కుంభమేళా..మోనాలిసా వివాహంలో బిగ్ ట్విస్ట్!

ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మోనాలిసా పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మోనాలిసా మైనర్ అని తేలడమే అందుకు కారణమైంది.

కుంభమేళా..మోనాలిసా వివాహంలో బిగ్ ట్విస్ట్!

విధాత: ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ వైరల్ అయిన మోనాలిసా పెళ్లిలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. మోనాలిసా మైనర్ అని తేలడమే అందుకు కారణమైంది. కుంభమేళాతో పూసలమ్మాయి మోనాలిసా సోషల్ మీడియా పుణ్యమా అని ఒక్కరోజులోనే సెలబ్రిటీ కావడంతో పాటు సినీ స్టార్ గా కూడా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల మోనాలిసా తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో ప్రేమ వివాహం చేసుకోవడం వివాదస్పమైంది. ఈ పెళ్లి లవ్ జిహాద్ అని.. ఆమె మైనర్ అన్న ఆరోపణలు వచ్చాయి.

ఎన్‌సీఎస్టీ విచారణలో మైనర్ 

మోనాలిసా మైనర్ అంటూ వచ్చిన ఆరోపణలపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) విచారణ చేపట్టింది. ఆమె మైనర్ అని కమిషన్ తేల్చింది. కమిషన్ విచారణలో మోనాలిసాకు పెళ్లి అయ్యే సమయానికి ఆమె వయసు 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమే అని తేలింది. ఆమె 2009 డిసెంబర్ 30న సాయంత్రం 5.50 గంటలకు జన్మించిందని ప్రభుత్వ వైద్య ఆసుపత్రి రికార్డుల ప్రకారం వెల్లడైంది. మార్చి 11, 2026 మోనాలిసా, ఫర్మాన్ పెళ్లి జరిగింది. అప్పటికీ ఆమె మైనరు కావడంతో ఫర్మాన్ ఖాన్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది.

తప్పుడు పుట్టిన తేదీ…ఫోక్సో కేసు నమోదు

మోనాలిసా తప్పుడు పుట్టిన తేదీ ఆధారంగా పెళ్లి చేసుకుందని కమిషన్ స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ మున్సిపాలిటీ ఆమెకు జారీ చేసిన డేటాఫ్ బర్త్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మోనాలిసా షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గానికి చెందినదిగా కమిషన్ వెల్లడించింది. కమిషన్ ఆదేశాల మేరకు ఆమెను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ పై మధ్యప్రదేశ్ లోని ఖర్ గోన్ జిల్లాలో ఉన్న మహేశ్వర్ పోలీస్ స్టేషన్ లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అంతే కాకుండా మోనాలిసా షెడ్యూల్డ్ ట్రైబ్ వర్గానికి చెందిన యువతి కావడంతో బీఎన్ఎస్, అట్రాసిటీ చట్టం కింద కూడా ఫర్మాన్ ఖాన్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్రమ వివాహానికి చెందిన వివిధ సెక్షన్ల కింద కూడా చర్యలు తీసుకోబోతున్నారు.

వివాదంగా మారిన మోనాలిసా పెళ్లి

మోనాలిసా మార్చి 11న కేరళలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను వివాహం చేసుకుంది. ఇండోర్ అమ్మాయి అయిన మోనాలిసా ఆరు నెలల క్రితం ఫర్మాన్ ఖాన్‌ను కలిసింది. అయితే వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో వారి కుటుంబాలు పెళ్లికి ఇష్టపడలేదు. దీంతో వీళ్లు పారిపోయి హిందూ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. తిరువనంతపురం సమీపంలోని పూవార్‌లోని చరిత్రాత్మక అరుమానూర్ శ్రీ నైనార్ దేవాలయంలో ఈ మతాంతర వివాహం జరిగింది. ఈ వేడుకకు కేరళ మంత్రులు వి. శివన్‌కుట్టి, ఎం.వి. గోవిందన్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.ఎ. రహీమ్ హాజరయ్యారు. మోనాలిసా, ఫర్మాన్ ఖాన్ పెళ్లి లవ్ జిహాద్ లో భాగంగానే జరిగిందన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. దర్శకుడు సనోజ్ మిశ్రా దీనిని ‘లవ్ జిహాద్’గా అభివర్ణించగా, మోనాలిసా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే తొలుత మోనాలిసానే తనకు ప్రపోజ్ చేసిందని, ఫస్ట్ రిజెక్ట్ చేసినా ఆ తర్వాత ప్రేమించానని ఫర్మాన్ చెప్పడం గమనార్హం.