Site icon vidhaatha

హౌస్ కీప‌ర్ ఇంట్లో నోట్ల గుట్ట‌లు.. రూ. 25 కోట్ల‌కు పైగా సీజ్

రాంచీ : జార్ఖండ్‌లోని ఓ ఇంట్లో నోట్ల క‌ట్ట‌లు కాదు.. నోట్ల గుట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌రి ఈ నోట్ల గుట్ట‌లు బ‌య‌ట‌ప‌డింది.. ఏ రాజ‌కీయ నాయ‌కుడో.. ఏ ఉన్న‌తాధికారి ఇంట్లోనో అనుకుంటే పొర‌పాటే. ఓ హౌస్ కీప‌ర్ ఇంట్లో రూ. 25 కోట్ల నోట్ల గుట్ట‌లు బ‌య‌ట‌ప‌డ‌డంతో అధికారులు అవాక్క‌య్యారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద రాజ‌ధాని న‌గ‌రం రాంచీలోని ప‌లు ప్రాంతాల్లో సోమ‌వారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ‌లో ప‌ని చేసిన మాజీ చీఫ్ ఇంజినీర్ వీరేంద్ర రామ్ మ‌నీలాండ‌రింగ్ కేసులో 2023 ఫిబ్ర‌వ‌రిలో అరెస్టు అయ్యారు. ఈ క్ర‌మంలో ఆయ‌న అక్ర‌మాస్తుల‌పై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా సోమ‌వారం ఉద‌యం ఆయ‌న‌కు సంబంధించిన 10కి పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.

ఈ కేసు ద‌ర్యాప్తులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంఘీర్ ఆలం వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి సంజీవ్ లాల్ ఇంట్లో హౌస్ కీప‌ర్‌గా ప‌ని చేస్తున్న వ్య‌క్తి ఇంట్లో ఈడీ అధికారులు త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా హౌస్ కీప‌ర్ ఇంట్లో నోట్ల గుట్ట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఒక గ‌దిలో నోట్ల క‌ట్ట‌లు పేర్చి ఉన్న దృశ్యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మొత్తంగా రూ. 25 కోట్ల‌కు పైగానే న‌గ‌దు ప‌ట్టుబ‌డిన‌ట్లు అధికారులు తేల్చారు.

ప‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌ల్లో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని, రూ. 100కోట్ల మేర కూడ‌బెట్టార‌ని వీరేంద్ర‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి చెందిన ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌తో ఆయ‌న జ‌రిపిన లావాదేవీల వివ‌రాల‌తో కూడిన పెన్‌డ్రైవ్‌ను ఇప్ప‌టికే అధికారులు సీజ్ చేశారు. ఆ పెన్ డ్రైవ్‌లో ఉన్న స‌మాచారం ఆధారంగానే ఈడీ సోదాలు చేప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

Exit mobile version