Maoists Clarification Ceasefire  | అది పార్టీ నిర్ణయం కాదు.. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే: మావోయిస్టు పార్టీ

మావోయిస్టుల నుంచి మరో లేఖ వచ్చింది. పొలిట్ బ్యూరో సభ్యుడు సోను చేసిన సాయుధ పోరాట విరమణ ప్రకటనతో పార్టీకి సంబంధం లేదని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ తాజా ప్రకటనలో స్పష్టం చేశారు.

Maoists Clarification Ceasefire  | అది పార్టీ నిర్ణయం కాదు.. తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటన సోనూ వ్యక్తిగత అభిప్రాయమే: మావోయిస్టు పార్టీ

విద్యార్థుల ప్రత్యేక ప్రతినిధి:

Maoists Clarification Ceasefire  | సాయుధ పోరాట విరమణపై కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఇచ్చిన ప్రకటన వ్యక్తిగత అభిప్రాయమే కానీ.. పార్టీ నిర్ణయం కాదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల సోను పేరుతో విడుదలైన ప్రకటనలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధి స్పందించడం గమనార్హం. జగన్ ప్రకటన యధాతథంగా మీకోసం.

గందరగోళం వద్దు

‘కేంద్రంలోని బీజేపీ.. విప్లవోద్యమ నిర్మూలనకు ఎప్పటినుండో పథకాలు వేసుకొని అమలు జరుపుతూ 2024 జనవరి నుండి కగార్ అనే పేరుతో భారీ స్థాయి యుద్ధ చర్యలతో నాయకత్వాన్ని, క్యాడర్లను,  ప్రజలను కూడా నిర్మూలించే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. 2025 మార్చిలో కొంత మంది ప్రజాస్వామిక మేధావులు పీస్ డైలాగ్ కమిటీగా ఏర్పడి ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీకి మధ్య శాంతి చర్చలు జరగాలనే ప్రతిపాదనను చేసింది. ఆ ప్రతిపాదనకు జవాబుగా కేంద్ర కమిటీ పరిస్థితిని వివరిస్తూ.. కూంబింగులు, హత్యాకాండ ఆపాలని, కొత్త క్యాంపుల నిర్మాణాన్ని నిలుపుదల చేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపాలనే విషయాన్ని కేంద్ర కమిటీ ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సడలింపులు లేకుండా యుద్ధ చర్యలను కొనసాగిస్తూ రక్తపుటేరులు పారిస్తూనే ఉంది. కేంద్ర హోమ్ మంత్రి బాహాటంగానే 2026 మార్చి నాటికి మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తానని పదే పదే ప్రకటించాడు. మరొక వైపున తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో ప్రజా సంఘాలు, ప్రజలు కగార్ యుద్ధకాండను నిలుపుదల చేయాలని అందోళన చేశారు. కగార్  యద్దకాండను ఆపాలని దేశవ్యాప్తంగా ఎంతోమంది మేధావులు, సంఘాలు, ప్రముఖులు విజ్ఞప్తులు చేశారు. మిగతా రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల ఈ విషయం మీద సభలు జరిగాయి. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కగార్ యుద్ధకాండను ఆపాలని పెద్దఎత్తున ఆందోళన చేశారు. అయినప్పటికీ ఫాసిస్టు భావజాలంతో రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా నిర్మూలన కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతామని బీజేపీ నాయకత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఈ క్రమంలో దాడులు తీవ్రంగా కొనసాగాయి. మే 21న పార్టీ ప్రధాన కార్యదర్శి ఉన్న టీమ్ మీద దాడి జరిగింది. ప్రధాన కార్యదర్శితో సహా 28 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ లలో ఘటనలలో కేంద్ర కమిటీ సభ్యులు ఉదయ్ అలియాస్ గాజర్ల రవి, మోడెమ్ బాలకృష్ణ, పర్వేశ్ సోరెన్ (జార్ఖండ్) అమరులు అయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతం, భాస్కర్, అరుణ, జగన్ అలియాస్ పండన్న, పండు అలియాస్ చంద్రహాస్ మొదలగువారు అమరులయ్యారు. ఇంకా మరికొద్ది మంది జిల్లా కమిటీ ఏరియా కమిటీ సభ్యులు కూడా అమరులయ్యారు. ఈ పరిస్థితుల్లో  కొంతమంది రాష్ట్ర కమిటీ సభులు, క్రింది స్థాయిల కమిటీ సభ్యులు అనారోగ్య సమస్యల రీత్యా పార్టీ అనుమతితో సరెండర్ అయ్యారు.

దేశవ్యాప్తంగా కగార్ ను నిలుపుదల చేయాలని ఆందోళన చేసినప్పటికీ బీజేపీ ప్రజా వ్యతిరేకంగా హింసా ప్రవృత్తితో ఈ హత్యాకాండను కొనసాగిస్తోంది. పైగా మావోయిస్టులతో చర్చించేది లేదని, ఆయుధాలు విడిచి సరెండర్ కావాలని పదే పదే బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు. మేము చర్చించేది లేదంటూ, మరొక పక్క హత్యాకాండను కొనసాగిస్తూ ఉండగా మాకు నెల రోజులు సమయం ఇవ్వాలని అడగటం అనాలోచిత చర్య. కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ సోనూ సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నామని ఎక్కడెక్కడో సుదీర్ఘంగా ఉన్న పార్టీ నాయకులతో, కార్యకర్తలతో అభిప్రాయాలు తెలుసుకోవడానికి నెల రోజుల వ్యవధి కావాలని, పార్టీ కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను తాను ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్ కు పంపాలని కోరుతూ ప్రకటన ఇచ్చాడు. ఈ విధంగా ప్రకటించడం ఏ పద్దతి అనాలో అర్థం కావటం లేదు. ఉద్యమాన్ని విడిచి ముఖ్యధారలో కలసి లీగల్ గా పనిచేయదలుచుకున్నప్పుడు పార్టీ కమిటీలో చర్చించి అనుమతి పొందవచ్చు. తన అభిప్రాయాన్ని పార్టీ చానల్ లో పంపించి ఉంటే తన ప్రశ్నకు జవాబులు దొరికేవి. అది చేయకపోగా ఈ విధంగా ఇటువంటి కీలక విషయాన్ని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ, విప్లవ శిబిరంలోనూ గందరగోళం తలెత్తుంది. తాను అనుసరించిన పద్దతి ఉద్యమానికి ఉపయోగ పడకపోగా నష్టం చేస్తుంది. నేడు దేశంలోని ఏ పార్టీ అయినా ఇటువంటి నిర్ణయాలను ఇంటర్నెట్ ద్వారా బహిరంగ చర్చకు పెట్టి పరిష్కరించాలని ఎవరూ అలా చేయరు. అటువంటిది రహస్య పార్టీ, కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడిన పార్టీ, తీవ్రమైన దమనకాండ అమలు జరుగుతున్న ఈ పరిస్థితుల్లో సరిగ్గా ఆలోచించేవాళ్లు ఇలా చేయరు. పార్టీలో పై స్థాయి నుండి క్రింది వరకు నేడు ఎదుర్కొంటున్న సమస్య మీద అందరూ తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. అనవసరంగా నష్ట పోవాలని ఎవరూ అనుకోవటం లేదు.

కాబట్టి ఈ సమస్యకు పరిష్కారంఈ విధంగా బహిరంగ ప్రకటనలతో అయ్యేది కాదు. ఒక భయంకరమైన దమనకాండలో ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యకు ఇప్పటికీ ఇప్పుడే పరిష్కారం దొరకక పోవచ్చు. 2024లో పాలిట్ బ్యూరో విడుదల చేసిన సర్క్యులర్ ను అమలు జరపటమే తక్షణ కర్తవ్యం. నేడు పాలస్తీనా విషయంలో ఎలాంటి మారణకాండ జరుగుతున్నదో ప్రపంచవ్యాప్తంగా అర్థం అవుతున్నది. అనగా ప్రపంచవ్యాప్తంగానే దమనకాండ స్థాయి పెరిగిందని అర్థమవుతుంది. ఇంటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం కలిగించేవే కానీ ప్రయోజనం ఏ మాత్రం లేనివి. ఇది పార్టీ అధికారిక ప్రకటన కాదు. విప్లవ శిబిరం, మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీనిని అధికారిక ప్రకటనగా గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ ప్రకటనతో గందరగోళ పడాల్సిన అవసరం లేదు. ఫాసిస్టు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు తీవ్రతరం చేయాలి.’