హైలైట్స్:
- మరో మూడు నెలల్లో ఏఐ సాఫ్ట్‌వేర్
- వంద శాతం పక్కాగా ఓటర్ల జాబితా
- భవిష్యత్తులో పాస్‌పోర్ట్ జారీకి ఇదే ఆధారం?
- సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీ లింకు!
- ఏపీకి జై కొట్టిన టాలీవుడ్
విధాత, హైదరాబాద్:
కన్యాకుమారిలో ఓటు హక్కు ఉన్న వారు హైదరాబాద్‌లో, అమలాపురంలో ఓటు వేసి తరువాత హైదరాబాద్‌లో కూడా ఓటు వేస్తామనే రోజులు ఇక మరిచిపోవాల్సిందే. అదొక గతంలా చర్చించుకోవడం తప్ప రెండు చోట్ల ఓట్లు వేసే రోజులు భవిష్యత్తులో ఉండవని ఎన్నికల అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో బోగస్, చిరునామా మారిన వారు, చనిపోయిన వారు, ఒకటికి మించి పలు చోట్ల ఓటు ఉన్న వారిని తొలగిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణలో సోమవారం సర్ – 2026 ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో సుమారు 73 లక్షల ఓటర్లు తగ్గిపోయారు. మిగిలిన ఓటర్లలో మరో 92 లక్షల మంది ఓటర్ల వివరాలలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి. 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నారు. ఇదిలా ఉంటే మరో మూడు నెలల్లో అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ అందుబాటులోకి తీసుకురానున్నది. ఏఐ సాఫ్ట్‌వేర్ సాయంతో మరింత వడపోత ఉంటుందని, వంద శాతం పక్కాగా జాబితా తయారు అవుతుందని ఒక ఎన్నికల అధికారి వ్యాఖ్యానించారు. ఈ సాఫ్ట్‌వేర్ అన్ని రాష్ట్రాల ఓటర్ల జాబితాలను జల్లెడ పడుతుందని, పక్కాగా ఓటర్ల జాబితా సిద్ధం చేస్తారని చెబుతున్నారు. ఏపీలో ఓటు హక్కు ఉన్నవారు తెలంగాణ లేదా కర్నాటక రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉండటం అసాధ్యమంటున్నారు.
ఒకటికి మించి ఓటు హక్కు కలిగి ఉన్నట్లు నిరూపణ అయితే జైలు శిక్ష అనుభవించడంతో పాటు జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో బీఎల్ఓ లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎవరైనా సరే ఒక చోటే ఓటు నమోదు చేయడం లేదా ఫారాలను అందచేయాలని సూచించారు. దీంతో ఈ మూడు జిల్లాల్లో నివసించే ఆంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాలు రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లకు చెందిన ఓటర్లు తమ స్వస్థలంలోనే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. బీఎల్వోలు ఫారాలను పంపిణీ చేసినా, వాటిని నింపి తిరిగి అందచేయలేదు. వీరిలో చనిపోయిన వారు, ఇతర ప్రాంతాలకు మారిన పౌరులు కూడా ఉన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా పరిధిలోని మెజారిటీ అసెంబ్లీ నియోజకవర్గాలలో 40 శాతానికి తక్కువ కాకుండా ఓటర్లు తొలగింపునకు గురయ్యారు. ఓటరు నమోదు దరఖాస్తులు వెనక్కి ఇవ్వని వారు హైదరాబాద్‌లో 40.99 శాతం, మేడ్చల్‌లో 35.97 శాతం, రంగారెడ్డి 34.79 శాతం ఉన్నారు. వీరిలో తెలంగాణ వాసులు కూడా ఉన్నారు. ఊళ్లలో వ్యవసాయ భూమి, పక్కా ఇళ్లు ఉన్న వారు హైదరాబాద్ బదులు అక్కడే నమోదుకు మొగ్గు చూపారని అధికారులు చెబుతున్నారు. గ్రామంలో ఓటు హక్కు ఉండటం మూలంగా ప్రభుత్వ ప్రయోజనాలు పొందడంతోపాటు భూములకు రక్షణ ఉంటుందనే భరోసాతో హైదరాబాద్ లో ఓటు హక్కును వదులుకున్నారని అంటున్నారు. ఓటు హక్కు లేని కారణంగా గ్రామంలో సర్పంచి విలువ ఇవ్వడం లేదనే కారణంతో కూడా పలువురు హైదరాబాద్ లో నింపిన ఫారాలను వెనక్కి ఇవ్వలేదంటున్నారు. ఇలా పలు కారణాలతో మూడు జిల్లాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పడిపోయిందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
సిద్ధమవుతున్న ఏఐ సాఫ్ట్‌వేర్
స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల కమిషన్ అత్యాధునిక ఏఐ సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నది. దీని సాయంతో బోగస్, నకిలీ, ఒకటికి మించి ఉన్న ఓటర్ల వివరాలు తొలగిస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చివరి విడత సర్ కొనసాగుతున్నది. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఓటు హక్కు లేకుండా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయనున్నారు. ఒక వ్యక్తికి ఒకటికి మించి ఏ రాష్ట్రంలో ఉన్నా ఇట్లే పట్టేసి ఆ వివరాలను తెలియచేస్తుంది. దీంతో పాటు చనిపోయిన వారి పేర్లు కూడా వెల్లడిస్తుంది. డెమోగ్రాఫిక్ ప్రకారం సదరు ఓటరు భారతీయుడేనా లేక ఇతర దేశస్తుడా అనేది కూడా స్పష్టం చేస్తుంది. ఈ ఏఐ సాఫ్ట్‌వేర్ కోసం ప్రభుత్వానికి చెందిన అన్ని విభాగాల నుంచి వివరాలు స్వీకరించడంతో పాటు జనన, మరణ ధృవీకరణ రిజిస్ట్రార్ నుంచి సమాచారం సేకరిస్తుంది. 360 డిగ్రీల కోణంలో పనిచేయనున్న ఏఐ సాఫ్ట్‌వేర్‌తో నకిలీ, బోగస్, చనిపోయిన ఓటర్ల బెడద ఉండదంటున్నారు. దీని సాయంతో తెలంగాణ, ఆంధ్రా ఓటర్లను భవిష్యత్తులో జల్లెడ పట్టనున్నారు. ఆ తరువాత మిగతా రాష్ట్రాలతో సరిపోల్చి, అనర్హుల పేర్లను తొలగించనున్నట్లు ఒక ఎన్నికల అధికారి వివరించారు.
విద్యార్థులు బీ అలర్ట్…
దేశంలో ప్రస్తుతం పాస్ పోర్టు కోసం ఆధార్‌ను కీలక పత్రంగా పరిగణిస్తున్నారు. సర్ పూర్తయిన తరువాత ఆధార్ బదులు ఓటర్ ఐడీ కార్డును పాస్‌పోర్ట్ జారీ కోసం ప్రామాణికంగా పరిగణించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కమిషన్ చేపడుతున్న చర్యలు, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరు పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుందని అంటున్నాయి. పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర రాష్ట్రాలలో సంక్షేమ పథకాలకు ఓటర్ ఐడీనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓటరు ఐడీ ఆధారంగానే పథకాలు అమలు చేస్తామని ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రజలను అప్రమత్తం చేసిన విషయం విదితమే. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ ఐడీ లేని కారణంగా (సర్ జాబితాలో పేరు లేకపోవడం) ఒక పత్రిక ఎడిటర్ పాస్‌పోర్ట్ రెన్యువల్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. సర్ ప్రక్రియ పూర్తయిన తరువాత పాస్‌పోర్ట్ జారీ కోసం ఓటర్ ఐడీని ప్రామాణికంగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయవచ్చనే చర్చ కూడా విస్తృతంగా జరుగుతోంది. ఎన్నికల కమిషన్ అధికారులు అంతర్గతంగా ఇదే అంశాన్ని చర్చించుకుంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రాకు జై…
హైదరాబాద్ నగరంలో చిత్ర పరిశ్రమకు చెందిన అనేక మంది నివాసం ఉంటున్నారు. ఇక్కడ, ఆంధ్రలోని తమ సొంత ఊళ్లలోనూ ఓటు హక్కు కలిగి ఉన్నవారూ ఉన్నారు. ఏదో ఒక ప్రాంతంలోనే ఓటు హక్కు కలిగి ఉండాలని, రెండు చోట్లా ఓటు హక్కు కలిగి ఉన్నట్లు నిరూపణ అయితే జైలు శిక్ష తప్పదని ఎన్నికల కమిషన్ హెచ్చరించిన నేపథ్యంలో టాలీవుడ్ కు చెందినవారు అప్రమత్తం అయ్యారు. హైదరాబాద్ బదులు ఆంధ్రాలో ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఆస్తులు, భూములు, బంధువులు అక్కడే ఉండడం మూలంగా మొగ్గు చూపారంటున్నారు. దీంతో జూబ్లిహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గంలో సినిమా పరిశ్రమకు చెందిన వారి ప్రభావం రానున్న మున్సిపల్, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఉండదనే అంచనాలు వెలువడుతున్నాయి. చిత్ర పరిశ్రమకు చెందిన 80 శాతం మంది హైదరాబాద్ బదులు ఆంధ్రాను ఎంపిక చేసుకున్నారని ఒక ఎన్నికల అధికారి పేర్కొన్నారు.