విధాత : పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మరువకముందే కేంద్రం సెలవు దినం ఆదివారం రోజున వంట గ్యాస్(LPG) వినియోగదారులక షాక్ ఇచ్చింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను కూడా పెంచుతూ ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా నిర్ణయంతో గృహ అవసరాలకు వాడే 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరపై ఇప్పుడు ఏకంగా రూ.29 పెరిగింది. గత మూడు నెలల కాలంలో గ్యాస్ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. ఈ పెంపు తర్వాత హైదరాబాద్ లో ఎల్పీజీ వంట గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ. 967 గా ఉండగా.. ఇప్పుడు రూ.29 పెరిగి రూ.996కి చేరింది.ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై మరోసారి వంట గ్యాస్ ధరల పెంపుతో మరో భారం పడింది.
పశ్చిమాసియా(మధ్య ప్రాచ్యం)లో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరా ఖర్చులు భారీగా పెరగడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వంటగ్యాస్‌పై ఏకంగా రూ.60,000 కోట్ల భారాన్ని మోశాయి. ఈ నష్టాల నుంచి కంపెనీలను ఆదుకోవడానికి కేంద్ర బడ్జెట్ నుంచి రూ.30,000 కోట్ల నష్టపరిహారాన్ని కూడా ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అయినప్పటికి మరోసారి ఆయిల్ కంపెనీలు ఆర్థిక భారం తగ్గించుకునేందుకు వంట గ్యాస్ ధరలు పెంచడం గమనార్హం.
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్
ఎల్బీజీ వంట గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడంపై కాంగ్రెస్ ఎక్స్ వేదికగా విమర్శించింది. వంట గ్యాస్ పెంపు నిర్ణయంతో ప్రధాని మోదీ సామాన్యులపై కొరఢా ఝులిపించారని..ప్రజల నుంచి దోపిడీ చేసి..తన ధనిక మిత్రులు ఖాజానా నింపుతున్నారని విమర్శించింది.
