Liquor sales at Petrol Bunks | మద్యం ప్రియులకు శుభవార్త.. ఇక నుంచి పెట్రోల్ బంకుల్లో మద్యం( Liquor sales at Petrol Bunks ) లభ్యం కానుంది. వైన్ షాపు( Wine Shops )కు వెళ్లి మద్యం కొనాల్సిన పని లేదు.. అలా రహదారి వెంట వెళ్తూ కూడా మద్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించారు. ఈ అవకాశం అదేదో తెలంగాణ( Telangana ) అనుకుంటే పొరపాటే. మన రాష్ట్రం కానే కాదు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్( Chandigarh )లో పెట్రోల్ బంకుల్లో మద్యం విక్రయాలు జరపాలని అధికారులు నిర్ణయించారు.
చండీగఢ్‌లో ఇప్పటి వరకు కేవలం లైసెన్స్‌డ్ మద్యం దుకాణాల్లోనే మద్యం విక్రయిస్తున్నారు. కానీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి చండీగఢ్‌లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, పెద్ద పెద్ద డిపార్ట్‌మెంట్ స్టోర్‌లలో కూడా మద్యం విక్రయాలకు అనుమతించాలని నిర్ణయిం తీసుకున్నారు. ఈ మేరకు చండీగఢ్ ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేర్పులు చేశారు.
ఈ సందర్భంగా చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. పెట్రోల్ బంకుల్లో మద్యం విక్రయాలకు నిర్ణయం తీసుకున్నది వాస్తవమేనని అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చండీగఢ్ మద్యం విక్రయ వ్యవస్థను ఆధునీకరించాలన్నదే ఈ నిర్ణయం వెనుకాల ఉన్న ఉద్దేశమని ఆయన చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన నగరాల్లో మద్యం అనేది కేవలం ప్రత్యేక షాపుల్లో కాకుండా క్రమబద్ధీకరించిన రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటుంది. అదే తరహా చండీగఢ్‌లో కూడా మార్పులు తీసుకొస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ముఖ్యంగా వృద్ధులు, మహిళా వినియోగదారుల అవసరాల కోసం
ముఖ్యంగా వృద్ధులు, మహిళా వినియోగదారుల అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. లైసెన్స్‌డ్ మద్యం దుకాణాల వద్ద మహిళలు, వృద్ధులు మద్యం కొనుగోలు చేసేందుకు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా.. పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే డిపార్ట్‌మెంట్ స్టోర్లు, పెట్రోల్ బంకుల్లో మద్యం అందుబాటులోకి రావడం వల్ల వారు సౌకర్యవంతంగా మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ నిబంధనలు తప్పనిసరి
మద్యం విక్రయించాలనుకునే పెట్రోల్ బంకులు, డిపార్ట్‌మెంటల్ స్లోర్లు తప్పనిసరిగా తమ వార్షిక జీఎస్టీ టర్నోవర్ తప్పనిసరిగా రూ. 3 కోట్లు దాటి ఉండాలి. అప్పుడే మద్యం విక్రయాలకు అనుమతిస్తామన్నారు. ఈ అవుట్‌లెట్‌లకు ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 10బి కింద లైసెన్స్ జారీ చేస్తారు. ఇక మద్యం విక్రయాలను అర్ధరాత్రి వరకు జరుపుకోవచ్చని సూచించారు.
