Site icon vidhaatha

అధికారంలోకి వ‌స్తే ఉచిత‌ విద్య‌..25 ల‌క్ష‌ల ఆరోగ్య‌బీమా

భోపాల్: మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు గాను ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ త‌న మ్యానిఫెస్టోను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. పేద‌ల‌కు అత్యంత క‌ష్టంగా మారే విద్య‌, వైద్యాన్ని వారికి చేరువ చేసేలా హామీలు ఇచ్చింది. త‌మ‌ను గెలిపిస్తే.. విద్యార్థులంద‌రికీ ఉచితంగా విద్య‌ను అందిస్తామ‌ని, ప్రతి ఒక్క‌రికీ 25 ల‌క్ష‌ల ఆరోగ్య బీమా క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇందులో ప‌ది ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా కూడా ఉంటుంది. 59 హామీల‌తో కూడిన 106 పేజీల ‘వ‌చ‌న్ ప‌త్ర‌స‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌మ‌ల్‌నాథ్, ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ర‌ణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా ప్ర‌క‌టించారు. పేద‌లు, ఆదివాసీలు, మ‌హిళ‌లు, యువ‌కులు, ఉద్యోగులు, రైతాంగం.. ఇలా అన్ని వ‌ర్గాల ప్రజల‌ను దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టోను రూపొందించామని క‌మ‌ల్‌నాథ్ చెప్పారు.

రాష్ట్రంలోని ఓబీసీల‌కు 27శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. యువ‌త‌ను దృష్టిలో ఉంచుకుని.. రాష్ట్రం త‌ర‌ఫున ఒక ఐపీఎల్ జ‌ట్టును త‌యారు చేస్తామ‌ని తెలిపారు. స‌మాజాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని విధాలుగా ఆలోచించి.. ఈ మ్యానిఫెస్టో త‌యారు చేశామ‌ని క‌మ‌ల్‌నాథ్ చెప్పారు. వ్యవ‌సాయ రంగాన్ని, రాష్ట్ర రైతుల‌ను ఆదుకునేందుకు రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల లోపు వ్య‌వ‌సాయ రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని కాంగ్రెస్ త‌న మ్యానిఫెస్టోలో ప్ర‌క‌టించింది. పాడిప‌శువులు ఉన్న‌వారి నుంచి కిలో 2 రూపాయ‌ల చొప్పున పేడ‌ను సేక‌రిస్తామ‌ని హామీ ఇచ్చింది.

ఇక మ‌హిళ‌ల‌కు సంబంధించి.. ప్ర‌తి నెలా 1500 ఆర్థిక స‌హాయం అందిస్తామ‌ని తెలిపింది. వంట‌గ్యాస్ సిలిండ‌ర్‌ను 500కే అందిస్తామ‌ని పేర్కొన్న‌ది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప్రాథ‌మిక విద్య వ‌ర‌కూ ఉచితంగా అందిస్తామ‌ని హామీ ఇచ్చింది. ఉద్యోగులు కోరుతున్న పాత పెన్ష‌న్ విధానాన్ని పున‌రుద్ధ‌రిస్తామ‌ని హామీ ఇచ్చింది. నిరుద్యోగుల‌కు భృతిని ప్ర‌క‌టించారు. ప్ర‌తి నెల క‌నిష్ఠంగా 1500 నుంచి గ‌రిష్ఠంగా 3వేల వ‌ర‌కూ ఇస్తామ‌ని, ఇలా రెండేండ్ల‌పాటు నిరుద్యోగుల‌కు చెల్లిస్తామ‌ని పేర్కొన్న‌ది. గృహ వినియోగ‌దారుల‌కు 100 యూనిట్ల వ‌ర‌కూ ఉచితంగా ఇస్తామ‌ని, త‌దుప‌రి 200 యూనిట్ల వ‌ర‌కూ స‌గం చార్జీ చెల్లిస్తే స‌రిపోతుంద‌ని తెలిపింది. ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రంలో కుల గ‌ణ‌న చేప‌డుతామ‌ని హామీ ఇచ్చింది.

ఇప్ప‌టికే కాంగ్రెస్ నాయ‌కులు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ త‌దిత‌రులు ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా కొన్ని గ్యారెంటీల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అందులో పాత పెన్ష‌న్ విధానంతోపాటు.. గృహాల‌కు వంద యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్తు, మ‌హిళ‌ల‌కు నెల‌కు 1500 సాయం, రుణ‌మాఫీ త‌దిత‌రాలు ఉన్నాయి. ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి 8వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు నెల‌కు 500 రూపాయ‌ల చొప్పున‌, 9, 10 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు నెల‌కు 1000 చొప్పున, 11, 12 త‌ర‌గ‌తుల విద్యార్థుల‌కు 1500 చొప్పున‌ ఉప‌కార వేత‌నాలు ఇస్తామ‌ని గ‌తవారం నిర్వ‌హించిన స‌భ‌లో ప్రియాంక‌గాంధీ హామీ ఇచ్చారు.వాటిని సైతం మ్యానిఫెస్టోలో చేర్చారు.

Exit mobile version