చెన్నై: మద్రాస్ హైకోర్టులో టీవీకే పార్టీకి చుక్కెదురయింది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సీబీఐ దర్యాప్తునకు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తొక్కిసలాట ఘటన విచారణను సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని టీవీకే పార్టీ నాయకులు పిటిషన్ వేశారు.
కేసు దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున ప్రస్తుతానికి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. కోర్టులను రాజకీయ వేదికగా మార్చవద్దని న్యాయమూర్తి పేర్కొన్నారు. నీళ్లు, ఆహారం సదుపాయం లేకుండా సభ ఎలా నిర్వహించారని ధర్మాసనం టీవీకేను ప్రశ్నించింది. రోడ్డుపై సమావేశం ఏర్పాటు చేసుకునేందుకు ఎందుకు అనుమతించారని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. బాధితులకు పరిహారం పెంపు పై రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.