- 2021లో తొలుత రైతు నల్ల చట్టాలపై పీఛేముడ్
- తాజాగా నీటీ యూజీ పేపర్ లీకేజీ పై రెండోసారి
- బీజేపీ సర్కార్ కు ఉద్యమాల షాక్
- 12 ఏళ్ల పాలనలో తొలిసారి మంత్రిపై వేటు
విధాత, హైదరాబాద్:
కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు లోపల బయటా ఎన్ని ఆందోళనలు నిర్వహించినా ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క మెట్టు కూడా కిందికి దిగలేదు. సరికదా బహిరంగ సభా వేదికలపై ప్రతిపక్షాలపై విరుచుకుపడేవారు. నెల రోజులుగా పార్లమెంటు లోపల కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నీట్ కుంభకోణంపై ఎండగడుతున్నాయి. అయినా మోదీ ఏమాత్రం చలించలేదు. కాని విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల ఆందోళనకు తలవంచక తప్పలేదు.
నాడు తలొంచేలా చేసిన రైతులు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన సాగు చట్టాలను తెచ్చేందుకు 2020 సంవత్సరంలో సిద్ధమైంది. ఈ మేరకు మూడు చట్టాలను రూపొందించేందుకు, కార్పొరేట్లను పెంచి పోషించేందుకు ఆమోదించింది కూడా. ఈ చట్టాలపై ట్రాక్టర్ ర్యాలీ తరువాత వ్యతిరేక ఉధ్యమం మరుగున పడిందని పాలకపక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఊహించాయి. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ వ్యవస్థాపకుడు, రైతు రాకేశ్ టికాయిత్ ఉద్యమాన్న ఉధృతం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోని సిసౌలీకి చెందిన సుప్రసిద్ధ రైతు నేత మహేంధ్ర సింగ్ టికాయ్ కుమారుడే రాకేశ్. ఆయన తండ్రి స్థాపించిన యూనియన్ కు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నారు. ఢిల్లీ ఘనతంత్ర వేడుకల రోజున రైతులు పెద్ద ఎత్తున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన అల్లర్ల కారణంగా ఉద్యమం ఆగిపోయిందనుకున్న తరుణంలో రాకేశ్ టికాయత్ రంగంలోకి దిగి తారాస్థాయికి తీసుకువెళ్లారు. ఆయన ప్రసంగానికి ఆకర్షితులు అయిన రైతాంగం తమ సంపూర్ణ మద్ధతు ప్రకటించింది. మా ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదంటూ, పార్లమెంటులో నల్ల సాగు చట్టాలను రద్ధు చేసే వరకు కొనసాగుతుందని రాకేశ్ స్పష్టం చేయడంతో మరింత వేడెక్కింది. ఎంతో పరిణితితో, తెగువతో రైతుల ఆగ్రహాన్ని ఉద్యమాన్ని మలిచారు. ఉద్యమాన్న అణచివేసేందుకు బీజేపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, పోలీసు బలగాలను ఉపయోగించినా ఏమాత్రం వెనక్క తగ్గలేదు. 11 సార్లు కేంద్రంతో చర్చలు జరిగినా సమస్య కొలిక్కి రాలేదు. సుప్రీంకోర్టు మూడు చట్టాల అమలుపై స్టే విధించినా రైతులు ఆందోళన విరమించలేదు. దేశ వ్యాప్తంగా రైతు ఉద్యమానికి ప్రజలను నుంచి అనూహ్య మద్ధతు రావడంతో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి తలొగ్గక తప్పలేదు. మూడూ వివాదాస్పద సాగు చట్టాల అమలు ఉపసంహరణ 2021 నవంబర్ నెలలో పార్లమెంటులో ఆమోదముద్ర పడింది. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు, దేశానికి క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత నవంబర్ 24వ తేదీన కేంద్ర మంత్రి మండలిలో ఈ మూడు చట్టాలను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. శీతాకాల సమావేశాల తొలిరోజున ఉభయ సభల్లో మూడు ఉపసంహరణ బిల్లులను ప్రవేశపెట్టి గట్టెక్కించింది.
బొద్దింకల తిరుగుబాటు
నీట్ అండర్ గ్రాడ్యుయేట్ పేపర్ లీకేజీ బాద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 6వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన నిర్వహించింది. ఈ నిరసన కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా పలువురు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రముఖ పర్యావరణవేత్త, ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ జూన్ 28వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్ష ను ప్రారంభించారు. జూలై 18వ తేదీన ఆయన దీక్ష 21 రోజులకు చేరుకోవడం, ఆరోగ్యం క్షీణిస్తుండడంతో పోలీసులను ప్రభుత్వం రంగంలోకి దించింది. నీరసించిపోయిన ఉన్న ఆయనను పోలీసులు చుట్టుముట్టి, బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే జంతర్ మంతర్ వద్ద తన నిరాహార దీక్ష ను ప్రారంభించారు. కేంద్ర మంత్రులతో సీజేపీ ప్రతినిధులు జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో సోనం వాంగ్ చుక్ గురుగ్రామ్ లోని మేధాంత ఆసుపత్రలో రెండు రోజుల క్రితం తన నిరవధిక నిరహార దీక్ష ను విరమించారు. ఆయన చేత కేంద్ర మంత్రులు డాక్టర్ జేపీ నడ్డా, డాక్టర్ జితేంద్ర సింగ్ లు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేయించారు. 26 రోజుల పాటు సోనమ్ దీక్ష ను కొనసాగించి మోదీ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడంలో సఫలం అయ్యారు. ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కదిలేది లేదని సోనమ్ వాంగ్ చుక్, ఉద్యమకారులు భీష్మించుకు కూర్చున్నారు. ఉద్యమం మరింత ఉధృతం దాల్చే అవకాశం ఉండడం, పరిస్థితుల చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ఇంటెలీజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికతో ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రధాని మోదీ ఆదేశం మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ శనివారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో సుధీర్ఘ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. పరీక్షల వివాదంపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును సమర్థించుకున్నారు. తాజాగా నెలకొన్న పరిస్థితులను పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, దేశ వ్యతిరేక శక్తులు దీన్ని ఆసరాగా చేసుకోకుండా ఉండేందుకు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రధాన్ ప్రకటించారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటనతో జంతర్ మంతర్ వద్ద ఉద్యమకారులు సంబురాలు చేసుకున్నారు. ప్రభుత్వం మన డిమాండ్లను అన్నింటిని అంగీకరించినందున, దీక్ష ముగిసిందని సీజేపీ ప్రకటించింది. అందరూ క్షేమంగా ఇళ్లకు వెళ్లిపోవాలని, మద్దతు ప్రకటించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
ఐదేళ్ల తరువాత సాగు రైతు నల్ల చట్టాలపై వెనక్కి తగ్గిన విధంగానే విద్యార్థుల ఉద్యమానికి ప్రధాని నరేంద్ర మోదీ తలవంచక తప్పలేదు. మోదీ నాయకత్వంలో తొలిసారిగా ఒక కేంద్ర మంత్రి చేత అవినీతి మరకపై బలవంతంగా రాజీనామా చేయించడం గమనార్హం. సీజేపీలో ఉన్నవారందరూ హిందువులు, యువకులు, ఉత్తర భారతానికి చెందినవారు ఉన్నారని ప్రముఖ చరిత్ర ఆచార్యులు హర్జేశ్వర్ పాల్ సింగ్ వెల్లడించారు. షహీన్ బాగ్ మాదిరి ఈ ఉద్యమం పై నిందలు వేసేందుకు బీజేపీ ప్రభుత్వం అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు. గతంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల పై ఖలిస్థాన్, దేశ వ్యతిరేక శక్తులు అని ముద్ర వేసిందని ఆయన గుర్తు చేశారు. నీట్ పేపర్ లీకేజీ పై ఉద్యమించిన నిరసనకారులు, విద్యార్థులపై దేశ వ్యతిరేకులు, హిందు వ్యతిరేకులు అనే ముద్ర వేయడానికి ఆర్ఎస్, బీజేపీకి ఏమాత్రం ఆధారాలు లభించలేదని పాల్ పేర్కొన్నారు.
