా ప్రస్తుతం సీఎం ఎన్ బీరెన్ సింగ్ ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ యాత్రకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని మణిపూర్ పీసీసీ చీఫ్ కే మేఘాచంద్ర జనవరి 2వ తేదీనే మణిపూర్ హోంశాఖ అధికారులకు దరఖాస్తు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు.
ఏఐసీసీ మణిపూర్ ఇంచార్జి గిరీష్ చోదంకర్ మాట్లాడుతూ.. భారత్ జోడో న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వకుండా మణిపూర్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందన్నారు. రాహుల్ గాంధీని చూసి మణిపూర్ సర్కార్‌కు భయపడుతోందన్నారు. చివరకు షరతులతో కూడిన అనుమతిని మణిపూర్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. యాత్రలో వెయ్యి మంది కంటే ఎక్కువగా పాల్గొనకూడదని ఆదేశించారు. ర్యాలీలో పాల్గొనే వారి జాబితాను ముందే ఇవ్వాలని సూచించారు. రాహుల్ గాంధీ చేపట్టే భారత్ జోడో న్యాయ యాత్ర 66 రోజుల పాటు 6,700 కిలోమీటర్ల మేర సాగనుంది. 110 జిల్లాల మీదుగా కొనసాగి మార్చి 20న ముంబై వేదికగా ముగియనుంది.